భోగభాగ్యాల భోగి
ABN, First Publish Date - 2022-01-14T06:01:13+05:30
భోగభాగ్యాల భోగి
నేడు భోగి.. రేపు సంక్రాంతి.. ఎల్లుండి కనుమ
మూడురోజుల పాటు ఉత్సాహంగా సాగనున్న వేడుకలు
హనుమకొండ (ఆంధ్రజ్యోతి)/వరంగల్ కలెక్టరేట్, జనవరి 13: భోగి పర్వదినాన్ని శుక్రవారం జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ఇళ్ల ముందు వివిధ రకాల రంగులతో వేసిన రంగవల్లులు ముత్యాల ముగ్గులు కనువిందు చేయనున్నాయి. పోటా పోటీగా ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి చిన్నారులకు భోగి పండ్లు పోసి వేడుకలు జరుపుకోనున్నారు. శనివారం సంక్రాంతి, ఆదివారం కనుమ పండుగ.
మార్కెట్లలో సందడి
పండుగ సందడితో నగరంలోని మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రంగు రంగుల ముగ్గులు, పూలు, పండ్లు, పూజాసామగ్రి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి వేళ ఇళ్లముందు రంగవల్లులు తీర్చిదిద్దడానికి అవసరమైన రంగులు, ముగ్గుల్లో గొబ్బెమ్మలను అందంగా అలంకరించడానికి ఆవుపేడ, నవధాన్యాలు, పిల్లలకు భోగి పండ్లు పోయడానికి అవసరమైన రేగుపండ్లు, దండలుగా కుచ్చి వేయడానికి చిలకలు, బత్తీసాలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. పూలు, పండ్లతోపాటు మామిడాకు, గుమ్మడికాయల హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. పిండి వంటల సామగ్రి అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. హనుమకొండ, వరంగల్ చౌరస్తా, బస్‌స్టాండ్ ప్రాంతం, టైలర్‌స్ట్రీట్, కుమార్‌పల్లి మార్కెట్, ఎక్సైజ్ కాలనీలోని రైతు బజార్, కాజీపేటలోని కూరగాయల మార్కెట్, హనుమకొండ ఆర్టీసీ పాత బస్‌డిపో, ఎన్‌జీవో్‌స కాలనీ రోడ్డు, వరంగల్‌లోని హెడ్ పోస్టాఫీస్, అండర్ బ్రిడ్జి, స్టేషన్ రోడ్డు, చౌరస్తా, బట్టల బజార్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సామానుల విక్రయాలు జరిగాయి. ఇతర ప్రధాన కూడళ్లు కొనుగోలుదార్లతో రద్దీగా కనిపించాయి.
రైల్వే, బస్‌స్టేషన్లు కిటకిట
చదువు, ఉద్యోగం, వ్యాపారాల నిమిత్తం ఎక్కడ నివసిస్తున్నా సంక్రాంతి పండగ వేళ స్వగ్రామానికి చేరుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. పండుగకు సొంతూళ్లకు వేళ్లేందుకు వచ్చిన వారితో హనుమకొండ, వరంగల్ బస్‌స్టేషన్లు, కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నా జనాలు లెక్క చేయకుండా సొంతూళ్లకు పయనమయ్యారు.
Updated Date - 2022-01-14T06:01:13+05:30 IST