ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాహో రాహుల్‌

ABN, First Publish Date - 2022-06-12T05:59:59+05:30

తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌ స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా అంటూ వాటిలో మునిగి తేలుతుంటే తాను మాత్రం చదరంగం బోర్డు ప్రేమలో పడ్డాడు. తొమ్మిదేళ్ల వయస్సులో తండ్రితో కలిసి సరదాగా చెస్‌ ఆడడం ప్రారంభించిన ఆ బుడతడు పదేళ్లు గడిచే సరికి భారత 74వ గ్రాండ్‌మాస్టర్‌ కిరీటాన్ని అందుకున్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు కుర్రాడు శ్రీవాత్సవ్‌కు గ్రాండ్‌మాస్టర్‌ హోదా 

భారత్‌ నుంచి 74వ ప్లేయర్‌గా ఘనత 


తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌ స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా అంటూ వాటిలో మునిగి తేలుతుంటే తాను మాత్రం చదరంగం బోర్డు ప్రేమలో పడ్డాడు. తొమ్మిదేళ్ల వయస్సులో తండ్రితో కలిసి సరదాగా చెస్‌ ఆడడం ప్రారంభించిన ఆ బుడతడు పదేళ్లు గడిచే సరికి భారత 74వ గ్రాండ్‌మాస్టర్‌ కిరీటాన్ని అందుకున్నాడు. వచ్చే ఏడాదికి సూపర్‌ జీఎంగా తయారు కావాలనే లక్ష్యంతో శ్రమిస్తున్న పెద్ది రాహుల్‌ శ్రీవాత్సవ్‌తో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ.


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత చదరంగ క్రీడలో మరో గ్రాండ్‌మాస్టర్‌ అవతరించాడు. హైదరాబాద్‌కు చెందిన యువ చెస్‌ క్రీడాకారుడు పెద్ది రాహుల్‌ శ్రీవాత్సవ్‌ జీఎం హోదా సాధించి అదరహో అనిపించాడు. ఇటలీలో జరుగుతున్న క్యాటోలికా చెస్‌ ఫెస్టివల్‌లో జార్జియా గ్రాండ్‌మాస్టర్‌ లెవాన్‌ పన్‌త్సులాయియాతో ఎనిమిదో రౌండ్‌ గేమ్‌ను రాహుల్‌ డ్రాగా ముగించాడు. దీంతో రాహుల్‌ ఖాతాలో 2501 ఎలో రేటింగ్‌ పాయింట్లు చేరాయి. తద్వారా అతను జీఎం హోదా అందుకున్నాడు. గ్రాండ్‌ మాస్టర్‌ హోదా రావాలంటే మూడు జీఎం నార్మ్‌లు సాధించడంతో పాటు 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లు ఉండాలి. అయితే.. 19 ఏళ్ల రాహుల్‌ 2019లోనే మూడు జీఎం నార్మ్‌లు సాధించాడు. కానీ, ఎలో రేటింగ్‌ పాయింట్లు తక్కువ ఉండడంతో జీఎం హోదా కోసం అతను రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఇరిగేసి అర్జున్‌, హర్షా భరత్‌ కోటి, రాజా రిత్విక్‌ తర్వాత తెలంగాణ నుంచి నాలుగో గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన రాహుల్‌.. ఓవరాల్‌గా భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన 74వ ప్లేయర్‌. 1988లో భారత తొలి గ్రాండ్‌మాస్టర్‌గా దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.  


జీఎం టైటిల్‌ సాధించాక ఎలా అనిపిస్తోంది ?

రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. గ్రాండ్‌మాస్టర్‌ అనే టైటిల్‌ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నా. నా పదేళ్ల కష్టానికి ఫలితం దక్కడంతో చాలా ఆనందంగా ఉన్నా. కొవిడ్‌ లాక్‌డౌన్‌ లేకపోయుంటే 2020లోనే జీఎం హోదా దక్కేది. గ్రీస్‌లో 2019 ఆగస్టులో తొలి జీఎం నార్మ్‌ సాధించా. అదే ఏడాది డిసెంబరులో ఇటలీలో జరిగిన పోటీల్లో మూడో నార్మ్‌  సొంతం చేసుకున్నా. మూడు నార్మ్‌లు లభించినాఎలో రేటింగ్‌ 2,460 పాయింట్లే ఉండడంతో మరికొన్ని టోర్నీల్లో ఆడాల్సి వచ్చింది. అయితే, ఇంతలో కొవిడ్‌ మహమ్మారి ఎంట్రీ ఇవ్వడంతో కొన్ని పోటీలు రద్దు కాగా, మరికొన్ని వాయిదా పడ్డాయి. మొత్తానికి జీఎం టైటిల్‌ దక్కడంతో పెద్ద ఊరట లభించింది.


అసలు చెస్‌ ఎలా మొదలుపెట్టావు...?

నాన్న శ్రీకాంత్‌ చదువుకునే రోజుల్లో యూనివర్సిటీ స్థాయి ఆటగాడు. నాకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు నాన్నతో సరదాగా చెస్‌ ఆడడం ప్రారంభించా. అలా చెస్‌లో ఓనమాలు నేర్చుకున్నా. నాన్న ప్రోత్సాహంతోనే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా. 2011లో అండర్‌-9 కేటగిరీలో రాష్ట్ర చాంపియన్‌గా నిలిచా. 2011నుంచి 2015 వరకు మురళి సార్‌ వద్ద శిక్షణ తీసుకున్నా. ఈ సమయంలో జాతీయ అండర్‌-11, 13, 15 విభాగాల్లో రజత పతకాలు సాధించి రన్నర్‌పగా నిలవడంతో పాటు 2012లో శ్రీలంకలో జరిగిన ఆసియా యూత్‌ చెస్‌ చాంపియన్‌లో కాంస్య పతకం నెగ్గా. ఆ తర్వాత 2015 నుంచి రెండేళ్ల పాటు హైదరాబాద్‌లోని రేస్‌ చెస్‌ అకాడమీలో రామరాజు మాస్టర్‌ దగ్గర శిక్షణ తీసుకున్నా. ఈ సమయంలో 2015లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్‌ చెస్‌ చాంపియన్‌లో సాధించిన కాంస్య పతకం నాలో ఆత్మవిశ్వాసం నింపింది. గ్రాండ్‌మాస్టర్‌ కావాలని అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నా.


మీ ఆరాధ్య ఆటగాళ్లు ఎవరు?

వరల్డ్‌ నెంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌, విశ్వనాథన్‌ ఆనంద్‌.


ఏ ఓపెనింగ్‌ స్టయిల్‌ను ఇష్టపడతారు?

కింగ్స్‌ ఇండియన్‌, బెలోనియన్‌ ఓపెనింగ్‌ అంటే ఇష్టం. అయితే, సందర్భానుసారం ఓపెనింగ్స్‌ను ఎంపికలో మార్పులు చేసుకుంటుంటా. కెరీర్‌ ప్రారంభంలో పూర్తి  దూకుడైన గేమ్‌ ఆడేవాడిని. ఇప్పుడు కొంచెం రక్షణాత్మక శైలిని అలవాటు చేసుకున్నా.


లాక్‌డౌన్‌ రెండేళ్ల విరామంలో ఏం చేశారు?

లాక్‌డౌన్‌ ఇన్ని రోజులు ఉంటుందని ఊహించలేదు. డెన్మార్క్‌ జీఎం సిప్కీ ఎర్నెస్ట్‌ దగ్గర శిక్షణ తీసుకుని టెక్నిక్‌ను మెరుగుపర్చుకున్నా. చదువుతూ చెస్‌ కొనసాగించాలని నిర్ణయించుకుని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సా్‌సలో ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు స్కాలర్‌షిప్‌ సాధించా. కిందటి ఏడాదే యూనివర్సిటీలో చేరా. ప్రస్తుతం టెక్సాస్‌ విశ్వవిద్యాలయం చెస్‌ టీమ్‌లో మెంబర్‌గా కూడా ఉన్నా. మరో మూడేళ్లు ఇక్కడే (అమెరికా) ఉండి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయడంతో పాటు అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొంటా.


గెలుపోటములను ఎలా స్వీకరిస్తారు?

రెండింటినీ సమానంగా స్వీకరించడం కష్టమే కానీ, అలా తీసుకుంటేనే ముందుకు వెళ్లగలం. విజయం సాధించినప్పుడు పెద్దగా సంబరాలేమీ చేసుకోను కానీ, ఓడిపోయినప్పుడు అయితే, ఒక్కడినే వాకింగ్‌ చేస్తూ చుట్టూ ఉన్న పరిసరాలను ఆస్వాదిస్తా. 


ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?

మిత్రులతో కలిసి వీడియో గేమ్‌లు ఆడుతుంటా. దీనికి ప్రత్యేక గ్రూప్‌ ఒకటి ఉంది. అర్జున్‌, ప్రజ్ఞానంద, సరీన్‌ నేను కలిసి ఖాళీగా ఉన్నప్పుడు వీడియో గేమ్‌లు ఆడుతుంటాం. ఈ మధ్య అయితే, పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నా. 

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)



Updated Date - 2022-06-12T05:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising