పుజార సెంచరీ మిస్
ABN, First Publish Date - 2022-12-15T02:54:01+05:30
టెస్ట్‌ల్లో తన స్థానం ప్రశ్నార్థకమైన వేళ వెటరన్ ఆటగాడు చటేశ్వర్ పుజార (90) విజృంభించాడు. ఇక పరిమిత ఓవర్లలో తనదైన ముద్ర వేసిన శ్రేయాస్ అయ్యర్ (82 బ్యాటింగ్) టెస్ట్‌ల్లో తనకు అందివచ్చిన
అయ్యర్ అర్ధ శతకం
భారత్ 278/6
బంగ్లాతో తొలి టెస్ట్
చిట్టగాంగ్ : టెస్ట్‌ల్లో తన స్థానం ప్రశ్నార్థకమైన వేళ వెటరన్ ఆటగాడు చటేశ్వర్ పుజార (90) విజృంభించాడు. ఇక పరిమిత ఓవర్లలో తనదైన ముద్ర వేసిన శ్రేయాస్ అయ్యర్ (82 బ్యాటింగ్) టెస్ట్‌ల్లో తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వీరికి కీపర్ పంత్ ఽ(45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) ధనాధన్ బ్యాటింగ్ తోడవడంతో బంగ్లాదేశ్‌తో బుధవారం ప్రారంభమైన మొదటి టెస్ట్‌లో భారత్ తొలిరోజు ఆఖరికి ఆరు వికెట్లకు 278 పరుగులు చేసింది. స్పిన్నర్ తైజుల్ ఇస్లాం మూడు కీలక వికెట్లతో దెబ్బ కొట్టాడు.
టాపార్డర్ విఫలం: టాస్ గెలిచిన కెప్టెన్ రాహుల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరో ఓవర్లోనే బౌలింగ్‌కు వచ్చిన బంగ్లా స్పిన్నర్లు వికెట్‌ను లక్ష్యంగా చేసుకొని బంతులు వేసి రాహుల్, గిల్‌ను నిలువరించారు. అలా మొదటి గంట ఆట ముగిసిందో లేదో..భారత్ వికెట్ల పతనం ప్రారంభమైంది. స్పిన్నర్ తైజుల్ బంతిని గిల్ (20) స్వీప్ చేయబోగా..బంతి బ్యాటు అంచును తాకి గాల్లోకి లేచింది. తొలి స్లిప్‌లో ఉన్న యాసిర్ ఎడమవైపు పరిగెత్తి చక్కటి క్యాచ్ అందుకున్నాడు. ఆపై ఖాలిద్ అహ్మద్ బంతిని వికెట్లపైకి ఆడుకొని రాహుల్ (22) బౌల్డ్‌కాగా..తైజుల్ బౌలింగ్‌లో విరాట్ (1) వికెట్లు ముందు అడ్డంగా దొరికిపోయాడు. దాంతో 48/3తో భారత్ కష్టాల్లో పడింది.
పంత్ దూకుడు..: టెస్ట్‌ల్లో ధనాధన్ బ్యాటింగ్ చేసే పంత్ ఈ మ్యాచ్‌లోనూ అదే తరహాలో ఆడాడు. వస్తూనే అతడు 6,4తో విరుచుకుపడగా పుజార తనదైన శైలిలో ఆచితూచి ఆడాడు. 85/3తో భారత్ లంచ్‌కు వెళ్లగా..విరామం అనంతరం రెండో బంతికే పుజార క్యాచ్ అవుట్‌నుంచి బయటపడ్డాడు. మరోవైపు దూకుడైన బ్యాటింగ్ కొనసాగించిన పంత్..50వ టెస్ట్‌లో అర్థశతకానికి చేరువైన దశలో మరో భారీ షాట్ కొట్టబోయి బౌల్డయ్యాడు. దాంతో నాలుగో వికెట్‌కు 64 పరుగుల (72 బంతులు) భాగస్వామ్యం ముగిసింది. ఆపై శ్రేయాస్, పుజార తమకు లభించిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగారు. టీ విరామానికి భారత్ 174/4తో నిలిచింది. తిరిగి వచ్చాక పుజార అర్థ శతకం పూరించగా..ఆపై శ్రేయాస్ కూడా ఆ మార్క్ చేరాడు. ఐదో వికెట్‌కు 149 పరుగులు జత చేసి పురోగమిస్తున్న ఈ జోడీని పుజారాను బౌల్డ్ చేయడం ద్వారా తైజుల్ విడదీశాడు. అయ్యర్, అక్షర్ మరో వికెట్ పడకుండా మొదటి రోజును ముగిస్తారనుకుంటుండగా.. అక్షర్ (14)ను మెహ్దీహసన్ ఎల్బీగా తిరుగుముఖం పట్టించాడు. దాంతో తొలిరోజు భారత్, బంగ్లాదేశ్ జట్లు సమంగా నిలిచినట్టయింది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) ఖాలిద్ 22, గిల్ (సి) యాసిర్ (బి) తైజుల్ 20, పుజార (బి) తైజుల్ 90, కోహ్లీ (ఎల్బీ) తైజుల్ 1, పంత్ (బి) మెహ్దీహసన్ 46, శ్రేయాస్ (బ్యాటింగ్) 82, అక్షర్ (ఎల్బీ) మెహ్దీహసన్ 14, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం: 90 ఓవర్లలో 278/6, వికెట్లపతనం: 1/41, 2/45, 3/48, 4/112, 5/261, 6/278, బౌలింగ్: ఎబాదత్ 17-1-63-0, ఖాలిద్ అహ్మద్ 12-2-26-1, షకీబల్ 12-4-26-0, తైజుల్ 30-8-84-3, మెహ్దీహసన్ 18-4-71-2, యాసిర్ 1-0-7-0.
Updated Date - 2022-12-15T02:54:02+05:30 IST