West Indies vs Scotland: టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. వెస్టిండీస్ ఓడిపోవడం ఏంటయ్యా..!
ABN, First Publish Date - 2022-10-17T20:52:08+05:30
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గ్రూప్-బిలోని వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్ల మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టుకు స్కాట్లాండ్ జట్టు ఊహించని..
టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) భాగంగా గ్రూప్-బిలోని వెస్టిండీస్ (West Indies), స్కాట్లాండ్ (Scotland) జట్ల మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టుకు స్కాట్లాండ్ జట్టు (West Indies vs Scotland) ఊహించని షాకిచ్చింది. 42 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసి స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. వరల్డ్ క్రికెట్‌లో కీలక జట్టుగా పేరున్న వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం విండీస్ అభిమానులను విస్మయానికి గురిచేసింది. పెద్దగా అంచనాలు లేని స్కాట్లాండ్ జట్టు గెలుపు చిన్న టీంలు అని తక్కువ అంచనా వేయకూడదని మరోసారి నిరూపించింది. శ్రీలంకపై నమీబియా జట్టు గెలుపు కూడా ఈ కోవకు చెందినదే. ఇక.. స్కాట్లాండ్, వెస్టిండీస్ మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ జట్టుకు 55 పరుగుల శుభారంభాన్ని ఓపెనర్లు అందించారు. ఓపెనర్ మున్సే 66 పరుగులతో రాణించి నాటౌట్‌గా నిలిచాడు. మైఖేల్ జోన్స్ 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
స్కాట్లాండ్ వికెట్ కీపర్ క్రాస్ కూడా హోల్డర్ బౌలింగ్‌లో 3 పరుగులు మాత్రమే చేసి బ్రూక్స్‌కు క్యాచ్‌గా దొరికి పెవిలియన్ చేరాడు. బెర్లింగ్‌టన్ 16 పరుగులు, మ్యాక్‌లియోడ్ 23 పరుగులు, లీస్క్ 4 పరుగులు, క్రిస్ గ్రీవ్స్ 16 పరుగులు చేశారు. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో స్కాట్లాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టుకు స్కాట్లాండ్ బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. 20 పరుగుల వద్ద ఓపెనర్ మేయర్స్ వికెట్‌ను విండీస్ కోల్పోయింది. ఆ తర్వాత లెవిస్ 14, బ్రాండన్ కింగ్ 17 పరుగులకే చేతులెత్తేశారు. వెస్టిండీస్ జట్టు కెప్టెన్ పూరన్ పేలవ ప్రదర్శనతో ఆ జట్టు అభిమానులను నిరాశపరిచాడు. లీస్క్ బౌలింగ్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. బ్రూక్స్ 4, పావెల్ 5 పరుగులకే ఔట్ అయ్యారు. అయితే.. హోల్డర్ 38 పరుగులతో విండీస్ గెలుపుపై ఆశలు చిగురించేలా చేసినప్పటికీ ఆ ఛాన్స్ లేకుండానే పోయింది. సఫ్యాన్ షరీఫ్ బౌలింగ్‌లో క్రిస్ గ్రీవ్స్‌కు క్యాచ్‌గా హోల్డర్ దొరికిపోవడంతో విండీస్ ఓటమి ఖాయమైంది. వెస్టిండీస్ జట్టు 161 పరుగుల లక్ష్య ఛేదనలో చేతులెత్తేసి 18.3 ఓవర్లలో 118 పరుగులు చేసి ఆలౌట్ అయి ఓటమిపాలైంది.
ఇదిలా ఉండగా.. సూపర్-12లో ప్రస్తుతం 8 జట్లున్నాయి. మిగిలిన నాలుగు జట్ల కోసమే ఈ అర్హత మ్యాచ్‌లు జరుగుతున్నాయి. గ్రూప్-ఎలో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ ఉండగా.. గ్రూప్-బిలో స్కాట్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే పోటీపడనున్నాయి. గ్రూప్‌లో ప్రతీ జట్టు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో నుంచి టాప్-2 జట్లు ఈనెల 22 నుంచి జరిగే సూపర్-12లో ప్రవేశిస్తాయి. నవంబరు 13న ఫైనల్ జరుగుతుంది.
Updated Date - 2022-10-17T20:52:08+05:30 IST