‘హీరో’ విజయ ప్రస్థానం: ఆయన మొదట్లో సైకిల్ విడిభాగాలు విక్రయించేవారు... పాక్ వెళుతున్న వ్యక్తి దగ్గర బ్రాండ్ పేరు తీసుకుని...
ABN, First Publish Date - 2022-11-10T10:29:03+05:30
ఇది ముంజల్ బ్రదర్స్ స్థాపించిన హీరో సైకిల్స్ విజయగాథ. ఈ కథ ప్రేరణాత్మకంగానూ ఉంటుంది. పంజాబ్ (ప్రస్తుతం పాకిస్తాన్)లోని తోబాటెక్ సింగ్ జిల్లాలోని కమాలియా పట్టణంలో బ్రిజ్మోహన్ లాల్ ముంజల్, అతని ముగ్గురు సోదరులు దయానంద్, సత్యానంద్, ఓంప్రకాష్ ముంజల్ ఉండేవారు.
ఇది ముంజల్ బ్రదర్స్ స్థాపించిన హీరో సైకిల్స్ విజయగాథ. ఈ కథ ప్రేరణాత్మకంగానూ ఉంటుంది. పంజాబ్ (ప్రస్తుతం పాకిస్తాన్)లోని తోబాటెక్ సింగ్ జిల్లాలోని కమాలియా పట్టణంలో బ్రిజ్మోహన్ లాల్ ముంజల్, అతని ముగ్గురు సోదరులు దయానంద్, సత్యానంద్, ఓంప్రకాష్ ముంజల్ ఉండేవారు. విభజనకు ముందే బ్రిజ్మోహన్ లాల్ ముంజల్ అమృత్‌సర్‌కు వచ్చారు. ఇక్కడ సైకిల్ విడిభాగాల వ్యాపారం చేసేవారు. ఓ రోజు బ్రిజ్‌మోహన్ సైకిల్ తయారు చేయాలని అనుకున్నారు. ఈ విషయాన్ని తన సోదరులకు చెప్పారు. అందరూ సరే అన్నారు. వారంతా లూథియానా నుండి పని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ముంజల్ సోదరులు అమృత్ సర్ నుంచి లూథియానా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదేసమయంలో వారికి తెలిసిన కరీం దిన్ అనే ముస్లిం వ్యక్తి పాకిస్తాన్‌కు వెళ్తున్నాడు.
అతను హీరో బ్రాండ్ పేరుతో సైకిల్ సాడిల్స్ తయారు చేసేవాడు. ఓంప్రకాష్ ముంజల్ ఆ బ్రాండ్ నేమ్‌ని ఉపయోగించడానికి అనుమతిని అడిగారు. కరీం దిన్ ఓకే చెప్పడంతో 'హీరో' కథ మొదలైంది. ముంజల్ బ్రదర్స్ సైకిల్‌లోని అన్ని భాగాలను తామే తయారు చేయాలనుకున్నారు. విదేశీ విడిభాగాలు ఖరీదైనవి. సమయానికి సరఫరా కావు. అందుకే వాటిని తామే సిద్ధం చేయాలని అనుకున్నారు. 1954లో వారు ఫోర్క్‌ను సిద్ధం చేయడానికి మొదటి ప్రయోగం చేశారు. తరువాత వారు సైకిల్ హ్యాండిల్ తయారు చేయడానికి రామ్‌గర్హియా కమ్యూనిటీకి వెళ్ళారు. అక్కడ హ్యాండిల్స్ తయారు చేయడంలో ప్రావీణ్యం కలిగిన వారున్నారు. ముంజల్ బ్రదర్స్... ఇద్దరు, ముగ్గురు ప్రయాణించేలా సైకిల్ తయారు చేయాలనుకున్నారు. దీనిలో వారు విజయం సాధించారు.
అది 1956వ సంవత్సరం... బ్రిజ్మోహన్ లాల్ బ్యాంక్ నుండి 50 వేల రుణం తీసుకుని, పంజాబ్ ప్రభుత్వం నుండి సైకిళ్ల తయారీకి ఫ్యాక్టరీ లైసెన్స్ పొంది, అనంతరం ఫ్యాక్టరీని ప్రారంభించారు. ముంజల్ బ్రదర్స్ హీరో సంస్థను 60వ దశకంలో ఊహించిన దానికంటే మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం హీరో సైకిల్స్ టర్నోవర్ వేల కోట్లలో ఉంది. 2024 నాటికి ఐపీఓను తీసుకొచ్చి పబ్లిక్ కంపెనీగా మార్చాలని హీరో కంపెనీ యోచిస్తోంది.
Updated Date - 2022-11-10T10:29:06+05:30 IST