మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలకు క్యాన్సర్‌కు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?
ABN, First Publish Date - 2022-02-08T17:31:23+05:30
శరీరంలోని ఏ భాగంలోనైనా పుట్టుమచ్చలు ఉంటాయి.
శరీరంలోని ఏ భాగంలోనైనా పుట్టుమచ్చలు ఉంటాయి. అయితే శరీరంపై పుట్టుమచ్చలు ఎందుకు ఉంటాయోనని ఎప్పుడైనా ఆలోచించారా? శరీరంలో అవి భాగం కానప్పుడు అవి ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? మాయో క్లినిక్ తెలిపిన వివరాల ప్రకారం పుట్టుమచ్చలు వ్యక్తి నుంచి వ్యక్తికి వాటి రంగు, పరిమాణంలో మార్పులు ఉంటాయి. కొందరికి పుట్టుమచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి, మరికొందరికి తక్కువగా ఉంటాయి. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. పుట్టుమచ్చలు ఎందుకు వస్తాయో.. వాటికి క్యాన్సర్‌తో ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పుట్టుమచ్చలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. మాయో క్లినిక్ తెలిపిన వివరాల ప్రకారం చర్మంలో ఉండే కణాలు (మెలనోసైట్లు) ఒకే చోట సమూహాల రూపంలో పెరగడం ప్రారంభించినప్పుడు, అవి పుట్టుమచ్చ రూపాన్ని సంతరించుకుంటాయి. ఈ కణాలు మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. చాలా వరకు పుట్టుమచ్చలు బాల్యం, కౌమారదశలో కనిపిస్తాయి. ప్రతీ మనిషిలో 10 నుంచి 40 వరకూ పుట్టుమచ్చలు కనిపిస్తాయి. కాలక్రమేణా మాయమయ్యే పుట్టుమచ్చలు కూడా ఉంటాయి. సాధారణంగా పుట్టు మచ్చలు హాని కలిగించవు. అయితే కొన్ని సందర్భాల్లో అవి క్యాన్సర్‌కు దారితీయవచ్చు. అందుకే పుట్టుమచ్చ పరిమాణం వేగంగా మారుతున్నట్లు కనినిస్తే వెంటనే క్యాన్సర్ వైద్య నిపుణులను సంప్రదించాలి. పుట్టుమచ్చ పరిమాణం సగానికి తగ్గినా, అది రంగు మారుతున్నట్లు కనిపించినా, దాని రంగు ముదురు నల్లగా మారినట్లయినా, పుట్టుమచ్చ ఉన్న ప్రదేశంలో దురద లేదా దాని నుండి రక్తస్రావం అవుతూ ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి. ఇవి చర్మ క్యాన్సర్ లక్షణాలు అయ్యేందుకు అవకాశం ఉంది. మీ శరీరంపై అలాంటి లక్షణాలు కనిపిస్తే, నిర్లక్ష్యం చేయవద్దు. కాగా కొందరు పుట్టుమచ్చని తొలగించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇలా ఎప్పుడూ చేయకూడదు. ఇది రక్తస్రావానికి దారి తీయడంతో పాటు ఇన్ఫెక్షన్‌ను కలగజేస్తుంది.
Updated Date - 2022-02-08T17:31:23+05:30 IST