మ్యూచువల్ ఫండ్స్ గురించి చక్కగా వివరించిన 7ఏళ్ల పాప.. విని ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
ABN, First Publish Date - 2022-10-27T11:47:01+05:30
పొదుపు గురించి ఓ వయసు వస్తే తప్ప అవగాహన రాదు. అలాంటిది ఏడు సంవత్సరాల పాప దీని గురించి చెబితే ఎలా ఉంటుంది??
భద్రత కలిగిన భవిష్యత్తుకు పొదుపు చాలా అవసరం. ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, మహిళలు పొదుపు గురించి ఎన్నో వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా పొదుపు చేయడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. వాటిలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. ధీర్ఘకాల పెట్టుబడులతో సాగే ఈ రకమైన పొదుపు గురించి ఓ వయసు వస్తే తప్ప అవగాహన రాదు. అలాంటిది ఏడు సంవత్సరాల పాప దీని గురించి చెబితే ఎలా ఉంటుంది?? కేవలం చెప్పడమే కాదు తను వాటిలో ఏవిధంగా పెట్టుబడి పెట్టాలని అనుకుంటోందో వివరిస్తే ఎలా ఉంటుంది??
వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ.. కానీ ఒక పాప మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎంతో చక్కగా చెప్పింది. అంతేకాదు వాటిలో తను ఏవిధంగా పెట్టుబడి పెట్టాలని అనుకుందో కూడా వివరించింది. ఆ దృశ్యాలను ఆ పాప తల్లి రికార్డు చేసి.. వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘దీపావళి పండుగ సమయంలో వచ్చిన బహుమతి డబ్బును నా కూతురు ఏం చేయాలని అనుకుంటోందంటే’ అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ వీడియోకాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ పాప తెలివికి, అంత చిన్న వయసులోనే తనకు వచ్చిన ఆలోచనను చూసి తెగ ముచ్చట పడిపోతున్నారు.
‘ఇంత చిన్న వయసు పాపకు ఇలాంటి ఆలోచన రావడం చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని కొందరు స్పందిస్తే.. ‘చిన్నతనంలో నేను మొదటిసారిగా పెట్టుబడి పెట్టడం గుర్తొచ్చింది’ అంటూ మరికొందరు ఆ వీడియోపట్ల స్పందించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఈ పాప వీడియో చూసి ఇంప్రెస్ అయ్యారు. వీడియోకు తిరిగి స్పందిస్తూ 'పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్ సరైన మార్గాలు' అంటూ ఆ వీడియోను రీట్వీట్ చేశారు. కాగా.. వీడియోలో పాప తనకు వచ్చిన దీపావళి పండుగ గిఫ్ట్ డబ్బులను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతానని చెప్పింది. అది కూడా వేరువేరు మార్గాలలో సుమారు పది సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్‌లో లాభాలు మాత్రమే కాదు నష్టాలు కూడా ఉంటాయనే విషయాన్ని ఎక్స్‌పర్ట్‌లా వివరించడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ పాప తీరు, తెలివి చూస్తే భవిష్యత్తులో ఏ ఆర్థిక వేత్తగానో మారినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది కదా!
Updated Date - 2022-10-27T11:50:46+05:30 IST