గుర్తుల గుబులు!
ABN, First Publish Date - 2022-10-17T08:32:52+05:30
మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి.
- ప్రధాన పార్టీలకు సమస్యగా స్వతంత్రుల గుర్తులు
- కారును పోలిన గుర్తును ఆప్షన్‌గా పెట్టుకున్న కొందరు,
- పువ్వును పోలిన గుర్తును కోరుకున్న మరికొందరు
- ఓటర్లు గందరగోళానికి గురవుతారని నేతల ఆందోళన
- స్వతంత్రులను విరమింపజేసేందుకు ప్రయత్నాలు
- అధికార పార్టీ నేతలు, మంత్రుల బేరసారాలు
- కొందరిని పోటీలో ఉంచేందుకు బీజేపీ ప్రయత్నాలు
- అభ్యర్థికి రూ.5 లక్షల దాకా పలుకుతున్న డిమాండ్
- ఉపసంహరణ తర్వాతా స్వతంత్రులకు ప్రయోజనం
నల్లగొండ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికకు రిజిస్టర్డ్ పార్టీల నుంచి, స్వతంత్రులుగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ వేశారు. వారంతా ప్రధాన పార్టీల గుర్తులను పోలిన గుర్తులనే ఆప్షన్‌గా ఎంచుకున్నారు. దీంతో బ్యాలెట్‌లో అవి తమ గుర్తుల్లాగే కనిపిస్తాయని, ఓటర్లు గందరగోళానికి గురై తమకు వేయాల్సిన ఓటును స్వతంత్రులకు వేస్తారని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో పలు ఎన్నికల్లో ఇలా జరిగిన సందర్భాలను అవి గుర్తు చేసుకుంటూ.. ఆయా అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకొనేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. నామినేషన్ ఉపసంహరింపజేసేందుకు బేరసారాలు చేస్తున్నాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేవలం 5వేల ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ గుర్తు కలిగిన స్వతంత్ర అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయి.
ఈ ఓట్లే బూర నర్సయ్య ఓటమికి కారణమయ్యాయన్న అభిప్రాయం టీఆర్‌ఎ్‌సలో ఉంది. ఇక అంతకుముందు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తుకు 11 వేల ఓట్లు పోలయ్యాయి. అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం 6వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. ఇలాంటి సంఘటనలే మరికొన్ని చోట్ల కూడా చోటుచేసుకున్నాయి. దీంతో తమ అభ్యర్థుల ఓటమికి పరోక్షంగా కారణమవుతున్న ఈ గుర్తులను తొలగించాలని టీఆర్‌ఎస్ నేతలు గతంలోనే ఎన్నికల కమిషన్‌కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. కానీ, ఈ విజ్ఞప్తిపై ఈసీ ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోగా.. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలోనూ ఆ ప్రమాదం ఉంటుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది. నామినేషన్ వేసిన వారిలో పలువురు అభ్యర్థులు కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, ట్రాక్టర్, చపాతీ మేకర్, ఆటో, కేక్, క్యాప్, ఇస్త్రీపెట్టె, టీవీ వంటి గుర్తులను ఆప్షన్‌గా పెట్టుకోవడమే ఇందుకు కారణం. మరోవైపు బీజేపీ కూడా ఈసారి ఈ సమస్యను ఎదుర్కొంటోంది. కమలం పువ్వును పోలిన డైమండ్, పైనాపిల్, బెండకాయల గుర్తులు ఆ పార్టీకి ఇబ్బంది కలిగిస్తాయని భావిస్తోంది.
స్వతంత్రులతో నేతల బేరసారాలు..!
తమ గుర్తులను పోలిన గుర్తులను ఆప్షన్లుగా పెట్టుకున్న స్వతంత్ర అభ్యర్థులతో నామినేషన్‌ను ఉపసంహరింప చేయించేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ వేట మొదలుపెట్టాయి. టీఆర్‌ఎస్ సమస్యగా మారనున్న అభ్యర్థుల వివరాలను ఆ పార్టీ నాయకులు ఇప్పటికే అధికార పార్టీ పెద్దలకు అందజేసినట్లు సమాచారం. దీంతో నామినేషన్ల ఘట్టం ముగిసిన మరుసటి రోజు ఈ నెల 15 ఉదయం నుంచే ఆయా అభ్యర్థులకు మంత్రుల నుంచి ఫోన్లు రావడం మొదలైంది. నామినేషన్ ఉపసంహరించుకుంటే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు ఇస్తామని మంత్రులే ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ కూడా కమలం పువ్వును పోలిన గుర్తును ఆప్షన్‌గా పెట్టుకున్న అభ్యర్థులతో నామినేషన్‌ను ఉపసంహరింపజేసే కారక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంలకు చెందిన కోమటిరెడ్డి సాయితేజారెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నారు.
ఈయన రాజగోపాల్‌రెడ్డికి సమీప బంధువు కూడా. దీంతో సాయితేజారెడ్డి బరిలోనే ఉండి రాజగోపాల్ బ్యాలెట్ యూనిట్‌లోనే వస్తే ఇబ్బందికరమేనని బీజేపీ నేతలు ఆయనతో చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. అంతేకాకుండా.. ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే పెద్ద సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లు వాడాల్సి ఉంటుంది. అది ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇబ్బందికరం కావడంతో ఇతరులను ఉపసంహరింపజేసేందుకు టీఆర్‌ఎస్, బీజేపీతోపాటు కాంగ్రెస్ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 10 మంది దాకా అభ్యర్థులు తమ నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు అంగీకరించినట్లు తెలిసింది. ఉపసంహరణకు చివరి రోజైన సోమవారం మరింత మంది తప్పుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కారు గుర్తును పోలిన గుర్తులను ఆప్షన్‌గా పెట్టుకున్న వారిని బరిలో ఉంచేందుకు కూడా బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వారిని కొనసాగేలా చేసి.. ఓటర్లు కారు గుర్తు విషయంలో గందరగోళానికి గురయ్యేలా చేయాలన్న ప్రణాళికతో బీజేపీ ఉన్నట్లు చెప్పుకొంటున్నారు. ఇందుకోసం నామినేషన్ ఉపసంహరించుకుంటే టీఆర్‌ఎస్ నేతలు ఇస్తామన్న మొత్తం కన్నా తాము ఎక్కువ మొత్తం ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం.
బరిలో నిలిచే వారికీ మంచి డిమాండ్..
నామినేషన్ల ఉపసంహరణ తరువాత బరిలో మిగిలే స్వతంత్ర అభ్యర్థులకు కూడా మంచి డిమాండే ఉండనుంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు డిపాజిట్ రూ.10 వేలే ఉండటంతో పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతి అభ్యర్థికీ వాహనాల పాస్‌లు, పోలింగ్, కౌంటింగ్ పాస్‌లను ఎన్నికల అధికారులు అందజేస్తారు. బరిలో ఉండే ప్రధాన పార్టీల అభ్యర్థులు స్వతంత్రుల నుంచి వాహనాల పాస్‌లతోపాటు ఇతర పాస్‌లను కొనుగోలు చేసుకుంటారు. ఫలితంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈసీ లెక్కల్లో వాహనాల ఖర్చును తప్పించుకునేందుకు అవకాశం లభిస్తుంది.
దీంతోపాటు కౌంటింగ్ కేంద్రంలో ప్రధాన పార్టీలు కొనుగోలు చేసుకున్న పాస్‌ల ద్వారా గ్రామాల్లో తమకు అనుకూలమైన వారిని పోలింగ్ బూత్‌ల్లో ఏజెంట్లుగా మోహరిస్తారు. దొంగ ఓట్లు, అభ్యంతరాలు ఉంటే పోలింగ్ ఏజెంట్ల అభిప్రాయాన్ని ఎన్నికల సిబ్బంది పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో పోలింగ్ ఏజెంట్ల పాస్‌లకు ప్రధాన పార్టీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీనికి మరో కారణం కూడా ఉంది. ప్రచారం జరిగినన్ని రోజులు గ్రామంలో తిరిగిన నేతలు కౌంటింగ్ రోజు ఊర్లోనే ఉంటే ప్రజలు చులకనగా చూసే అవకాశం ఉంది. దీంతో కౌంటింగ్ పాస్‌లను ఎంతైనా చెల్లించి కొనుగోలు చేసి.. వారంతా కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్తారు. మొత్తంగా బరిలో ఉండే స్వతంత్ర అభ్యర్థులకు పాస్‌ల రూపేణా ఒక్కొక్కరికి కనీసంగా రూ.1.50 లక్షల వరకు అందుతున్నట్లు సమాచారం. గట్టిగా డిమాండ్ చేసే వారైతే అదనంగానే అందుకుంటారు. పెద్ద సంఖ్యలో బేరసారాలు జరుగుతుండడంతో 83 మందిలో ఎంత మంది పోటీలో ఉంటారో సోమవారం సాయంత్రానికి తేలిపోనుంది.
Updated Date - 2022-10-17T08:32:52+05:30 IST