ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణులకు ‘కేసీఆర్ పౌష్టికాహార కిట్లు’
ABN, First Publish Date - 2022-12-20T22:44:14+05:30
ఆసిఫాబాద్ రూరల్, డిసెంబరు 20: మాతాశిశు మరణాల నివారణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇది వరకు గర్భిణుల కోసం చేపట్టిన కేసీఆర్ కిట్ పథకం విజయ వంతం అయింది.
- రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో అమలు
- జిల్లా కేంద్రంలో నేడు ప్రారంభించనున్న విప్
- ప్రతీ గర్భిణికి రెండు కిట్లు
ఆసిఫాబాద్ రూరల్, డిసెంబరు 20: మాతాశిశు మరణాల నివారణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇది వరకు గర్భిణుల కోసం చేపట్టిన కేసీఆర్ కిట్ పథకం విజయ వంతం అయింది. ఈ మేరకు బుధవారం జిల్లాలో న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించడానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఈ పథకం ప్రారంభించనుండగా అందులో కుమరం భీం జిల్లా ఉంది. గర్భిణులు ఇబ్బందులు పడకుండా ప్రతి పీహెచ్‌సీలో ఒక్కోరోజు 80కిట్లను మాత్రమే పంపిణీ చేయనున్నారు. ప్రతీ గర్భిణికి రెండు కిట్లను ఇవ్వనున్నారు. కేసీఆర్ కిట్ పథకం విజయవంతం కావడంతో ప్రభుత్వం గర్భిణుల పోషకాహరంపై దృష్టి సారించింది. 2017నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్లతో పాటు అమ్మలాలన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే గర్భిణులకు వెంటనే రూ.2వేల విలువైన కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నారు. ఆలాగే అమ్మాయి పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ. 12వేలు దశల వారీగా అందజేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగింది.
మొదటి విడత తొమ్మిది జిల్లాల్లో..
‘కేసీఆర్ పౌష్టికాహార కిట్లు’ పథకాన్ని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీ ఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని కుమరంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, గజ్వేల్, కామారెడ్డిలలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు ప్రారం భించనున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో మంచి ర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ప్రతి నెల గర్భిణులు ఆస్పత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకునేందుకు ఇంటివద్ద నుంచే తీసుకొని వచ్చి తిరిగి పంపించేందుకు వీలుగా ప్రభుత్వం 102 వాహ నాలను ప్రవేశపెట్టింది. ఇలా గర్భిణులపై శ్రద్ధ తీసు కుంటున్న ప్రభుత్వం సరైన పోషకాహరం అందక రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించింది. అలాంటి వారి కోసం ప్రతినెల పోషకాహర కిట్లను అందించాలని నిర్ణయించింది. సబ్‌సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులుగా నమోదు చేసుకున్న వారికి పోషకాహర కిట్లను అందజేయనున్నారు. ఈ కిట్లను 5వ నెలలో ఒకసారి, 9వ నెలలో ఒకసారి ఇవ్వనున్నారు. శరీరానికి సరిపడా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అందించేందుకు వీలుగా ఈ కిట్లను తయారు చేశారు. జిల్లాలోని 22పీహెచ్‌సీల పరిధిలో 6590మంది గర్భిణులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కుమరం భీం జిల్లాలో పౌష్టిక ఆహార కిట్లు భద్ర పర్చడానికి వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలోని 22 పీహెచ్‌సీలు, రెండు పట్టణ పీహెచ్‌సీల్లో ఈ గదులను సిద్ధం చేసి ఉంచారు. న్యూట్రీషన్ కిట్‌లో న్యూట్రిషన్ మిక్స్‌పౌడర్ 2కిలోలు, కిలో ఖర్జూరాలు, ఐరన్ సిరప్ 3సీసాలు, ప్లాస్టిక్ బుట్ట, వస్త్రం సంచి, 500గ్రాముల నెయ్యి, కప్పు, ఆల్బెండజోల్ టాబ్లెట్లు ఉన్నాయి.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
- ప్రభాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో, కుమరం భీం
కేసీఆర్ పౌష్టిక ఆహారం కిట్లు పథకం జిల్లాలో అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలోని 22పీహెచ్‌సీల పరిధిలో 6590మంది గర్భిణులను గుర్తించాం. ప్రస్తుతం 2వేల కిట్లు వచ్చాయి. ప్రతిరోజు ఆయా పీహెచ్‌సీల పరిధిలో 80మందికి పంపిణీ చేయనున్నాం. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం.
Updated Date - 2022-12-20T22:46:22+05:30 IST