ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ‘పోడు’ సర్వే
ABN, First Publish Date - 2022-10-18T03:37:44+05:30
పోడు భూముల వ్యవహారాన్ని తేల్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులను గుర్తించేందుకు సర్వేలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జిల్లా కమిటీల విషయంలో పీఠముడి పడినా అధికారులతో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో ఈనెల1 నుంచి జిల్లాలోని మొత్తం 268 జీపీల్లో, 787 ఆవాసాల్లో 31,676 దరఖాస్తులకు సంబంధించి అధికారులు సర్వేకు శ్రీకారం చుట్టారు.
-పదిహేను రోజులుగా విస్తృతంగా అధికారుల పర్యటన
-సర్వే త్వరితగతిన పూర్తిచేయాలని ఉన్నతాధికారుల హుకుం
-జిల్లాలో 1.21లక్షల ఎకరాలకు దరఖాస్తులు
-35ఆవాసాలు, 7వేల ఎకరాల్లో సర్వే పూర్తి
-పరిస్థితిని ఎప్పకప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్, అదనపు కలెక్టర్లు
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్)
పోడు భూముల వ్యవహారాన్ని తేల్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులను గుర్తించేందుకు సర్వేలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జిల్లా కమిటీల విషయంలో పీఠముడి పడినా అధికారులతో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో ఈనెల1 నుంచి జిల్లాలోని మొత్తం 268 జీపీల్లో, 787 ఆవాసాల్లో 31,676 దరఖాస్తులకు సంబంధించి అధికారులు సర్వేకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మొత్తం 68బృందాలు ప్రస్తుతం గ్రామాల్లో పోడుసర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ సర్వే ప్రక్రియ పూర్తైన తర్వాత సర్వే బృందాలు ఇచ్చేని వేదికలను ఆధారంగా అర్హులను గుర్తించి ఆర్వోఎఫ్ఆర్ కింద పట్టాలు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆర్వోఎఫ్ఆర్ పట్టాల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలకు తావులేని రీతిలో పగడ్బందీగా సర్వే చేపడుతున్నారు. ఈ సర్వే కమిటీల్లో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని అటవీశాఖకు చెందిన బీట్ అధికారి, పంచాయతీ కార్యదర్శి, గ్రామరెవెన్యూ సహాయకులతోపాటు ఎఫ్ఆర్సీ కమిటీల సభ్యుల సమక్షంలో సంబంధిత గ్రామాల రెవెన్యూ మ్యాప్‌ను ఆధారంగా చేసుకొని సర్వేను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సర్వే జరుగుతున్న గ్రామాల్లో దరఖాస్తులు చేసుకున్న ఆదివాసీ రైతుల దరఖాస్తులను పరిశీలించి వారు సాగు చేసుకుంటున్న భూములకు కొలతలు నిర్ణయించి నమోదు చేస్తున్నారు. తదుపరి ప్రక్రియలోవీరి దరఖాస్తులను పరిశీలించి జిల్లా స్థాయిలో పట్టాల జారీపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. సర్వే సందర్భంగా ఎలాంటి వివదాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టినట్టు చెబుతున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్‌బాజ్‌పాయ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే తీరు తెన్నులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం సర్వే మందకొడిగా సాగుతోంది. నిర్ధిష్ట కాల పరిమితి లేనందున ఎలాంటి తప్పులకు తావులేకుండా చేయాలన్న సంకల్పంతోనే సర్వే జరుగుతుందంటున్నారు. ఉన్నతాధికారులు సర్వే ప్రక్రియను వేగవంతం చేసి వీలైంతన త్వరగా నివేదిక అందించాలని కోరటంతో రాబోయే పక్షం రోజుల్లో సర్వే ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉంది. జిల్లాలోని 15మండలాల్లోనూ ఈ సర్వే ప్రక్రియ నడుస్తున్నా కొన్ని మండలాల్లో మాత్రమే వేగంగా జరుగుతున్నట్టు గుర్తించారు.
ఇదీ మండలాల వారీగా పురోగతి..
ఆసిఫాబాద్ మండలంలో 15గ్రామాలకు గాను 58ఆవాసాలుండగా 1561 మంది ఆదివాసులు 6522.35ఎకరాల కోసం పోడు హక్కుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కాగా ఇక్కడ ఏడు బృందాలు పోడు సర్వే నిర్వహిస్తుండగా సోమవారం నాటికి 247దరఖాస్తులను పరిశీలించి మొత్తం 615.39 ఎకరాల భూమిని సర్వే చేశారు. బెజ్జూరు మండలంలో 21గ్రామాలకు గాను 2950 దరఖాస్తులు రాగా, 9943ఎకరాల్లో హక్కులు కోరుతున్నారు. నిన్నటి వరకు ఇక్కడ మొత్తం 102దరఖాస్తులు పరిశీలించి 280.34ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. చింతలమానేపల్లి మండలంలో 10గ్రామ పంచాయతీలకు గాను 2849 దరఖాస్తులు రాగా, 11425.25 ఎకరాల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటివరకు 236దరఖాస్తులను పరిశీలించి 809.09 ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. దహెగాం మండలంలో 14గ్రామాల్లో 2239దరఖాస్తులు రాగా 5645.26 ఎకరాల్లో హక్కులు కోరుతుండగా, మంగళవారం నాటికి 40 దరఖాస్తులను పరిశీలించి 52.21 ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. జైనూరు మండలంలో 26 పంచాయతీలకు గాను 7909 ఎకరాలో 1915 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 85దరఖాస్తులను పరిశీలించి 292.11ఎకరాల్లో సర్వేపూర్తి చేశారు. ఇదంతా ఒకే గ్రామ పంచాయతీకి సంబంధించిన విస్తీర్ణం. కాగజ్‌నగర్ మండలంలో 14పంచాయతీల పరిధిలో 5053.18 ఎకరాలకు కోసం 1310 దరఖాస్తులు రాగా నిన్నటి వరకు 101దరఖాస్తులను పరిశీలించి 311.15 ఎకరాల్లో సర్వే పూర్తిచేశారు. కెరమెరి మండలంలో 29గ్రామాలకుగాను 12767 ఎకరాల కోసం 3034 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 242దరఖాస్తులను పరిశీలించి 653.01ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. కౌటాల మండలంలో 9 పంచాయతీలకు గాను 3078ఎకరాల కోసం 887దరఖాస్తులు రాగా నిన్నటివరకు 112దరఖాస్తులను పరిశీలించి 276.21ఎకరాల్లో సర్వే పూర్తిచేశారు. లింగాపూర్‌లో 14 జీపీలకు గాను 10,650.13ఎకరాల కోసం 2195దరఖాస్తులు రాగా నిన్నటి వరకు 183 దరఖాస్తులను పరిశీలించి 652.14 ఎకరాల్లో సర్వే పూర్తిచేశారు. పెంచికల్‌పేట మండలంలో 12గ్రామాలకు గాను 5137.30 ఎకరాల కోసం 1707దరఖాస్తులు రాగా 89దరఖాస్తులను పరిశీలించి 162ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. రెబ్బెన మండలంలో 19గ్రామాలకు 8738.03ఎకరాల కోసం 2434దరఖాస్తులు రాగా ఇందులో ఇప్పటి వరకు 105దరఖాస్తులను పరిశీలించి 409ఎకరాల్లో సర్వే పూర్తిచేశారు. సిర్పూరు(యు) మండలంలో 15 గ్రామాలకు గాను 7586ఎకరాల కోసం 1780 దరఖాస్తులు రాగా 118 దరఖాస్తులను పరిశీలించి 362ఎకరాల్లో సర్వే పూర్తిచేశారు. సిర్పూరు(టి)మండలంలో 15గ్రామాలకు గాను 9615.15ఎకరాల కోసం 2386దరఖాస్తులు రాగా ఇందులో 173దరఖాస్తులను పరిశీలించి 497.26 ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. తిర్యాని మండలంలో 27గ్రామాలకు గాను 6825.25ఎకరాల కోసం 1443 దర ఖాస్తులు రాగా ఇప్పటివరకు 297దరఖాస్తులను పరిశీలించి 1027.03ఎకరాల్లో సర్వే పూర్తిచేశారు. వాంకిడి మండలంలో 28పంచాయతీలకు గాను 10931.30 ఎకరాల కోసం మొత్తం 2864 దరఖాస్తులు రాగా మంగళవారం నాటికి 197 దరఖాస్తులను పరిశీలించి 599.03 ఎకరాల్లో సర్వే పూర్తిచేశారు. అక్టోబరు 1 నుంచి నేటివరకు కేవలం ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో 35 ఆవాసాల్లో మాత్రమే సర్వే పూర్తి అయింది.
Updated Date - 2022-10-18T03:37:44+05:30 IST