డిప్యూ టేషన్ల లొల్లి
ABN, First Publish Date - 2022-12-15T01:48:15+05:30
గ్రామీణాభివృద్దిలో అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ విభాగంలో ముఖ్యమైన అధికారులు తమ పరపతి ఉపయోగించుకొని డిప్యూటేషన్‌పై వెళ్లిపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి.
ఏళ్లకు ఏళ్లుగా హైదరాబాద్‌లో డిప్యూటేషన్ వర్క్
కీలక ఉద్యోగులే వెళితే పని సాగేదేలా ?
ఇతర శాఖల్లోనూ ఇదే తీరు
చర్యలు తీసుకుంటాం : శంకరయ్య, పీఆర్ ఈఈ
నిర్మల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణాభివృద్దిలో అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ విభాగంలో ముఖ్యమైన అధికారులు తమ పరపతి ఉపయోగించుకొని డిప్యూటేషన్‌పై వెళ్లిపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. పంచాయతీరాజ్‌శాఖలో కీలకమైన సహా యక ఇంజనీర్లు చాలా మంది తమకున్న రాజకీయ పలుకుబడితో హైదరాబాద్‌లో ఉండే ఇంజనీరింగ్ ఛీఫ్ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై వెళ్లి ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తున్నారు. దీంతో జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కుంటు పడిపోతున్నాయి. వారి బాధ్యతలను స్థానికంగా ఇతరులకు అదనపు బాధ్యతలు ఇవ్వడంతో అదనపు బాధ్యతలు చూస్తున్న ఇంజనీర్లు అటు ఆ పని... ఇటు ఈ పని ఏది పూర్తి చేయక తీవ్రంగా సతమతమవుతున్నారు. మరోవైపు అదితలకు మించిన భారం అవుతున్నదని కూడా ఇన్చార్జీ బాధ్యతలు చూస్తున్న ఇంజనీర్లు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ఒక మండలానికి పనిచేయాల్సిన ఇంజనీర్ రెండు, మూడు మండలాలు చూడాలంటే ఏ స్థాయిలో పనిభారం ఉంటుందో అర్థం కాక మానదు. సమీక్ష సమావేశాల్లో ఉన్నతాధికారుల చేత మాటలు పడాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. మరోవైపు స్థాని క జిల్లా పీఆర్, డివిజనల్ అధికారి కార్యాలయాల్లోనూ పనిచేస్తున్న కొందరు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై వెళ్లి పనిచేస్తున్నారు. ఇదీ పాలనకు విఘాతం కలుగుతోందని ఉన్నతాధికారులే అభిప్రాయపడుతున్నారు. పెద్దనేతలతో, హైదరాబాద్ స్థాయి వర్గాలతో డిప్యూటేషన్లు తెచ్చుకొని వెళ్లిపోవడంతో జిల్లా అభివృద్దికి విఘా తం కలుగుతోందని స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.
మంత్రి సంజాయిషీ కోరినా !
పంచాయతీ రాజ్ శాఖలో సహయక ఇంజనీర్లు కొందరు డిప్యూటేషన్‌పై హైదరాబాద్, జగిత్యాల తదితర ప్రాంతాలకు వెళ్ళడంపై స్వయాన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో పంచాయతీరాజ్ జిల్లా అధికారిని సంజాయిషీ కోరారు. మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న తన జిల్లా నుంచే తన నోటీసులో లేకుండా ఎలా ఇతర జిల్లాలకు డిప్యూటేషన్‌పై పంపారని మంత్రి నిలదీయడంతో సంబంధిత అధికారులు నోరెళ్లబెట్టడం మినహా జవాబు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ప్రతీసారి జరిగే జడ్పీ సమావేశంలో ఈ డిప్యూటేషన్ల రగడ నడుస్తూనే ఉంది. అయినప్పటికీ డిప్యూటేషన్‌పై వెళ్లిన వారు ఇంత వరకు తిరిగి వాపస్ రాకపోవడం చూస్తుంటే వారు ఎంత బలమైన పైరవీతో డిప్యూటేషన్‌పై వెళ్లారో అర్థం చేసుకోవచ్చు.
ఇతర శాఖల్లోనూ ఇదే తంతు
జిల్లాలో ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ డిప్యూటేషన్ విధానం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు డిప్యూటేషన్లు కోరిన వారి నుంచి డబ్బులు తీసుకొని ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు ఇచ్చిన దాఖలాలు అనేకం ఉన్నాయని అధికార వర్గాల్లో చర్చ ఉంది. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య, రెవెన్యూలతో పాటు తదితర శాఖల్లో ఎక్కువగా డిప్యూటేషన్ల దందా జోరుగా ఉందన్న ఆరోపణలున్నాయి. వైద్యశాఖలో పనిచేస్తున్న అనేక మంది డిప్యూటేషన్లు రద్దు చేయాలని ప్రతీసారి జడ్పీ సమావేశంలో జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు ఎంత మొత్తుకున్నా సమావేశంలో చర్యలు తీసుకుంటామని చెప్పడం మినహా వారి డిప్యూటేషన్లు రద్దు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలుసార్లు మంత్రి స్వయంగా కలగజేసుకొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికి డిప్యూటేషన్లు ఇంత వరకు రద్దు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విద్యాశాఖలో ఉపాధ్యాయులకు సంబంధించి అసలు డిప్యూటేషన్లు ఇవ్వకూడదని విద్యాశాఖ కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ జిల్లాలో మాత్రం ఆ ఆదేశాలు అసలే అమలు కావడం లేద ని ఫిర్యాదులున్నాయి. ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు ఇచ్చినా సంబందిత శాఖ అధికారులపై చర్యలు లేవు. ఇదిలా ఉంటే ఈ డిప్యూటేషన్ల వెనక భారీగానే చేతులు మారినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జడ్పీ సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు డిప్యూటేషన్ల అంశాన్ని లేవనెత్తితే తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు ఆ తరువాత ఆ వ్యవహారాన్ని వదిలేసి ఏమవుతుందిలే అన్న ట్లుగా వ్యవహారిస్తున్నట్లు అధికార వర్గాల్లో గుసగుసలున్నాయి. స్వయం గా మంత్రి ఆదేశించిన డిప్యూటేషన్లు రద్దు చేయని పరిస్థితి చూ స్తుంటే జిల్లా అధికారుల ఇష్టారీతి పనులు ఏలా ఉన్నాయో అర్థమవుతోంది.
చర్యలు తీసుకుంటాం
పంచాయతీరాజ్ శాఖలో కొందరు ఇంజనీర్లు డిప్యూటేషన్‌పై హైదరాబాద్, జగిత్యాల జిల్లాలకు వెళ్ళిన మాట నిజమే. ఈ విషయంపై తాము ఉ న్నతాధికారులకు లేఖ రాశాం. జడ్పీ సమావేశాల్లో ఈ వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విష యం కూడా వాస్తవమే. త్వరలోనే దీనిపై చర్యలు తీసుకుంటాం. డిప్యూటేషన్‌పై వెళ్ళిన వారిని వెనక్కి రప్పించేలా ఈఎన్సీతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపడతాం.
- శంకరయ్య, పీఆర్ ఈఈ
Updated Date - 2022-12-15T01:48:17+05:30 IST