సౌదీలో భారతీయుల వాట్సప్ చాటింగ్.. కోర్టు దాకా వెళ్లడంతో..!
ABN, First Publish Date - 2022-10-17T14:36:37+05:30
సౌదీకి వెళితే అక్కడ వాట్సప్‌లో ఇష్టమొచ్చినట్లు చాటింగ్ చేస్తే కష్టాలు తప్పవు! కొన్నిసార్లు కటకటాల వెనక్కీ వెళ్లే ప్రమాదం ఉంటుంది! అక్కడ కాలక్షేపానికి నలుగురు కలిసి వాట్సాప్ గ్రూప్‌లో చేసిన చాటింగ్.. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం
మతపరమైన ఉద్రిక్తత రేగేలా వ్యాఖ్యలుండటమే కారణం
5నెలల 5రోజుల కారాగారవాసం..నలుగురూభారతీయులే
(గల్ఫ్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్యాకేజి క్రింద లభించే చౌక డాటా ఉందని రెచ్చిపోకండి. భారతీయ నెంబర్లు ఉన్నాయి తమను ఎవరు కూడ పట్టించుకోరూ అనే భ్రమలో ఉండకండి. వాట్సప్‌తో సహా సామాజిక మాద్యమాల్లో ఎక్కడయినా సరే పొరపాటున లక్ష్మణ రేఖ దాటితే గల్ఫ్ దేశాల్లో అంతే సంగతులు. సరళీకృత విధానాల వలన భూతల స్వర్గంగా చెప్పబడె దుబాయిలో ఫెస్ టైంతో సహా అనేక యాప్‌ల వాడకంపై నిషేధం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
కాలక్షేపానికి నలుగురు స్నేహితులు మాట్లాడుకోన్న ముచ్చట్లు కాస్త వాట్సప్‌లో చేరి ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో సౌదీ అరేబియాలో జైలు పాలైన నలుగురు భారతీయులు తమ శిక్ష కాలం పూర్తి చేసుకున్నా జైలు నుంచి విడుదల కోసం నిరీక్షిస్తున్నారు. సౌదీ అరేబియాలోని అభాలోని ఒక సంస్ధలో పని చేసే ముగ్గురు ప్రవాసీయులు(30ఏళ్లలోపు వయసు వాళ్లు) మతపరమైన ఉద్రిక్తతను సృష్టించే కామెంట్స్ చేయగా.. మరొకరు దాన్ని రికార్డు చేసి చేశారు. అంతేకాకుండా వాట్సప్‌లో ఇతరులకు పంపడంతో అదికాస్తా సోషల్ మీడియాలోకి ఎక్కింది. దీంతో కామెంట్స్ చేసిన ముగ్గురితోపాటు రికార్డు చేసిన వ్యక్తిని సౌదీ అరేబియా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురూ తమ తప్పు ఆంగీకరించారు. న్యాయస్థానం వారికి 5 నెలల 5 రోజల జైలు శిక్షతో పాటు వేయి రియాళ్ళ జరిమాన విధించింది. ఈ నలుగురు తమ జైలు శిక్షను గత డిసెంబర్లోనె పూర్తి చేసుకున్నారు. కానీ జరిమాన చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో అప్పటి నుండి జైలులో మగ్గుతున్నారు. జరిమాన డబ్బును చెల్లించడానికి వీళ్ల బంధుమిత్రులెవరూ కూడా ముందుకు రాలేదు.
జరిమానా చెల్లించలేని స్ధితిలో జైలులో ఉండిపోయిన వాళ్ల పరిస్ధితి గురించి జైలు అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. జరిమాన డబ్బును ప్రభుత్వ ఖజాన నుంచి భరించె విధంగా ఇటీవల ఏర్పాట్లు చేయడంతో ప్రవాసీయుల విడుదలకు మార్గం సుగమమైంది. జైలు నుండి విడుదలయిన తర్వాత వీళ్లను భారతదేశ విమానం ఎక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
‘నేను ఇబ్బందుల్లో ఉన్నాను. నన్ను స్వదేశానికి పంపించడానికి సహకరించండి’ అంటూ వాట్సప్‌లో కొరిన మరో తెలుగు ప్రవాసుడు కూడా తన బాధను వాట్సప్‌లో పంచుకున్నందుకు జైలు శిక్ష అనుభవించాడు. ఫేస్బుక్లో వచ్చిన ఒక చిత్రాన్ని లైక్ చేసి ఇతరులకు పంపించినందుకు ఒకరు, ఒక ఆంశంపై మాట్లాడినందకు మరొక తెలుగు ప్రవాసీ తమ ఉద్యోగాలు పోగొట్టుకోడమేకాకుండా జైలు శిక్ష అనుభవించి మరీ దేశ బహిష్కారానికి గురయ్యారు. వాట్సప్ గ్రూప్‌లో కామెంట్ చేసినందుకు కేరళకు చెందిన ఒక వ్యక్తి తన ఉన్నత ఉద్యోగాన్ని కోల్పోవడమే కాకుండా విచారణ పూర్తయ్యే వరకు ఏడాది పాటు జైలులో గడపాడు. నిత్యం ఫెస్‌బుక్‌లో లైవ్‌లో ఉండే సౌదీలోని ఒక తెలుగు ప్రవాసీ స్వదేశంలో పోలీసు కేసు విచారణను ఎదుర్కోంటుండగా.. దుబాయి మరియు కువైత్లకు చెందిన కొందరు చేసిన వ్యాఖ్యాలపై సీబీఐ సహా పోలీసు కేసులు నమోదయ్యాయి.
భారత్‌తో సహా వివిధ నెంబర్ల నుంచి వాట్సప్ గ్రూప్‌లు నెలకొల్పి ఆ తర్వాత అందులో వచ్చిన కొన్ని కామెంట్స్ వల్ల జైలు శిక్షలు అనుభవిస్తున్న భారతీయులు కూడ కొందరు ఉన్నారు. అత్యుత్సాహంతో గ్రూపులు ఏర్పాటు చేస్తూ డిజిటల్ కమ్యూనిటీలను ఏర్పాటు చేసే వారిపై నిఘా వర్గాలు ఎప్పటికి ఒక కన్నేసి ఉంచుతాయనే విషయాన్ని మరిచిపోవద్దు. గల్ఫ్ దేశాలన్ని కూడ ఇస్లామిక్ దేశాలు కావడంతో సహజంగా ధార్మిక సంబంధిత ఆంశాలు చాల సున్నితంగా ఉంటాయనే విషయాన్ని కూడ గమనించాలి.
Updated Date - 2022-10-17T14:36:37+05:30 IST