పట్టుతప్పుతున్న పాలన!
ABN, First Publish Date - 2022-10-18T05:27:34+05:30
జిల్లాలో గ్రామ పంచాయతీల పాలన పట్టు తప్పుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పలువురు సర్పంచ్, కార్యదర్శుల పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒకరిద్దరిని సస్పెండ్ చేసిన అధికారులు పలువురు సర్పంచ్, కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు అందించారు. అయిన వారి పనితీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే
జిల్లాలో గ్రామ కార్యదర్శులపై తీవ్రమవుతున్న ఒత్తిళ్లు
మహిళా సర్పంచ్ల స్థానంలో భర్తలదే పెత్తనం
పలుచోట్ల వేటు పడుతున్నా.. వెనక్కి తగ్గని వైనం
రాజకీయ అండదండలతో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలు
జిల్లావ్యాప్తంగా మొత్తం 468 గ్రామ పంచాయతీలు
ఆదిలాబాద్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీల పాలన పట్టు తప్పుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పలువురు సర్పంచ్, కార్యదర్శుల పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒకరిద్దరిని సస్పెండ్ చేసిన అధికారులు పలువురు సర్పంచ్, కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు అందించారు. అయిన వారి పనితీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే ఉండాలని కలెక్టర్ పలుమార్లు ఆదేశించినా.. ఏఒక్కరు స్థానికంగా ఉంటున్నట్లు కనిపించడం లేదు. సమయపాలన లేకపోవడంతోనే పల్లె ప్రగతి పనుల్లో పురోగతి లేదంటున్నారు. మూడేళ్లుగా పడుతూ లేస్తున్న శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డుల నిర్మాణం పనులు పూర్తి కావడం లేదంటే ఎంతటి నిర్లక్ష్యం కనిపిస్తుందో ఇట్టే తెలుస్తుంది. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు ఉండగా పదుల సంఖ్యల పంచాయతీల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో గ్రామ కార్యదర్శులపై సర్పంచ్ భర్తల పెత్తనం పెరిగి పోయిందంటున్నారు. గ్రామాల్లో చేపట్టే కీలకమైన అభివృద్ధి పనుల తీర్మానాలల్లోనూ మహిళా సర్పంచ్ కుటుంబ సభ్యులదే పైచేయిగా మారింది. కనీసం గ్రామసభలు నిర్వహించిన సమయంలోను కొంతమంది మహిళ సర్పంచ్‌లు సమావేశాలకు హాజరుకావడం లేదని తెలుస్తుంది. పంచాయతీకి సంబంధించిన చెక్కుల పైభర్తలే ఫోర్జరీ సంతకాలు చేస్తూ నిధులను డ్రా చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఫోర్జరీ చెక్కులపై లోతుగా దర్యాప్తు జరిపితే ఎన్నో అవినీతి అక్రమాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు. స్థానిక సంస్థల పాలనను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేకంగా అదనపు కలెక్టర్‌ను నియమించిన పంచాయతీ పాలన గాడిలో పడినట్లు కనిపించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
పేరుకే గ్రామానికి సర్పంచ్
జిల్లాలో ఉన్న 468 గ్రామ పంచాయతీలలో సగం మంది మహిళా సర్పంచ్‌లే అయినప్పటికీ.. అన్నిచోట్ల భర్తలదే పెత్తనం కనిపిస్తోంది. గెలిచిన రెండున్నరేళ్లలో అడపాదడపగా పంచాయతీ సమాశాలకు హాజరవుతున్నా.. గ్రామ పాలనలో మహిళా సర్పంచ్ల ప్రత్యేక ముద్ర కనిపిచండం లేదు. అంతా భర్తలు, కుటుంబ సభ్యులు చెప్పినట్లుగానే పాలన కొనసాగుతోంది. మహిళా ప్రజాప్రతినిధులతో గ్రామాభివృద్ధికి అవకాశం ఉంటుందని అందరూ భావించినా.. భర్తలు, కొడుకులదే పెత్తనం కొనసాగుతోంది. రిజర్వేషన్ కింద పదవులు దక్కించుకున్నా.. పేరుకే సర్పంచ్ అనేవిధంగా మారిందంటున్నారు. వారి కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాలు గ్రామాల్లో పలు వివాదాలకు, గొడవలకు దారి తీస్తున్నాయి. అయినా అధికారులు తేలికగానే తీసుకోవడం తో పంచాయతీ పాలనలో మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని టార్గెట్ విధిస్తున్నా.. జిల్లా అధికారులు పట్టుతప్పుతున్న పంచాయతీ పాలనపై ప్రత్యేక దృష్టిని సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో విధులు నిర్వహిస్తున్న వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలే కనిపించడం లేదు.
ప్రశ్నిస్తే బెదిరింపులే..
పంచాయతీ పాలనలో కీలకమైన గ్రామ కార్యదర్శుల పాత్ర నామమాత్రంగానే కనిపిస్తోంది. ఏదైనా అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే బెదిరింపులు తప్పడం లేదని పలువురు పంచాయతీ సెక్రటరీలు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకుంటే సర్పంచ్ల భర్తలు లేనిపోని కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు. మాట వినకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ.. ముప్పుతిప్పలు పెట్టడంతో తమకెందుకులే అంటూ వదిలేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు కూడా సక్రమంగా విధులకు హాజరుకాక పోవడం, సమయపాలన పాటించక పోవడంతో సర్పంచ్‌లకు అనిగిమనిగి ఉండాల్సి వస్తోంది. పంచాయతీ పాలనలో ఆరితేరిన కొందరు సర్పంచ్‌లు తమ మాట వినని కార్యదర్శులపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి చిన్నపాటి లొసుగులతో సర్పంచ్‌లు చెప్పినట్లే వినాల్సి వస్తోందని కొందరు కార్యదర్శులు బహిరంగంగానే వాపోతున్నారు. స్థానికం గా ఉండకపోవడంతో గ్రామ ప్రజల సమస్యలు, గ్రామ పాలనపై పట్టు సాధించలేక పోతున్నారు. నిత్యం గ్రామానికి ఇలా వచ్చి అలా వెళ్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో సర్పంచ్, కార్యదర్శులు తలొకొంత పర్సంటేజీల రూపంలో పంచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్థిక స్థోమత లేని సర్పంచ్‌లను పక్కన పెట్టి కొందరు కార్యదర్శులు అభివృద్ధి పనుల్లో తలదూర్చుతూ అడ్డగోలుగా బిల్లులు జేబులో వేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
అధికారుల పరోక్ష సహకారం
గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు కొందరు అధికారులే సర్పంచ్‌లకు పరోక్ష సహకారాన్ని అందిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో స్థాయికి మించి ఖర్చు చేయడం, ఆ తర్వాత చేసిన అప్పులను తీర్చే మార్గం లేక పంచాయతీ నిధులపై కన్నెస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడడం కొందరు సర్పంచ్‌లకు అలవాటుగా మారింది. గతంలో ఇచ్చోడ మండలం నర్సాపూర్ సర్పంచ్ అవినీతికి పాల్పడ్డాడంటూ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అలాగే పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేశాడంటూ జైనథ్ మండలం బోరజ్ గ్రామ సర్పంచ్‌పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. రాజకీయ నేతల ఒత్తిళ్లతో అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్‌ను రద్దు చేసిన దాఖలాలున్నాయి. ఆడిట్ అధికారుల రికార్డుల పరిశీలనలో అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నా.. గుట్టుచప్పుడుకాకుండా సెటిల్ చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఆడిట్ అధికారులు కూడా ఎంతోకొంత తీసుకున్ని ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వకుండానే సైలెంట్ అయిపోతున్నారనే ఆరోపణలున్నాయి.
అవినీతి, అక్రమాలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
: శ్రీనివాస్, డీపీవో, ఆదిలాబాద్
అవినీతి అక్రమాలు జరిగినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలువురు సర్పంచ్, కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పంచాయతీ పాలన కొనసాగుతోంది. చట్టాన్ని ఎవరు అతిక్రమించిన చర్యలు తప్పవు. మహిళ సర్పంచ్ల స్థానంలో భర్తలు, కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటే సహించేది లేదు. ప్రస్తుతం కొన్ని గ్రామ పంచాయతీలపై ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
Updated Date - 2022-10-18T05:27:34+05:30 IST