ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటికీ 2003 పీఆర్సీ వేతనాలే!

ABN, First Publish Date - 2022-06-25T09:21:31+05:30

తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌.. సంస్థలోని ఉద్యోగులంతా వికలాంగులే! సాధారణ ఉద్యోగుల మాదిరిగానే వీరూ తమకు అప్పగించిన పనులు చక్కగా పూర్తి చేస్తున్నారు. అంగవైకల్యం ఉన్నా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

3 పీఆర్సీలకు దూరంగా రాష్ట్ర.. వికలాంగుల కార్పొరేషన్‌ ఉద్యోగులు

ఏపీలో ఒకేసారి 3 పీఆర్సీల అమలు

రాష్ట్రంలో ఇంకా ఎదురుచూపులే

పీఆర్సీ లేకపోవడంతో పదవీ విరమణ

ప్రయోజనాలపైనా ప్రభావం

ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగుల ఆగ్రహం


హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌.. సంస్థలోని ఉద్యోగులంతా వికలాంగులే! సాధారణ ఉద్యోగుల మాదిరిగానే వీరూ తమకు అప్పగించిన పనులు చక్కగా పూర్తి చేస్తున్నారు. అంగవైకల్యం ఉన్నా.. సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు. కానీ, మిగిలిన కార్పొరేషన్ల ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా వీరికి సమయుయానికి పీఆర్సీ, పదవీ విరమణ ప్రయోజనాలు అందించడం లేదు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కార్పొరేషన్‌లో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగుల పట్ల ఎంతో బాధ్యతగా ఉండాల్సి ఉన్నతాధికారులు.. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల ఇబ్బందులు కనిపించనట్లు, వారి గోడు వినిపించనట్లు వ్యవహరిస్తుండడంతో 2022లోనూ 2003 పీఆర్సీ జీతాలతోనే పనిచేయాల్సి వస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అందరితోపాటు తమకూ మేలు జరుగుతుందని భావించగా.. ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని కార్పొరేషన్‌ ఉద్యోగులు వాపోతున్నారు.


1981లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ప్రకటించగా.. అదే ఏడాది దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగుల కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. కార్పొరేషన్‌లో 95ుపైగా ఉద్యోగులు వికలాంగులే. 1983లో వికలాంగుల సంక్షేమ శాఖ ఏర్పాటైంది. కాలక్రమంలో కార్పొరేషన్‌ వెనకబడి.. సంక్షేమ శాఖ ముందుకెళ్లింది. సంక్షేమ శాఖలో అందరికీ పదోన్నతులు, పీఆర్సీలు, ఇతర ప్రయోజనాలు సకాలంలో అందుతున్నాయి. కార్పొరేషన్‌లో మాత్రం ఉద్యోగుల గోడు పట్టించుకునే అధికారులే కరువయ్యారు. జేఎండీ, ఎండీ, డైరెక్టర్‌, కమిషనర్‌, ముఖ్య కార్యదర్శి, కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇలా పేరుకు పెద్దపెద్ద పోస్టులు ఉన్నా.. ఎక్కడా తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని కార్పొరేషన్‌ ఉద్యోగులు వాపోతున్నారు.


ఇప్పటికీ 2003 పీఆర్సీ వేతనాలే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల వికలాంగుల కార్పొరేషన్‌లో పీఆర్సీ అమలు ఆలస్యమైంది. 2008లో మరో పీఆర్సీ అమల్లోకి వచ్చింది. కోర్టు ఆదేశాలతో రాష్ట్ర విభజనకు ముందు 2014లో కార్పొరేషన్‌లో ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలు చేయాలని వికలాంగుల సంక్షేమ శాఖ నాటి ముఖ్య కార్యదర్శి నీలం సహానీ ఉత్తర్వులు ఇచ్చారు. 2003 పీఆర్సీ అమలు చేయగా.. 2008 పీఆర్సీ అమలు చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత వికలాంగుల కార్పొరేషన్‌ రెండుగా విడిపోయింది. 2008, 2014, 2019 పీఆర్సీలను ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల కార్పొరేషన్‌లో ఒకేసారి అమల్లోకి తెచ్చారు. కానీ, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌లో మాత్రం ఇప్పటి వరకు సిబ్బందికి పీఆర్సీ అమలు చేయడం లేదు. దీంతో కార్పొరేషన్‌ ఉద్యోగులు 2022లోనూ 2003 పీఆర్సీనే అందుకుంటున్నారు.


అదేమిటని అధికారుల్ని ప్రశ్నిస్తే కార్పొరేషన్‌లో కొందరి నియామకాలు సరిగా లేవని కుంటి సాకులు చెబుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఇంతకాలం పనిచేసిన తర్వాత ఇప్పుడు అక్రమ నియామకాలు అని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నియామకాలను గుర్తించి, వారికి కాకుండా మిగిలిన వారికైనా పీఆర్సీ అమలు చేయాలని కోరుతున్నారు. నియామకాలు సరిగా లేకపోతే ఏపీలో ఎలా ఇస్తున్నారని, తెలంగాణలో 61 ఏళ్లకు ఉద్యోగ విరమణ వయసును ఎలా పెంచారని ప్రశ్నిస్తున్నారు. 2010లో వెంకటరామిరెడ్డి కమిటీ అందరికీ పీఆర్సీ ఇవ్వాలని నివేదిక ఇచ్చిందని, అప్పటి కమిటీలో ఉన్న ప్రస్తుత డైరెక్టర్‌ శైలజ ఇప్పుడా విషయం మరిచి వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు పీఆర్సీల అమలుకు ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్‌ ఉద్యోగులు కోరుతున్నారు. 


పీఆర్సీపై చర్చిస్తున్నాం: వాసుదేవరెడ్డి

ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై బోర్డులో చర్చిస్తున్నామని వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ అమలుపై అధ్యయనం చేసి ఇక్కడా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఏపీలో అమలు చేస్తున్న విధానాలపై సమగ్ర వివరాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాటిని తెలంగాణ ఆర్థిక శాఖకు సమర్పించి పీఆర్సీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఉన్నతాధికారులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేసి పీఆర్సీపై చర్చిస్తామని చైర్మన్‌ చెప్పారు. 


ఆర్థిక ఇబ్బందులు..

వికలాంగుల కార్పొరేషన్‌లో మూడు పీఆర్సీలు అమలు చేయకపోవడంతో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీఆర్సీ అమలు కాకపోవడంతో వేతనం పెరగదు. వేతనం పెరగకపోతే పదవీ విరమణ ప్రయోజనాలూ తక్కువగా వస్తాయి. పింఛను రూపంలో వచ్చే అతికొద్ది మొత్తంపైనా పీఆర్సీ ప్రభావం పడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. కార్పొరేషన్‌లో పదవీ విరమణప్రయోజనాల చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సంస్థలో వచ్చే పింఛనూ నామమాత్రమే. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌తోనే విశ్రాంత జీవితం గడపాల్సి ఉంటుంది. సర్వీసులో ఉన్నంతకాలం వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే వికలాంగ ఉద్యోగులు రిటైర్మెంట్‌ తర్వాత కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పొందకుండానే మృతి చెందారని, ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు కనికరించడం లేదని వాపోతున్నారు.

Updated Date - 2022-06-25T09:21:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising