దళితులను మోసగిస్తున్న కేసీఆర్
ABN, First Publish Date - 2022-12-07T02:59:48+05:30
దళితులను మోసగించడమే కేసీఆర్ పని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దళితులను సీఎం చేస్తానని చెప్పిన హమీ నుంచి నిన్నటి దళితబంధు అమలు వరకూ ఏ ఒక్కటీ అమలు చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు.
బిడ్డ పరేషాన్ వల్లే ‘జీ-20’ భేటీ మరిచారు
లిక్కర్ స్కామ్‌లో కవిత జైలుకెళ్లడం ఖాయం
సెంటిమెంట్ రెచ్చగొట్టి ముందస్తుకు ప్లాన్
అంబేడ్కర్ పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదు
ప్రజా సంగ్రామ యాత్రలో సంజయ్ ధ్వజం
నిర్మల్/హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): దళితులను మోసగించడమే కేసీఆర్ పని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దళితులను సీఎం చేస్తానని చెప్పిన హమీ నుంచి నిన్నటి దళితబంధు అమలు వరకూ ఏ ఒక్కటీ అమలు చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. లిక్కర్ స్కామ్‌లో సీబీఐ నోటీసులు వచ్చినప్పటి నుంచి, ఆ కేసు నుంచి బిడ్డను ఎలా బయట పడేయాలా? అన్న ఆందోళనలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ పరేషాన్‌లోనే దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు, అన్ని పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన జీ-20 సన్నాహాక అఖిలపక్ష సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొట్టాడని వ్యాఖ్యానించారు. ఇంత ముఖ్యమైన సమావేశానికి హాజరయ్యే తీరిక కూడా కేసీఆర్‌కు లేదా? అని నిలదీశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకెళ్లడం ఖాయమన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం నిర్మల్ జిల్లాలోని దిమ్మదుర్తిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు మాత్రమే కనిపించే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు దళిత ద్రోహులని ఆరోపించారు. అంబేడ్కర్ పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కేసీఆర్‌కైతే అంబేడ్కర్ జయంతి, వర్ధంతి ఉత్సవాలను నిర్వహించే తీరిక లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే అంబేడ్కర్ జయంతి, వర్ధంతి ఉత్సవాలను వారంపాటు నిర్వహిస్తామని ప్రకటించారు. అంబేడ్కర్‌ను గౌరవిస్తానని చెప్పే కేసీఆర్.. ట్యాంక్‌బండ్ వద్ద విగ్రహ ఏర్పాటుకు ఇంకెన్నాళ్ల సమయం తీసుకుంటారని ప్రశ్నించారు.
సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి..
ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమవుతున్నారని సంజయ్ ఆరోపించారు. దీనిని తిప్పికొడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు ఉధృతం చేయాలని మోర్చాల అధ్యక్షులకు పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో టీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకత కనిపిస్తోంది. నా పాదయాత్రలో జనం తండోపతండాలుగా తరలివచ్చి టీఆర్‌ఎస్ అరాచకాలను వివరిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే’’అని పేర్కొన్నారు. పాదయాత్రలో భోజన విరామం సందర్భంగా వివిధ మోర్చాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. మోర్చాల పనితీరు, కమిటీల నియామకం, సంస్థాగత బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
Updated Date - 2022-12-07T02:59:50+05:30 IST