పైలేరియాను పారదోలుదాం
ABN, First Publish Date - 2022-10-20T03:29:55+05:30
దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు. దోమకాటు ద్వారా మలేరియా, డెంగీ, మెదడువాపు, చికున్‌గున్యాతో పాటు బోదకాలు వ్యాధి వ్యాపిస్తాయి.
- బోదకాలు వ్యాధి రహిత జిల్లాకు కసరత్తు
- నేటి నుంచి మూడు రోజుల పాటు మాత్రల పంపిణీ
- జిల్లాలో 846 మంది బాధితులు
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 19: దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు. దోమకాటు ద్వారా మలేరియా, డెంగీ, మెదడువాపు, చికున్‌గున్యాతో పాటు బోదకాలు వ్యాధి వ్యాపిస్తాయి. క్యూలెక్స్ దోమ కుట్టడంతోనే బోదకాలు వ్యాధి వ్యాపిస్తుంది. ఇది వ్యాప్తి చెందకుండా జిల్లాలో గురువారం నుంచి మూడు రోజుల పాటు మాత్రలు అంద జేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలో బోదకాల వ్యాప్తిని అరికట్టేందుకు డై ఇథైల్ కార్బోమ్జైన్ సిట్రైట్(డీఈసీ), అల్బెండజోల్ మాత్రల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జిల్లాలో 846 పైలేరియా కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో 16 ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో వ్యాధి నివారణ మాత్రలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పరాన్న జీవి వల్ల..
బోదకాలు అనేది పరాన్నజీవి వలన సంక్రమించే వ్యాధి. సాధారణంగా దీనిని పైలేరియాగా పిలుస్తారు. పైలేరియల్ (పురుగులు) పురుగులే పరాన్న జీవులు. తొలి దశలో ఈ వ్యాధికి సంబంధించి లక్షణాలు కనిపిం చవని వైద్యులు చెబుతున్నారు. క్యూలెక్స్ దోమ కాటు వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు ఎక్కువగా మురుగునీటి నిల్వల్లో పెరుగు తాయి. తరచూ వచ్చే జ్వరం, చంకల్లో, గజ్జల్లో బిల్లలు కట్టడం ఉంటుంది. శరీరంలోని అవయవాల వాపు, ప్రత్యేకించి కాళ్లు, చేతులు, స్థనాలు, జననేంద్రియాల్లో నొప్పి పుట్టడం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వ్యాది సోకిన తర్వాత 5 నుంచి 10 సంవత్సరాలు రోగ లక్షణాలు బయటకు కనబడవు. ఆ తర్వాత క్రమంగా వ్యాధి తీవ్రరూపం దాలుస్తుంది. సంక్రమితుల్లో మానవ పైలేరియా పరన్నా జీవి సూక్ష్మ దశల్లో (ఎంఎఫ్) ఉన్నప్పుడు ఉపాతి రక్త వ్యవస్థలో మైక్రో ఫైలేరియాని ఉత్పత్తి చేస్తుంది. సదరు వ్యక్తుల రక్తాన్ని స్వీకరించిన దోమలో మైక్రోఫైలేరియా ఉండి పోతుంది. సంక్రమిత మైక్రోఫైలేరియా 12 రోజుల్లో పెరిగి పెద్దదయి మరొకరికి వ్యాపింపజేసే దశకు చేరుకుంటుంది. సంక్రమిత లార్వా దశలో ఉన్న దోమ మరొక వ్యక్తిని కుట్టినప్పుడు చర్మం మీద పరాన్న జీవులు పడిపోతాయి. కుట్టిన మార్గం ద్వారా లోనికి ప్రవేశించి శోష వ్యవస్థలోకి వెళ్లి స్థిరపడతాయి.
వ్యాధి వ్యాప్తిని అరికట్డడానికి..
బోదకాలు వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి డై ఇథైల్ కార్బోమ్జైన్ సిట్రైట్(డీఈసీ), అల్బెండజోల్ మాత్రల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బోద వ్యాధి వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో నివసించే జనం ఆరోగ్యంగా కనిపించినా వారి రక్తంలో సూక్ష్మ పైలేరియా క్రిములు ఏ మాత్రం గుర్తించలేని లక్షణాలతో తొలి ద శగా ఉండవచ్చు. ఈ దశలో సంక్రమిత వ్యక్తులను గుర్తించి వారికి మాత్రమే చికిత్స ఇవ్వడం కష్టమైన పని. అందువల్ల ఆ ప్రాంతంలో ఉన్న వారికి డై ఇథైల్ కార్బోమ్జైన్ సిట్రైట్(డీఈసీ), అల్బెండజోల్ మాత్రల పంపిణీ చేయడం ద్వారా అరిక ట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాధి లేని వారు కూడా వీటిని వాడవచ్చు. డీఈసీ సూక్ష్మ పైలేరియాను నశింపజేస్తుంది. అల్బెండజోల్ పేగుల్లో ఉండే క్రిముల్ని నిర్మూలించి అదనపు లాభం చేకూరుస్తుంది. ఈ రెండింటిని కలిపి ఇవ్వడం ద్వారా పెరిగిన క్రిముల మీద ప్రభావం ఉంటుంది. సంక్రమిత వ్యక్తిలో రోగాభివృద్ధి నిరోధించడంతో పాటు పరాన్న జీవులను నశింపజేస్తాయి. రెండేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, తీవ్ర అనా రోగ్యం కలిగిన వారు డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
అవగాహనతోనే వ్యాధిని నివారించవచ్చు..
- డాక్టర్ అనిత, బోదకాల నివారణ జిల్లా అధికారి
బోదకాలు వ్యాధిని అవగాహనతో నివారించవచ్చు. మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 11 వ్యాధి ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తు న్నది. రెండేళ్ల పైబడ్డ వారంతా విధిగా మాత్రలు తీసుకోవాలి.
Updated Date - 2022-10-20T03:29:55+05:30 IST