ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళారీ దందా

ABN, First Publish Date - 2022-11-05T01:50:22+05:30

జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడంతో మళ్లీ దళారీ దందా మొదలైంది. గత నెల 14న పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన అధికారులు,

అమ్మేందుకు మార్కెట్‌కు తరలించిన పత్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ మార్కెట్‌ పరిధిలో డిస్‌పూట్‌ కమిటీల ఏర్పాటు

పల్లెల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దందా

తేమ పేరిట కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్న వ్యాపారులు

క్షేత్రస్థాయిలో కొరవడుతున్న అధికారుల పర్యవేక్షణ

మామూలు’గానే తీసుకుంటున్న మార్కెటింగ్‌ అధికారులు

ఆదిలాబాద్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడంతో మళ్లీ దళారీ దందా మొదలైంది. గత నెల 14న పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన అధికారులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. అక్రమాలకు అడ్డు కట్ట పడినట్లు కనిపించడం లేదు. గతంలో మార్కెట్‌ యార్డుల్లోనే పత్తి పంటను విక్రయించాలనే నిబంధన ఉండేది. కానీ గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో రైతులు తమకు ఇష్టమైన చోట పంటను అమ్ముకునే అవకాశం దక్కింది. దీంతో ప్రైవేట్‌ దళారులు మరింతగా రెచ్చిపోయి నడి రోడ్డు పైనే తూకం వేస్తూ అన్నదాతలను అడ్డంగా దోచుకుంటున్నారు. జిల్లాలో ఈసారి 21లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా ఐదు వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన ట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఈసారి పంట కాలం పెరగడంతో పత్తి కొనుగోళ్లు అంతగా ఊపందుకోవడం లేదు. అలాగే ముందస్తుగా కొనుగోళ్లను ప్రారంభించడంతో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ధరల్లో మాత్రం కోతలు విధించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకే కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ప్రత్యేకదృష్టి సారించి సమస్యను పరిష్కరిచే కమిటీ (డిస్‌పూట్‌)లను ఏర్పాటు చేసినా.. గ్రామాల్లో దళారీ దందాకు అడ్డుకట్ట పడే అవకాశం కనిపించడం లేదు. ప్రధానంగా ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో దళారులు ఇష్టారాజ్యంగా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు కూడా తమ అత్యవసరాల పేరిట అమ్మేసుకుంటున్నట్లు తెలుస్తుంది. రైతులకు మాయమాటలు చెబుతూ తూకంలో మోసం చేస్తూ దండుకుంటున్నారు. కొన్నిచోట్ల బండరాళ్లతో సైతం పత్తి పంటను కొనుగోలు చేస్తు న్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. రైతుల అవసరాన్ని ఆసరాగా దళారులు నగదు ఆశ చూపుతూ యథేచ్ఛగా కొనుగోళ్లను జరుపుతున్న అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పరిష్కారం చూపేనా?

ఈసారి పత్తికి మద్దతును మించిన ధర పలుకడంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించి పంటను అమ్మేసుకుంటున్నారు. దీంతో ధర, తేమ పేరిట అడ్డగోలుగా కోతలు విధిస్తున్నట్లు తెలుస్తుంది. నాణ్యత లేదన్న సాకుతో వ్యాపారులు ధరను భారీగా తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అలాగే వ్యాపారులు చెప్పిందే తేమశాతంగా మారింది. తేమ శాతం నిర్ధారణపై ఎలాంటి అవగాహన లేని రైతులు గిట్టుబాటు కావడం లేదంటూ ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ఆదిలాబాద్‌ మార్కెట్‌ పరిధిలో డిస్‌పూట్‌ కమిటీలను ఏర్పాటు చేయాల ని నిర్ణయించారు. ఒక్కో కమిటీలో ఐదుగురు సభ్యుల చొప్పున నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీకి నాలుగైదు జిన్నింగ్‌ మిల్లల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ఇందులో ఇద్దరు రైతు సంఘం నేతలు, వ్యవసాయ శాఖాధికారి, మార్కెటింగ్‌ శాఖాధికారి, వీఏవో, కిసాన్‌ మిత్రతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రైతు సమస్యలకు పరిష్కా రం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం మార్కెటింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. అయితే కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే సమస్యలు పరిష్కారమై రైతులకు కొంతమేలు జరిగే అవకాశం ఉంటుంది.

దళారీ చెప్పిందే ధర

దళారులు ఎలాంటి తేమ శాతాన్ని పరిశీలించకుండానే టోకుగా ధరను నిర్ణయించడంతో అన్నదాతలు దగా పడుతున్నారు. తేమ శాతం పేరిట భారీ కోతను విధిస్తూ దండుకుంటున్నారు. తేమ, నాణ్యత లేదంటూ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరను నిర్ణయిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల నుంచి పంటను తరలించేందుకు వీలులేక పోవడంతో రైతులు స్థానికంగానే పంటను అమ్మేసుకుంటున్నారు. ఈ యేడు కురిసిన భారీ వర్షాల కారణంగా మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గాలు పూర్తిగా ధ్వంసమైపోవడంతో పంటను తరలించేందకు ఆస్కారమే లేకుండా పోయింది. దీంతో ధర తక్కువైనా స్థానికంగానే విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదునుగా తేమ శాతం తూకంలో మోసం చేస్తున్న దళారులు లాభాలను జేబులో వేసు కుంటున్నారు. ఇదంతా మార్కెటింగ్‌ అధికారులకు తెలిసినా.. తెలియనట్లుగానే వ్యవహరించడంతో యేటా రైతులు నష్టపోతూనే ఉన్నారు. కేవలం జిన్నింగ్‌ వ్యాపారులపై దృష్టి సారిస్తున్న అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దళారీ దందాను అరికట్టేందుకు చర్యలు తీసుకోక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో దళారీ వేల క్వింటాళ్లపత్తిని కొనుగోలు చేస్తూ బినామీ రైతుల పేరిట మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు తరలిస్తూ అమ్మేసుకుంటున్నారు. అనుమతులు లేకుండా పత్తి పంటను కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై చర్యలు కరువవడంతో దళారీదందా ఆగడమే లేదు.

అవగాహన కరువు

మార్కెట్‌ చట్టాలపై రైతుల్లో ఏమాత్రం అవగాహన కనిపించడం లేదు. ముందుగానే డిస్‌పూట్‌ కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాల్లో విస్త్రృతంగా ప్రచారం కలిపించి ఉంటే కొంత ప్రయోజనం ఉండేది. ఇప్పటికే కొంతమంది రైతులు పంటను విక్రయించారు. మరోవారం రోజుల్లో పత్తి కొనుగోళ్లు మరింతగా ఊపందుకునే అవకాశం ఉంది. అమాయక నిరక్షరాస్యులైన అన్నదాతల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటి వరకు ఏఒక్క గ్రామంలో పంటల మద్దతు ధరలు, మార్కెటింగ్‌ నిబంధనలపై అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. దీంతో యేటా అన్నదాతలు తీవ్రంగా నష్ట పోతు న్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను సాకుగా చూపుతున్న దళారులు.. తేమ శాతం తూకంలో భారీగా కోతలు విధిస్తున్నారు. పంట కొనుగోళ్లకు ముందే గ్రామస్థాయిలో తేమ శాతం, మార్కెట్‌ నిబంధనల పై అవగాహన కల్పించి ఉంటే ప్రయోజనం ఉండేది. కానీ ఏమాత్రం అవగాహన లేని అన్నదాతలు దళారులు చెప్పిందే నమ్ముతూ మోస పోతున్నారు.

మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటాం

: శ్రీనివాస్‌, జిల్లా మార్కెట్‌ శాఖ అధికారి, ఆదిలాబాద్‌

పత్తి రైతులకు మద్దతు ధర దక్కేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యమైన పంటను తెచ్చి మంచి ధరను పొందాలని సూచిస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాలతో రైతుల సమస్యలకు పరిష్కారం చూపేందుకు డిస్‌పూట్‌ కమిటీలను ఏర్పాటు చేశాం. మొదట ఆదిలాబాద్‌ మార్కెట్‌ పరిధిలో నాలుగు కమిటీలను నియమించి ధర నిర్ణయం, తేమ శాతం పరిశీలనలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాం. అవకతవకలకు పాల్పడే వ్యాపారులపై ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుం టాం. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా పంటను మార్కెట్‌కు తరలించి మద్దతుధరను పొందాలి.

Updated Date - 2022-11-05T01:50:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising