ఇతర క్రీడాంశాల్లో మనోళ్ల ప్రదర్శన
ABN, First Publish Date - 2022-08-04T08:53:00+05:30
కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ అమ్మాయిల జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. నాకౌట్ చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో అమ్మాయిలు సత్తాచాటారు...
సెమీ్‌సకు అమ్మాయిలు... చేరువలో పురుషులు
కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ అమ్మాయిల జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. నాకౌట్ చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో అమ్మాయిలు సత్తాచాటారు. పూల్-ఎలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2 గోల్స్ తేడాతో కెనడాపై గెలుపొందింది. భారత జట్టులో సలీమా టెటె (3వ), నవ్‌నీత్ కౌర్ (22వ), లాల్రెమ్సియామి (51వ) తలా గోల్ సాధించారు. ఇక, పురుషుల పూల్-బిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 8-0తో కెనడాను చిత్తుచిత్తుగా ఓడించింది. హర్మన్‌ప్రీత్ (7వ, 54వ), ఆకాశ్‌దీప్ (38వ, 60వ) చెరో రెండు గోల్స్‌తో విజృంభించగా, అమిత్ (10వ), లలిత్ ఉపాధ్యాయ్ (20వ), గుర్జాంత్ సింగ్ (27వ), మన్దీప్ సింగ్ (58వ) తలా గోల్ కొట్టారు. ఈ గెలుపుతో భారత్ తన గ్రూప్‌లో టాపర్‌గా నిలిచి సెమీ్‌సకు అడుగుదూరంలో నిలిచింది. తన పూల్‌లో ఆఖరి మ్యాచ్‌ను వేల్స్ జట్టుతో భారత్ గురువారం ఆడనుంది.
మిక్స్డ్ ఫలితాలు
లాన్ బౌల్స్ పురుషుల సింగిల్స్‌లో మృదుల్ బోర్గాహైన్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచాడు. తొలుత రెండోరౌండ్లో 21-5తో క్రిస్ లాక్ (ఫాల్కన్ ఐలాండ్)పై, తర్వాతి రౌండ్లో 21-19తో ఇయాన్ మెక్లీన్ (స్కాట్లాండ్)పై నెగ్గాడు. కాగా.. మహిళల పెయిర్స్‌లో లవ్లీ చోబే-నయనమోని సైకా రెండోరౌండ్లో నియో జట్టుపై 23-6తో నెగ్గారు. తర్వాతి రౌండ్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ను 16-16తో డ్రా చేసుకుంది.
డిస్కస్ త్రోలో సీమ, నవ్జీత్కు నిరాశ
మహిళల డిస్కస్ త్రోలో భారత స్టార్లు సీమా పూనియా, నవ్‌జీత్ థిల్లాన్ పతకాలు సాధించడంలో విఫలమయ్యారు. 39 ఏళ్ల సీమ ఫైనల్లో డిస్క్‌ను 55.92 మీటర్లు మాత్రమే త్రో చేసి ఐదోస్థానానికి పరిమితమైంది. గత క్రీడల్లో వరుసగా నాలుగుసార్లు (2006, 2014, 2018లో రజతాలు, 2010లో కాంస్యం) ఏదో ఒక పతకం సాధించిన సీమ.. పోడియం ఫినిష్ చేయకపోవడం ఇదే తొలిసారి. ఇక గత క్రీడల్లో కాంస్యం నెగ్గిన నవ్‌జీత్ 53.51 మీ. త్రోచేసి 8వ స్థానంలో నిలిచింది.
Updated Date - 2022-08-04T08:53:00+05:30 IST