పోలీసు దిగ్బంధంలో జిల్లా
ABN, First Publish Date - 2022-06-18T06:41:06+05:30
జిల్లా పోలీసు నిర్భంధంలో చిక్కింది. శుక్రవారం జిల్లా అంతటా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
నిర్మల్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పోలీసు నిర్భంధంలో చిక్కింది. శుక్రవారం జిల్లా అంతటా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని గోదావరి సరిహద్దుల గుండా ఉన్న రహదారులన్నింటిని మూసివేశారు. ఒకే రోజున బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు పిలుపునివ్వడం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి , బీజేపీ ఛీప్ బండి సంజయ్‌లు బాసరకు వస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో ఆ రెండు పార్టీల జిల్లా స్థాయి నేతలు సహా అన్ని ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు బాసర బయల్దేరేందుకు సన్నద్దమయ్యారు. అయితే గురువారం రాత్రి నుంచే ఆదిలాబాద్ , మంచిర్యాల్ , ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అక్కడి కాంగ్రెస్ , బీజేపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్టులు , బైండోవర్‌లు చేశారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు బాసర తరలివెళుతున్నారన్న సమాచారంతో పెద్దమొత్తంలో పోలీసులను మోహరించారు.
అడుగడుగునా పోలీసులు.. పికెట్‌లు
బాసరకు టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి , బీజేపీ నేత బండి సంజయ్‌లు వస్తున్న సమాచారంతో జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి బాసర వైపు ఉన్న నిర్మల్ - కల్యాణి 222 జాతీయ రహదారిపై ఎటు చూసినా పోలీసులే కనిపించారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ జాతీయ రహదారిని పోలీసులు నిర్భంధించారని చెప్పవచ్చు. బాసర సమీపంలో భైంసా అదనపు ఎస్పీ కిరణ్ కారే నిర్మల్ నియోజకవర్గంలోని దిలావర్‌పూర్ మండల సమీపంలో నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డిలు శుక్రవారం ఉదయం నుంచే తమ బలగాలతో రంగంలోకి దిగారు. గ్రామ, మండలస్థాయి నాయకులు, కార్యకర్తలను ఆయా మండలాల పోలీస్ స్టేషన్‌లకు తరలించి నిర్భంధించారు. అయితే కొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎలాగోలా బాసరకు చేరుకున్నారు. బాసరకు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వస్తున్న సమాచారంతో కామారెడ్డి జిల్లా బిక్కునూర్ వద్ద ఆయనను నిలువరించి అరెస్టు చేసిన పోలీసులు సంజయ్‌ను అక్కడి ఠాణాకు తరలించినట్లు సమాచారం అందింది. దీంతో జిల్లా బీజేపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి బాసరకు ఆర్టీసీ బస్సుల్లో వస్తున్న సమాచారం మేరకు పోలీసులు బాసర బార్డర్‌లోని యంచా వద్ద ఆదుపులోకి తీసుకున్నారు. గోదావరి కృష్ణ జలాల కన్వీనర్ రావుల రాంనాథ్‌ను బాసర వద్ద అరెస్టు చేశారు.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఏలేటిల అరెస్టు.. నర్సాపూర్ ఠాణాకు తరలింపు
టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి వస్తున్న సమాచారం మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , ఎఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఏలేటీ మహేశ్వర్ రెడ్డిలు నిర్మల్ నుంచి బాసరకు బయల్దేరారు. వీరిని దిలావర్‌పూర్ టోల్‌ప్లాజా సమీపంలో అరెస్టు చేసిన పోలీసులు నర్సాపూర్ (జీ) ఠాణాకు తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు.
Updated Date - 2022-06-18T06:41:06+05:30 IST