ఎవరికి దక్కేనో..?
ABN, First Publish Date - 2022-09-03T04:11:30+05:30
జిల్లాలో ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించే ప్రక్రియకు ఎట్టకేలకు అధికారులు శ్రీకారం చుట్టారు. గూడు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ ఇచ్చింది. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయి ఎప్పుడు కేటాయిస్తారా అని ఏడేళ్ళుగా నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,616 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి.
డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపునకు కసరత్తు
తహసీల్దార్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శన
అభ్యంతరాల స్వీకరణకు ఏడు రోజులు గడువు
పారదర్శకంగా ఎంపిక చేపట్టాలని డిమాండ్
స్థలాలు కోల్పోయిన వారి ఎదురుచూపులు
మంచిర్యాల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించే ప్రక్రియకు ఎట్టకేలకు అధికారులు శ్రీకారం చుట్టారు. గూడు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ ఇచ్చింది. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయి ఎప్పుడు కేటాయిస్తారా అని ఏడేళ్ళుగా నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,616 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఒక్కొక్కటి రూ.5.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టగా మరో 806 ఇళ్ల నిర్మాణం చేపట్టవలసి ఉంది. ఏడేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా కేవలం 1,044 ఇళ్లు పూర్తికాగా జిల్లా కేంద్రం మినహా మరెక్కడా లబ్ధిదారులకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు.
ఎట్టకేలకు మోక్షం
జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2616 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో మంచిర్యాల నియోజక వర్గానికి 685 ఇండ్లు మంజూరు కాగా 620 ఇళ్ల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మరో 65 ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చెన్నూరు నియోజకవర్గానికి 1146 మంజూరు కాగా మందమర్రిలో 560, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి 286, చెన్నూరుకు 300 ఇండ్లు కేటాయించారు. వీటిలో 194 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. మిగతా వాటిలో మందమర్రిలో 160 ఇళ్లు 50 శాతం పూర్తికాగా, 400 ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గానికి 585 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 170 ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా మరో 415 ఇళ్లకు సంబంధించి స్థల వివాదం కొనసాగుతోంది. నిర్మాణం చేపట్టిన వాటిలో 30 శాతం మేర మాత్రమే పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది.
ప్రాథమిక జాబితా విడుదల...
రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపునకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. మొదటి విడు తలో జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న 620 గృహాలను అర్హులకు కేటాయించేందుకు కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ ప్రారంభించారు ఇందులో భాగంగా మీ -సేవ ద్వారా అందిన 2,958 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వార్డుల వారీగా ప్రాథమికంగా అర్హుల జాబితాను తయారు చేసి గత నెల 29న మున్సి పల్, తహసీల్దార్ కార్యాలయాల్లో అంటించారు. ప్రాథమికంగా తయారు చేసిన జాబితాపై ఆక్షేపణలు ఉంటే ఏడు రోజుల్లోగా తెలియజేయాలని సూచించారు. ప్రాథమిక జాబితాపై అందే ఆక్షేపణలను పరిగణలోకి తీసు కొని తుది జాబితా విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పాదర్శకంగా చేపట్టాలి...!
డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు ప్రారంభించడంతో పారదర్శకంగా చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో గత సంవత్సరం ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో రాజకీయ ప్రమేయం ఉందనే ఆరోపణలు వెలువడటంతో దానిని వాయిదా వేశారు. మంచిర్యాల నియోజక వర్గానికి సంబంధించి గత సంవత్సరం ఏప్రిల్ 7న రాజీవ్‌నగర్‌లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, కలెక్టర్ భారతి హోళికేరి చేతుల మీదుగా కేవలం 30 మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేశారు. అప్పటికే ఇక్కడ 358 ఇళ్లు పూర్తికాగా లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం కారణంగా అధికా రులు ముందడుగు వేయలేకపోయారనే ప్రచారం జరిగింది. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోనూ లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం కారణంగా పంపిణీ ప్రక్రియ ముందుకు సాగడం లేదనే ఆరోపణలు న్నాయి. ప్రస్తుతం ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం కాగా లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
స్థలాలు కోల్పోయిన వారికి ఇళ్లు దక్కేనా...?
జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో 2007-08లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు లేని నిరుపేదలకు సర్వే నెంబర్ 345లో నివేశన స్థలాలు పంపిణీ చేసింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేయడంతోపాటు 75 గజాల చొప్పున స్థలాలను అప్పగించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని అప్పటి 32 వార్డుల్లో 22 వార్డులకు చెందిన సుమారు మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వాటిలో దాదాపు 80 శాతం మంది లబ్ధిదారులు రూ. 50వేల నుంచి లక్ష వరకు ఖర్చుచేసి బేస్మెంట్లు, పిల్లర్లు నిర్మించుకున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా స్థలాలను ఖాళీగా వదిలివేశారు. స్థోమత ఉన్న వారు ఆ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని నివాసం కూడా ఉంటు న్నారు. ఆ తరువాత ప్రభుత్వం మారి ఇందిరమ్మ పథకం మరుగున పడగా, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత డబుల్ బెడ్రూం ఇళ్ల విషయం తెర మీదకు వచ్చింది. దీంతో 2019-20లో అధికారులు సర్వే నంబర్ 345లో వెలసిన నిర్మాణాలను కూల్చివేశారు. లబ్ధిదారులు తమ వద్ద ఉన్న ఆధారాలతో అధికారులకు విన్నవించడంతో డబుల్ బెడ్రూం ఇళ్లకు ఎంపిక చేస్తామని, ప్రస్తుతం ఉన్న కట్టడాలను తొలగించి అదే ప్రాంతంలో డబుల్ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం డబుల్ ఇళ్ల పంపిణీకి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో స్థలాలు కోల్పోయిన వారికి అవకాశం ఇస్తారేమోనని గంపెడాశతో ఉన్నారు.
Updated Date - 2022-09-03T04:11:30+05:30 IST