డబుల్ బెడ్రూం ఇళ్లపై టీఆర్ఎస్ నేతల దందా: Vijayashanti
ABN, First Publish Date - 2022-04-26T15:24:36+05:30
పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్రూం ఇళ్లను కొందరు టీఆర్ఎస్ లీడర్లు బేరం పెట్టి దందా చేస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్రూం ఇళ్లను కొందరు టీఆర్ఎస్ లీడర్లు బేరం పెట్టి దందా చేస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫేస్బుక్ వేదికగా మాట్లాడుతూ.... లక్ష, రెండు లక్షల చొప్పున వసూలు చేసి రాత్రికి రాత్రే లిస్టులు మార్చేస్తున్నారని ఆరోపించారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని, అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరుల పేర్లు చేరుస్తున్నారన్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో నిర్మించిన 20 డబుల్ బెడ్రూం ఇళ్లను 3 నెలల కిందట ఎమ్మెల్యే ఆలం వెంకటేశ్వర్ రెడ్డి గ్రామస్తులకు పంపిణీ చేశారని బీజేపీ నేత తెలిపారు. ఎలాంటి భూమి, జాగ లేకుండా గుడిసెల్లో ఉండే పేదలను కాదని అప్పటికే ఇళ్లు ఉన్నవాళ్లకు డబుల్బెడ్రూం ఇల్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి దక్కినవాళ్లలో ఇళ్లు, ఇతర ఆస్తిపాస్తులు ఉన్న గ్రామ సర్పంచ్ తల్లితో పాటు ఎమ్మెల్యే అనుచరులున్నారని తెలిపారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారని, దీనిపై గ్రామానికి చెందిన ఎ.కొండన్న, సి.లక్ష్మయ్య, బోయ ఊశన్న, పి.మన్యం, చంద్రయ్య తదితరులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విజయశాంతి అన్నారు.
చివరికి బాధితులంతా హైకోర్టును ఆశ్రయించారన్నారు. విచారణ చేపట్టిన కోర్టు... రాష్ట్ర హౌసింగ్ సెక్రటరీ, వనపర్తి జిల్లా కలెక్టర్, మిరాసిపల్లి గ్రామ సెక్రటరీకి ఇటీవల నోటీసులు జారీ చేసిందని చెప్పుకొచ్చారు. లబ్ధిదారుల వివరాలతో హాజరు కావాలని ఆదేశించిందని తెలిపారు. లబ్ధిదారుల వివరాలు పరిశీలించిన అనంతరం... సగం మంది అనర్హులు ఉన్నట్టు తేలడంతో మొత్తం కేటాయింపులు రద్దు చేసి తిరిగి అర్హులను ఎంపిక చేయాలని హైకోర్టు తీర్పు చెప్పిందని బీజేపీ నేత చెప్పారు. అలాగే సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక మున్సిపాలిటీ, పెద్దపల్లి జిల్లా మంథని, మహబూబాబాద్, వరంగల్ కార్పొరేషన్లో కూడా అచ్చు గుద్దినట్టు ఇలాంటి ఘటనలే జరిగాయన్నారు. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని లబ్దిదారులు హెచ్చరిస్తున్నారని విజయశాంతి పేర్కొన్నారు.
Updated Date - 2022-04-26T15:24:36+05:30 IST