గోద్రా ఘటనకు 20 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగిందో తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి!
ABN, First Publish Date - 2022-02-27T13:45:20+05:30
అది 2002, ఫిబ్రవరి 27.. గుజరాత్‌లోని..
అది 2002, ఫిబ్రవరి 27.. గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌లో ఘోర విషాద సంఘటన చోటుచేసుకుంది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్-6 కోచ్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 59 మంది మరణించారు. ఈ ఘటన భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా మారింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్.. అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు గోద్రా స్టేషన్ నుంచి బయలుదేరుతుండగా.. ఎవరో చైన్ లాగి రైలును ఆపి, రాళ్లు రువ్వడంతోపాటు రైలు కంపార్ట్‌మెంట్‌కు నిప్పు పెట్టారు. ఈ రైలులో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న ప్రయాణీకులు ఉన్నారు. గోద్రా ఘటన తర్వాత గుజరాత్ అంతటా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో వెయ్యి మందికి పైగా మరణించారు. వారిలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు ఉన్నారు.
గోద్రా ఘటన జరిగిన మర్నాడు.. అంటే ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్‌బర్గ్ హౌసింగ్ సొసైటీ వద్ద ఒక వర్గానికి చెందినవారు 69 మందిని హతమార్చారు. మరణించిన వారిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. ఈ అల్లర్ల కారణంగా రాష్ట్రంలో పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. దానిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. గుజరాత్‌లో ఈ ఘటన జరిగినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. 2002 మార్చి నెలలో గోద్రా ఘటనపై దర్యాప్తు చేసేందుకు నానావతి-షా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కెజి షా, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జిటి నానావతి ఇందులో సభ్యులుగా ఉన్నారు. కమిషన్ తన నివేదికలోని మొదటి భాగాన్ని సెప్టెంబర్ 2008లో సమర్పించింది. ఇందులో గోద్రా ఘటన పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రగా అభివర్ణించారు. నరేంద్ర మోదీ, ఆయన మంత్రులు, సీనియర్ అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చారు. జస్టిస్ కెజి షా 2009లో కన్నుమూశారు. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అక్షయ్ మెహతా కమిషన్ సభ్యునిగా మారారు. కమిషన్ పేరును నానావతి-మెహతా కమిషన్‌గా మార్చారు. కమిషన్ తన నివేదికలోని రెండవ భాగాన్ని డిసెంబర్ 2019లో సమర్పించింది. ఇందులోనూ నివేదిక మొదటి భాగంలో పేర్కొన్న అంశాన్నే పునరుద్ఘాటించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత గోద్రా కేసులో 31 మందిని దోషులుగా నిర్ధారించారు. 2011లో సిట్ కోర్టు 11 మంది దోషులకు మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధించింది. తర్వాత అక్టోబర్ 2017లో గుజరాత్ హైకోర్టు 11 మంది దోషుల మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.
Updated Date - 2022-02-27T13:45:20+05:30 IST