Mukhtar Ansari: అండర్‌వరల్డ్ మూవీకి మించిన కథ.. ముక్తార్ అన్సారీ జీవితం!
ABN, First Publish Date - 2022-12-16T21:06:05+05:30
నేర సామ్రాజ్యాన్ని ఏలి ఆపై రాజకీయాల్లోకి వచ్చి ఓ వెలుగు వెలిగిన వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో ముక్తార్
నేర సామ్రాజ్యాన్ని ఏలి ఆపై రాజకీయాల్లోకి వచ్చి ఓ వెలుగు వెలిగిన వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో ముక్తార్ అన్సారీ (Mukhtar Ansari) ఒకరు. ఓ సినిమాకు అవసరమైన అన్ని కోణాలు ఆయన జీవితంలో ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్(Subhas Chandra Bose) నాయకత్వంలో దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా పోరాడిన కుటుంబం నుంచి వచ్చిన ఆయన కాంట్రాక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి.. నేరసామ్రాజ్యాధినేతగా ఎదిగారు. ఆపై రాజకీయాల్లోకి ప్రవేశించి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముక్తార్ అన్సారీకి ఓ కేసులో ఉత్తరప్రదేశ్ కోర్టు10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అండర్ వరల్డ్ సినిమా(Underworld Movie)కు ఏమాత్రం తీసిపోని ముక్తార్ అన్సారీ జీవితంలోకి ఓసారి తొంగిచూస్తే..
కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ సోదరుడు అవధేశ్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముక్తార్ అన్సారీని దోషిగా తేల్చిన యూపీ కోర్టు గురువారం 10 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన యూపీలోని బందా జైలులో ఉన్నారు. ఆయనపై భూ ఆక్రమణ, హత్య, దోపిడీ సహా ఆయనపై దాదాపు 60 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో డిసెంబరు 14న యూపీలోని స్థానిక కోర్టులో అన్సారీని ప్రవేశపెట్టిన అనంతరం ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. అంతకుముందు సెప్టెంబరులో అలహాబాద్ హైకోర్టులోని లక్నోబెంచ్.. జైలర్‌పై దాడి కేసులో అన్సారీకి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
15 ఏళ్లగా జైలులోనే..
ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన 59 ఏళ్ల ముక్తార్ అన్సారీ 15 ఏళ్లకు పైగానే జైలులో ఉన్నారు. ఇన్నేళ్లుగా ఆయనపై ఉన్న ఒక్క కూడా నిరూపణ కాలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఆ ధీమా సడలిపోయింది. 1996, 2002, 2007, 2012, 2017 ఎన్నికల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్సారీ.. చివరి మూడు విజయాలు జైలులో ఉండగా సాధించినవేనంటే నమ్మడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ముక్తార్ అన్సారీ కుమారుడు అబ్బాస్ అన్సారీ మావు సదర్ నుంచి సుహల్దేవ్ భారతీయ సమాజ్‌వాదీ పార్టీ (SBSP) తరపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే, మనీలాండరింగ్ కేసులో నవంబరు 5న ఈడీ ఆయనను కూడా అరెస్ట్ చేసింది. అబ్బాస్ జాతీయస్థాయి షూటర్ కూడా.
తాతలు గొప్పోళ్లే..
ముక్తార్ అన్సారీ తాత ఎంఏ అన్సారీ ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఢిల్లీ ఎయిమ్స్(AIIMS) సమీపంలోని అన్సారీ రోడ్, అన్సారీ నగర్ పేర్లు ఆయన పేరుపై పెట్టినవే. 1963లో జన్మించిన ముక్తార్ అన్సారీకి.. ఏంఏ అన్సారీ పేరు మీద ముక్తార్ జూనియర్ అని పేరు పెట్టారు. ముక్తార్ తాత బ్రిగేడియర్ మొహమ్మద్ ఉస్మాన్. ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీలో అత్యున్నత స్థాయి అధికారిగా పనిచేశారు. సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించారు.
కాంట్రాక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి..
ముక్తార్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. చారిత్రక నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ముక్తార్ జీవితాన్ని కాంట్రాక్టులు నేర ప్రవృత్తిలోకి అడుగుపెట్టేలా చేశాయి. 1980వ దశకంలో ముక్తార్ చిన్న చిన్న కాంట్రాక్టులతో జీవితాన్ని ప్రారంభించారు. ఆయన నేర సామ్రాజ్యంవైపు అడుగులు వేయడానికి అది బాటలు పరిచింది. 1988లో సచ్చిదానందరాయ్ అనే కాంట్రాక్టర్ హత్య ఆయన ప్రొఫైల్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత రాజేంద్రసింగ్ అనే కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. ఇలా వరుస హత్యలతో ఆయన పోలీసు రికార్డుల్లో నేరస్థుడిగా మారిపోయారు. ఆ తర్వాత ఆయన సొంత ముఠాను ఏర్పాటు చేసుకున్నారు.
పూర్వాంచల్‌పై ఆధిపత్య పోరు
ఒకసారి నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాక అందులోకి బయటకు రావడం అందరికీ అయ్యే పనికాదు. ముఠాల మధ్య పగలు, ప్రతీకారాలు, ఆధిపత్య పోరు వంటివి సర్వసాధారణం. ఈ క్రమంలో 1990 నుంచి 2005 వరకు అన్సారీ- బ్రజేష్ సింగ్ మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. మద్యం నుంచి బొగ్గు వరకు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు పొందేందుకు ఇద్దరి మధ్య గ్యాంగ్‌వార్ ఓ స్థాయిలో జరిగింది. 1990లో ఘాజీపూర్‌లో తొలిసారి ఇద్దరూ ముఖాముఖి తలపడ్డారు. ఈ క్రమంలో 1991లో ముక్తార్ అరెస్టయ్యారు. ఆయనను తరలిస్తుండగా ఇద్దరు పోలీసులను కాల్చి చంపి పరారయ్యారు. 1991లో కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ అన్న అవధేశ్ రాయ్‌ను హత్య చేశాడు. ఈ కేసులోనే గురువారం ఆయనను దోషిగా తేల్చిన కోర్టు జైలు శిక్ష విధించింది.
1996లో రాజకీయ రంగంలోకి..
ముక్తార్ 1996లో రాజకీయ రంగంలోకి ప్రవేశించి బ్రజేశ్ సింగ్‌పై మౌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1997లో వీహెచ్‌పీ జాతీయ కోశాధికారి, కోల్ కింగ్ నంద్ కిశోర్ రుంగ్తా హత్య తర్వాత ముక్తార్ అన్సారీ బీఎస్పీ నుంచి బహిష్కారానికి గురయ్యారు. ఈ హత్యకేసులో సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. ముక్తార్‌ను ఉద్దేశపూర్వకంగానే క్రిమినల్ కేసుల్లో తప్పుగా ఇరికించారని బీఎస్పీ చీఫ్ మాయావతి 2007లో ఆరోపించారు. 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు 2016లో వారిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు.
ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా..
ముక్తార్ ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా తన నేర సామ్రాజ్యాన్ని మాత్రం వదల్లేదు. మౌలో మతపరమైన అల్లర్లను ప్రేరేపించారనే ఆరోపణలపై 2005లో జైల్లో ఉంటూనే 2002లో మహ్మదాబాద్‌లో ముక్తార్ సోదరుడిని ఓడించిన కృష్ణానంద్‌రాయ్ హత్యకు ప్లాన్ చేశాడు. కృష్ణానంద్ రాయ్ హత్య కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఆయన భార్య అల్కారాయ్ పిటిషన్‌పై విచారణ ఢిల్లీకి మారింది.
పూర్వాంచల్ డాన్
ముక్తార్ అన్సారీ పూర్వాంచల్‌లో తిరుగులేని అండర్ వరల్డ్ డాన్ అయ్యాడు. ముక్తార్, ఆయన అనుచరులు కోరుకున్న కాంట్రాక్ట్ పొందేందుకు అధికారాన్ని ఉపయోగించుకున్నారు. అన్సారీ, ఆయన అనుచరులు చేసిన హత్యకేసులకు సంబంధించిన సాక్షులను దారుణంగా చంపేశారు. ఉత్తరప్రదేశ్‌ను దాటి మహారాష్ట్రలోనూ అన్సారీ తన నేర సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ‘మోకా’ చట్టం కింద కేసు నమోదు చేసింది.
యూపీకి వస్తే ఎన్కౌంటర్ చేస్తారని..
ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెడితే ఎన్కౌంటర్ కావడం ఖాయమని భయపడిన ముక్తార్ అన్సారీ రాష్ట్రం బయట ఉండేందుకు తన పలుకుబడిని ఉపయోగించుకున్నాడు. దోపిడీ కేసుల్లో చాలా నెలలు పంజాబ్ జైళ్లలో గడిపాడు. ఎన్కౌంటర్ ఖాయమని భయపడినా చివరికి బండా జైలుకు తీసుకొచ్చారు. ఇప్పుడు పదేళ్ల జైలు శిక్షకు గురయ్యారు.
ఓ గొప్ప కుటుంబం నుంచి వచ్చి నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ముక్తార్ అన్సారీ జీవితాన్ని అవే చిదిమేశాయి. డాన్‌గా, రాజకీయ నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు జైలులోని చీకటి గదులతో సావాసం చేస్తున్నారు.
Updated Date - 2022-12-16T21:14:59+05:30 IST