Ticket price: ఆకాశాన్నంటిన ఢిల్లీ-హైదరాబాద్ విమానం టికెట్ ధర
ABN, First Publish Date - 2022-12-16T02:23:32+05:30
(రంగారెడ్డి జిల్లా ప్రతినిధి-ఆంధ్రజ్యోతి): అమ్మో.. రూ.70 వేలే..!! ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమాన ప్రయాణానికి ఒక్క టికెట్‌కు ఇన్ని వేల రూపాయలా.. వామ్మో..!! బుధ, గురువారాల్లో పలువురు విమాన ప్రయాణికులకు ఎదురైన అనుభవం ఇది.
బీఆర్‌ఎస్ ఎఫెక్ట్‌తో ఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్ చార్జీ నింగికి
బుధ, గురువారాల్లో రూ.70 వేలకు చేరిన వైనం
టికెట్ ధరతో కంగుతిన్న బీఆర్‌ఎస్ శ్రేణులు
తిరుగు ప్రయాణాలు వాయిదా.. సామాన్యుల అవస్థ
బీఆర్‌ఎస్ ఎఫెక్ట్‌తో ఆకాశాన్నంటిన ఢిల్లీ-హైదరాబాద్ విమానం టికెట్ ధర
(రంగారెడ్డి జిల్లా ప్రతినిధి-ఆంధ్రజ్యోతి): అమ్మో.. రూ.70 వేలే..!! ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమాన ప్రయాణానికి ఒక్క టికెట్‌కు ఇన్ని వేల రూపాయలా.. వామ్మో..!! బుధ, గురువారాల్లో పలువురు విమాన ప్రయాణికులకు ఎదురైన అనుభవం ఇది. బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం వేల సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్న ఆ పార్టీ శ్రేణుల ప్రభావమే ఇదంతా అని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో బుధవారం జరిగిన బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి వేల మంది కార్యకర్తలు, నేతలు తరలివెళ్లారు. అయితే, వీళ్లలో కొందరు తిరుగు ప్రయాణానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇలా ఏర్పాటు చేసుకోని వారంతా బుధవారం రాత్రి, గురువారం తిరుగుప్రయాణానికి విమాన టికెట్ల కోసం ప్రయత్నించారు. బుకింగ్‌కు రద్దీ అధికంగా ఉండటంతో టికెట్ ధర పెరిగిపోయింది. బుధవారం రాత్రి ఫ్లైట్ టికెట్ ధర 70 వేలు పలికింది. ఇక, గురువారం ప్రయాణానికి కూడా ఇదే ధర కొనసాగింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు నేరుగా వెళ్లే ఫ్లైట్ టికెట్లు ముందుగానే అమ్ముడవ్వడంతో వాటి బుకింగ్స్‌ను విమానయాన సంస్థలు మూసేశాయి. దీంతో ఆలస్యమైన లింక్ విమానాలు అంటే.. ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల మీదుగా హైదరాబాద్ చేరుకునే ఫ్లైట్ల టికెట్లను విక్రయించాయి. కానీ, ఈ విమానాల టికెట్ కూడా రూ.70 వేలు పలికింది. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రెండు విమాన సర్వీసులు (ఒకటి 19:55 నిమిషాలకు, మరొకటి 8:40నిమిషాలకు) నడిపిన విస్తార సంస్థ చివరి టిక్కెట్లు ఒక్కోటి రూ.70,079లుగా విక్రయించింది. ఇంత ఖర్చు చేసినా రెండు స్టాపుల్లో ఆగి 15గంటల 35నిమిషాల పాటు సాగే సుదీర్ఘ ప్రయాణం కావడం గమనార్హం. శుక్రవారం సాయంత్రం నుంచి నేరు సర్వీసు టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా రూ.20వేల వరకు ఉండడం గమనార్హం. ఒక్కసారిగా పెరిగిన ఈ టికెట్ రేట్లతో బీఆర్‌ఎస్ శ్రేణులతోపాటు పలువురు సాధారణ ప్రయాణికులు కూడా అవస్థ పడ్డారు.
ఆకాశాన్నంటిన విమాన టికెట్ల ధరను చూసి పెద్దసంఖ్యలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఢిల్లీలోని ఉండిపోయారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 2వేల మందికి పైగా నేతలు, కార్యకర్తలు ఢిల్లీ వెళ్లారు. ఇందులో సగం మందికిపైగా గురువారం ఢిల్లీలోనే ఉండిపోయారు. విమాన టికెట్ దొరక్కపోవడంతో తాను, తన అనుచరులు దాదాపు వందమంది హోటల్ గది బుకింగ్‌ను ఒక రోజు పొడిగించుకున్నామని జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తెలిపారు.
Updated Date - 2022-12-16T12:26:10+05:30 IST