Most Expensive Diamonds: ప్రపంచంలో అరుదైన వజ్రాలు!!
ABN, First Publish Date - 2022-09-11T19:06:48+05:30
ప్రపంచ వ్యాప్తంగా అరుదైన, ఖరీదైన వజ్రాలు
వజ్రం ఎప్పటీకి నిలిచి ఉంటుంది అనే మాట అందరికీ తెలిసే ఉంటుంది. ధగధగా మెరిసిపోయే వజ్రాలను ధరించడం గొప్పతనంగా కూడా భావిస్తారు. ముఖ్యంగా రాజ కుటుంబాలకు ఈ వజ్రాల సెంటిమెంట్ చాలా ఉంటుంది. క్వీన్ ఎలిజబెత్-2 ఈనెల 8వ తేదీ గురవారం మరణించారు. దీంతో ఎన్నో సంవత్సరాలు తన కిరీటంలో చిన్న చిన్న వజ్రాల మధ్యన రాజసంగా కొలువైన కోహినూర్ వజ్రం గురించి మళ్ళీ చర్చ మొదలైంది. ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలు కోహినూర్ వజ్రం మాకు చెందాలి అంటే మాకు చెందాలి అని డిమాండ్ చేస్తున్నాయి. భారతదేశం కూడా 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వజ్రాన్ని అప్పగించాలని అడుగుతూనే ఉంది. ఎవరు ఎంత అరిచి గోల పెట్టినా బ్రిటన్ రాజవంశం తనకేమీ పట్టనట్టుగా బెల్లం కొట్టినరాయిలా ఉంది. దాదాపు 173 సంవత్సరాల నుంచి బ్రిటన్ రాజవంశంలో మహిళల ఆభరణాల్లో భాగంగా ఉంది ఈ కోహినూర్ వజ్రం. ఈ కోహినూర్ వజ్రానికి ఎందుకంత డిమాండ్ ఏర్పడంది? ఇది తప్ప వేరే వజ్రాలు ఈ ప్రపంచంలో లేవా? అసలు వజ్రం ఎందుకంత విలువైనది? అనే వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
వజ్రాలు ప్రకృతి సిద్దంగా ఏర్పడతాయి. ఇవి ఏర్పడటానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. భూగర్భ తవ్వకాలు జరిపినపుడు వజ్రాలు లభ్యమవుతూ ఉంటాయి. కోహినూర్‌తో కలిపి ప్రపంచ వ్యాప్తంగా అరుదైన, ఖరీదైన వజ్రాలు ఆరు ఉన్నాయి. ఆ వజ్రాలు, వాటి గురించి వివరాలు కాస్త ఆశ్చర్యపరుస్తాయి.
కోహినూర్ డైమండ్
కాకతీయుల కాలంలో కొల్లూరు గనులలో జరిపిన తవ్వకాల్లో ఈ కోహినూర్ డైమండ్ దొరికిందని చెబుతారు. ఈ విషయం ఎక్కడా అధికారికంగా రికార్డ్ చేయకపోయినా మొత్తానికి కోహినూర్ దొరికింది భారతదేశంలోనే అనేది నిజం. కాలతీయుల కాలంలో బయటపడిన ఈ వజ్రం.. చాలా చేతలు మారింది. చివరకు పంజాబ్ బ్రిటీష్ వాళ్ల ఆక్రమణలోకి వెళ్లిన తర్వాత పంజాబ్ పాలకుడు దులీప్‌సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణి వద్దకు చేర్చాడు. అప్పటికి ఈ వజ్రం 186 క్యారెట్లు ఉన్నట్టు సమాచారం. అయితే ఒకరి చేతుల నుంచి మరొకరి చేతుల్లోకి మారి.. చివరికి బ్రిటన్ రాజ కుటుంబం గుప్పెట్లోకి వెళ్లిన తర్వాత వజ్రం కొద్దిగా మెరుపు తగ్గిందని చరిత్రకారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఎలిజబెత్-2 మరణించడం వల్ల ఆమె కోడలు కెమిల్లా కోహినూరు వజ్రం పొదిగిన కిరీటాన్ని ధరించనున్నారు. ప్రస్తుతం ఇది 109 క్యారెట్లతో 21.6 గ్రాములు ఉంది. దీన్ని అప్పట్లో బాబర్ వజ్రంగా కూడా పిలిచేవారు. ఒకసారి బాబర్ దీని విలువ గురించి చెబుతూ "ప్రపంచం మొత్తానికి రెండు రోజులకు తిండి పెట్టగలిగినంత" ఖరీదైందని అన్నాడు.
సాన్సీ డైమండ్
ఇప్పుడు సాన్సీ డైమండ్‌గా ప్రఖ్యాతి గాంచిన ఈ వజ్రం మొదట 20 గ్రాముల బరువు ఉండేది. ప్రస్తుతం ఇది పారిస్‌లోని లౌవ్రే మ్యూజియం ఆధీనంలో ఉన్న ఈ వజ్రం మూలాలు కూడా భారతదేశంలోనే ఉన్నట్టు చెబుతారు. కోహినూర్ తరువాత అత్యంత విలువైన వజ్రం ఇదే. కొద్ది రోజుల క్రితం ఈ వజ్రాన్ని షీల్డ్ ఆకారంలోకి మార్చారు. ఈ వజ్రం ప్రస్తుతం 55.23 క్యారెట్లతో 11.046గ్రాముల బరువు ఉంది.
కల్లినన్ డైమండ్
ప్రపంచంలో అతి విలువైన వజ్రాలలో మూడవది కల్లినన్ డైమండ్. 3,106.75 క్యారెట్ల బరువున్న దీని ఖరీదు 400 మిలియన్ అమెరికన్ డాలర్లు. భారతదేశ కరెన్సీలో దీని విలువ సుమాు రూ.31,86,24,20,000 వరకు ఉంటుంది. పరిమాణంలో ప్రపంచంలో అత్యంత పెద్జ వజ్రం ఇదే. దక్షిణాఫ్రికాలో వజ్రాల గనుల తవ్వకాల్లో 1905 జనవరి 26న ఈ వజ్రం దొరిగింది. ఆ సమయంలో థామస్ కల్లినన్ అనే వ్యక్తి వజ్రాల గనికి యజమానిగా ఉండేవారు. అందువల్లే ఈ వజ్రానికి కల్లినన్ అనే పేరు పెట్టారు. ఈ వజ్రం కూడా బ్రిటన్ రాజవంశస్తుల దగ్గరే ఉంది. క్వీన్ ఎలిజబెత్-2 కిరీటంలో కుడివైపున దీన్ని అమర్చారు.
హోప్ డైమండ్
హోప్ డైమండ్ 17వ శతాబ్దంలో గుంటూరులోని కొల్లూరు గనులలో దొరికింది. 45.52 క్యారెట్లతో 9.104 గ్రాములున్న ఈ వజ్రంలో బోరాన్ అనే రసాయన మూలకం ఉండటం వల్ల ఇది నీలం రంగులో ఉంటుంది. దీని ద్వారానే వజ్రాల గురించి కొత్త కొత్త విషయాలను పరిశోధకులు కనుగొన్నారు. గోల్కొండ వజ్రాలలో ఒకటిగా ఈ వజ్రాన్ని చెబుతారు. 1666 సంవత్సరంలో జీన్ బాప్టిన్ టువెర్నియన్ ఈ వజ్రాన్ని కొనుగోలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఆ తరువాత ఇతను ఆ వజ్రాన్ని 1668లో ఫ్రాన్స్ రాజు పద్నాలుగవ లూయిస్‌కు అమ్మాడు. 1792లో ఈ వజ్రం దొంగతనానికి గురైంది. ఆ సమయంలో వజ్రం ముక్కలైంది. ఆ తరువాత ఆ ముక్కలలో పెద్ద భాగం 1839లో వజ్రాల కెటలాగ్‌లో హోప్ పేరుతో దర్శనమిచ్చింది. 1949లో హ్యారీ విన్ స్టన్ అనే వజ్రాల వ్యాపారి ఈ వజ్రాన్ని కొనుగోలు చేశాడు. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్ లోని స్మిత్ సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ అనే పేరు గల మ్యూజియం కు విరాళంగా ఇచ్చేశాడు. ఈ హోప్ డైమండ్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది. దీని విలువ 350 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది.
డి బిర్స్ సెంటేనరీ డైమండ్
పరిమాణంలో కుల్లినాన్ వజ్రాల తరువాత అతి పెద్ద వజ్రం ఇదే. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఇది మూడవది. ఈ వజ్రం దక్షిణాఫ్రికాలోని ప్రీమియర్ మైన్‌లలో దొరికింది. వజ్రం దొరికిన సమయంలో గని యజమాని డి బిర్స్. ఇది 273.85 క్యారెట్ల ఈ వజ్రానికి రంగులేదు. 1988 మే 11న కన్సాలిడేటెడ్ మైన్స్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు దీన్నీ అందరి ముందుకు తీసుకొచ్చారు. అందుకే దీన్ని డి బిర్స్ సెంటెనరీ డైమండ్ అని అంటారు. హార్ట్ షేప్‌లో ఉన్న ఈ డైమండ్.. చాలా ఫేమస్. దీని విలువ 100 అమెరికన్ డాలర్లు.
స్టెయిన్మెట్జ్ పింక్ డైమండ్
పింక్ స్టార్‌గా పిలవబడుతున్న ఈ డైమండ్ ను మొదట్లో స్టెయిన్ మెట్జ్ పింక్ డైమండ్ అని పిలిచేవారు. 59.60 క్యారెట్ల ఈ వజ్రం..1999లో దక్షిణాఫ్రికాలోని వజ్రపు గనులలో ఇది దొరికింది. రంగు కారణంగా దీనికి పింక్ స్టార్ అనే రేటింగ్‌ను అమెరికా జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ వారు ఇచ్చారు. దీన్ని జాగ్రత్తగా కత్తిరించడానికి 20 నెలల సమయం తీసుకున్నారు. 2003 మే 29న జరిగిన వేడుకలో దీన్ని అందరి ముందుకు తీసుకొచ్చారు.
Updated Date - 2022-09-11T19:06:48+05:30 IST