పతక మోత
ABN, First Publish Date - 2022-08-04T09:00:21+05:30
కామన్వెల్త్ క్రీడల్లో ఆరోరోజు భారత క్రీడాకారులు మూడు పతకాలు కొల్లగొట్టారు. బుధవారం పోటీల్లో మహిళల జూడోలో తులికా మాన్ రజతంతో మెరవగా...
కామన్వెల్త్ క్రీడలు
జూడోలో తులికాకు రజతం
లిఫ్టింగ్, స్క్వాష్‌లో కాంస్యాలు
బాక్సింగ్‌లో సెమీస్‌కు ముగ్గురు
బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్‌లో రెండో స్థానం
కామన్వెల్త్ క్రీడల్లో ఆరోరోజు భారత క్రీడాకారులు మూడు పతకాలు కొల్లగొట్టారు. బుధవారం పోటీల్లో మహిళల జూడోలో తులికా మాన్ రజతంతో మెరవగా.. వెయిట్‌లిఫ్టింగ్ లో లవ్‌ప్రీత్ సింగ్, స్క్వాష్ సింగిల్స్‌లో సౌరవ్ ఘోషల్ కాంస్య పతకాలు సాధించారు. కాగా.. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీం ఈవెంట్లో భారత షట్లర్లు నిరాశ పరిచారు.. డిఫెండింగ్ చాంపియన్లయిన మనోళ్లు ఫైనల్లో మలేసియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు.. బాక్సింగ్‌లో తెలుగు తేజాలు నిఖత్ జరీన్, హుసాముద్దీన్, హరియాణా అమ్మాయి నీతూ గంఘాస్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకాలు ఖాయం చేసుకున్నారు.
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో గత ఐదు రోజులుగా పతకాల పంట పండించిన భారత క్రీడాకారులు ఆరోరోజూ తమ జోరును ప్రదర్శించారు. బుధవారం పోటీల్లో మూడు పతకాలు సాధించారు. జూడోలో తులికా మన్ రజతం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్, స్క్వాష్‌లో సౌరవ్ ఘోషల్ కాంస్య పతకాలు అందుకున్నారు.
లవ్‌ప్రీత్.. రెండు రికార్డులు
వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల 109 కి. విభాగంలో అమృత్‌సర్‌కు చెందిన 24 ఏళ్ల లవ్‌ప్రీత్‌సింగ్ 355 కిలోల వ్యక్తిగత అత్యుత్తమ టోటల్‌తో కాంస్య పతకం అందుకున్నాడు. స్నాచ్‌లో 163కి. ఎత్తిన అతడు క్లీన్ అండ్ జెర్క్‌లో 192 కి. లిఫ్ట్ చేశాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో లవ్‌ప్రీత్ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడం విశేషం. కామెరూన్, సమోవా లిఫ్టర్లు స్వర్ణ, రజతాలు గెలుపొందారు. ఇక ఈసారి క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్పటివరకు మూడు స్వర్ణాలు సహా మనోళ్లు మొత్తం ఎనిమిది పతకాలు నెగ్గారు. మహిళల 87 కి.లలో పూర్ణిమా పాండే (103+125= 228 కి.) ఆరో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, సమోవా, ఆస్ట్రేలియా లిఫ్టర్లు స్వర్ణ, రజత, కాంస్యాలు కైవసం చేసుకున్నారు.
Updated Date - 2022-08-04T09:00:21+05:30 IST