ఆర్టీసీ బస్సుల్లో కార్డు చెల్లింపులు!
ABN, First Publish Date - 2022-01-06T06:55:36+05:30
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న టీఎ్‌సఆర్టీసీ.. ప్రయాణికులకు మరో వెసులుబాటును కల్పించేందుకు సిద్ధమవుతోంది.
డెబిట్/క్రెడిట్ కార్డుల స్వైపింగ్‌తో టికెట్లు
హైదరాబాద్ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న టీఎ్‌సఆర్టీసీ.. ప్రయాణికులకు మరో వెసులుబాటును కల్పించేందుకు సిద్ధమవుతోంది. టికెట్ల కొనుగోలు సమయంలో చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. కార్డుల (డెబిట్/ క్రెడిట్) ద్వారా చెల్లింపుల (స్వైపింగ్)తో ప్రయాణికులకు టికెట్లు అందించే దిశగా చర్యలు తీసుకుంటోంది. తొలుత హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి జిల్లాలకు నడుపుతున్న బస్సుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. టీఎ్‌సఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీలో సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎంజీబీఎస్, జేబీఎ్‌సలతో పాటు గ్రేటర్ జోన్ వ్యాప్తంగా బస్‌పాస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్‌తో చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు నగరం నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో కార్డు చెల్లింపులతో టికెట్లు జారీ చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తే చిల్లర కష్టాలకు తెర దించడంతోపాటు టికెట్ల రాబడి నేరుగా ఆర్టీసీ బ్యాంక్ ఖాతాలో పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎంజీబీఎస్, జేబీఎ్‌సల నుంచి రోజూ 4 వేలకు పైగా బస్సులు జిల్లాలకు వెళ్తుంటాయి. తొలి విడతలో 900 బస్సుల్లో కార్డు చెల్లింపులు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ఫలితాల ఆధారంగా అన్ని బస్సుల్లో ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్‌లో టీఎ్‌సఆర్టీసీలో పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా టీఎ్‌సఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని బస్‌పాస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్ తో చెల్లింపుల సౌకర్యం కల్పించిన తర్వాత ఆదాయం కూడా పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2022-01-06T06:55:36+05:30 IST