ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tiruppavai: శ్రీరంగనికి తులసిమాల.. తిరుప్పావై

ABN, First Publish Date - 2022-12-15T22:24:47+05:30

‘ఆళ్వార్‌’ అంటే ‘మనను ఏలేవారు’ అని అర్థం. ఆచార్యులై (గురువులై) మనల్ని పరిపాలించేవారు, విష్ణుపథంలో నడిపేవారు ఆళ్వారులు. వారిలో పరమ విష్ణుభక్తులు పన్నెండుమంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి నుంచి ధనుర్మాసం

‘ఆళ్వార్‌’ అంటే ‘మనను ఏలేవారు’ అని అర్థం. ఆచార్యులై (గురువులై) మనల్ని పరిపాలించేవారు, విష్ణుపథంలో నడిపేవారు ఆళ్వారులు. వారిలో పరమ విష్ణుభక్తులు పన్నెండుమంది. ఈ ‘పన్నిద్దరాళ్వారుల’లో తండ్రీ కూతుళ్లు... పెరియాళ్వారు (పెద్ద ఆళ్వార్‌) శ్రీవిష్ణుచిత్తుడు, గోద ఉన్నారు. ఈ ఆళ్వారులలో స్త్రీమూర్తి గోదాదేవి ఒక్కరే.

ఎనిమిదేసి పాదాలు కలిగిన 30 పద్యాల (తమిళంలో పాశురాలు) మధుర భక్తి కావ్యం ద్వారా... 1200 సంవత్సరాల తరువాత కూడా చిరంజీవిగా భాసిస్తున్న మహా కవయిత్రి గోదాదేవి. తులసిమొక్కలు ఎక్కువగా ఉన్న పూలవనంలో, కలుపు తీస్తున్నప్పుడు... జనకునికి సీతలా.. విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ. ఆమె అయోనిజ. తులసీ దళాలకు తోడు ఒక పూవు దొరికిందనుకున్నాడు ఆ తండ్రి. ముద్దుగా ‘కోదై’ (తులసిమాల) అని పేరు పెట్టుకున్నాడు. తండ్రి ఆలోచనలు, మనసుతో పాటు... ఆయన మనసులో ఉన్న వటపత్రశాయి ఆమెలోనూ భాసించాడు. వైష్ణవ మతంలోని ప్రేమతత్త్వ జ్ఞానాన్ని తండ్రి ఆమెకు ఉగ్గుపాలతో నేర్పించాడు. పిలుపులలో ‘కోదై’ అనే పేరు కాస్త మారి ‘గోద’ అయింది. పదమూడేళ్ల వయసులో ‘తిరుప్పావై’ రచించిన విద్యన్మణి గోదాదేవి. అందరినీ కలుపుకొని పోయే నాయకత్వ లక్షణాన్ని... ‘తిరుప్పావై’లో ఆమె ప్రస్తావించిన వ్రతం వివరిస్తున్నది. అదే ధనుర్మాస వ్రతం, శ్రీవ్రతం.... సిరినోము.

తండ్రి నోటినుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణుకథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్య ఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చికూర్చిన పాశురాలు... ఇవన్నీ వింటూ, పూజల్లో వెంట నడుస్తూ ఎదిగింది గోదాదేవి. నారాయణుని లీలలను తండ్రి వివరిస్తుంటే విని, ‘అతడే నా భర్త’ అని ఏనాడో నిశ్చయించుకున్నది. తండ్రి పూలు కోసి, తులసీదళాలతో చేర్చి మాలలు అల్లుతూఉంటే... తనూ నేర్చుకున్నది. పూమాలల ద్వారా శ్రీ విల్లిపుత్తూరులోని మూలమూర్తి వటపత్రశాయికి ప్రేమ సందేశాలు పంపింది. విష్ణు కథల్లో... ఎన్నో అవతారాలలో ఉన్న నారాయణుడు... రంగనాథుడి రూపంలో ఆమెకు మరింత నచ్చాడు. శ్రీరంగంలోని పూలరంగడికి మనసిచ్చింది. ఆయనే తన ప్రియుడనీ, భర్త అనీ బంగారు కలలు కన్నది. పూల మాలలను తండ్రీ అల్లినా, తానే అల్లినా... ముందు తను అలంకరించుకొని... బాగుందో, లేదో అద్దంలో చూసుకొని, తృప్తిచెందిన తరువాతనే మూలమూర్తికి పూలబుట్టను పంపేది. ఆ మాలలను ఆయన మెడలో చూసి పరవశించిపోయేది.

ఒక రోజు విష్ణుచిత్తుడు తీసుకుని పోయిన పూమాలలలో అమ్మాయి శిరోజం కనిపించింది. శుద్ధిలో లోపం వచ్చిందని బాధపడి, ఆ మాలలను స్వామికి సమర్పించకుండానే ఆయన తిరిగి వచ్చాడు. శిరోజం ఎందుకు వచ్చిందో తెలుసుకొని కూతుర్ని మందలించాడు. మహాపరాధం జరిగిందని మధనపడ్డాడు.

ఆ రాత్రి విష్ణుచిత్తుడికి విష్ణువే కలలో కనిపించి... కోదై ధరించి, బాగుందనుకున్నాక ఇచ్చిన మాల అంటేనే తనకు ఎంతో ప్రియమనీ, కనుక ఆమె ధరించి విడిచిన ఆ మాలలనే తనకు రోజూ సమర్పించాలని ఆదేశించాడు.

విష్ణుచిత్తునికి తన చిత్తంలో విష్ణువు, విష్ణువు చిత్తంలో గోద ఉన్నారని అవగతమయింది. ఇక గోద తన కూతురు కాదనీ, ‘ఆండాళ్‌’ (తనను కన్న తల్లి) అనీ అర్థమైంది. అప్పటినుంచి విష్ణుచిత్తుడు ఆమెను ‘ఆండాళ్‌’ అనే పిలిచేవాడు. (మనం కూడా కన్న కూతురును ‘బంగారు తల్లి’ అనీ, ‘మా అమ్మే’ అనీ అనుకుంటాం కదా). అలాగే ఆమెకు వచ్చిన మరో పేరు ‘శూడి (చూటి)క్కొడుత్త’... (ఈ తమిళ పదానికి సమానమైన ’ఆముక్త మాల్యద‘ అనే సంస్కృత పదానికి ‘ధరించి ఇచ్చిన’ అని అర్థం). శ్రీ కృష్ణదేవరాయలు రచించిన గోదా రంగనాథుల ప్రణయైుక్య కావ్యం పేరు ‘ఆముక్తమాల్యద’. ముప్ఫై పద్యాలు పాడి సమర్పించినందుకు ‘పాడికొడుత్త నాచ్చియార్‌’ అని మరో పేరు కూడా ఆమెకు వచ్చింది.

తన కుమార్తెకు వరుడిని వెదికే బరువు పెరియాళ్వార్‌కు దిగిపోయింది. కూతురు కోరిన విధంగా విష్ణువు కూడా వరించాడు కనుక మనసు నెమ్మదించింది. ఇక గోదాదేవి నెలరోజుల పాటు దీక్ష వహించి ‘కాత్యాయనీ వ్రతం’ పాటించింది. తాను రాధ అయితే తోటి బాలికలు గోపికలు, విల్లిపుత్తూరే బృందావనం, వ్రేపల్లె... అక్కడ ప్రవహించే నదే యమునానది, వటపత్రశాయే కృష్ణయ్య, మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో ఆమె చెప్పుకొన్న భాగవత కథలు, ఉపనిషత్‌ సూత్రాలు, వేదసార వాక్యాలే... తిరుప్పావై పాశురాలు. వరిచేలు, తుళ్లిపడే చేపలు, చిలుకలు, కొంగలు, ఆవులు దూడలు, మల్లె పొదలు, తులసి వనాలు... అన్నీ బృందావనానికి ప్రతిబింబాలే. ‘తొందరగా లేవవేం తల్లీ!, లేచినా తలుపు తీయవా?, తలుపు తీసినా లోపలికి రానీయవేమిటి?’ అంటూ కొద్దిగా కోపం చూపే కలహాలు, మందలింపులు, అంతలోనే కలిసిపోయే స్నేహాలు... ఇవన్నీ ఆమె పాశురాల్లో ఆశువుగా కురిశాయి. ఒక్కో పాశురం అర్థం తెలిసి చదువుతూ ఉంటే ఆనాటి యమునా తీర విహారి రాసలీలలు చూస్తున్నట్టు తోస్తుంది. భాగవత భావగత కథాకథనాలను కళ్లకు కట్టే దృశ్యకావ్యం... తిరుప్పావై. వ్రతం పూర్తికాగానే ఫలం సిద్ధించింది. శ్రీరంగడు శ్రీరంగంలో ఆలయ పెద్దలకు కలలో కనిపించి... పల్లకిని శ్రీవిల్లిపుత్తూరుకు పంపి... గోదను, విష్ణుచిత్తులవారిని తీసుకొని రమ్మన్నాడు. గోదను వివాహం చేసుకున్నాడు. గోద.... రంగనాథునిలో లీనమైంది. గోదాదేవి కథ ఒక అద్భుతం. ఇది ఎనిమిదో శతాబ్దంలో జరిగిన దివ్య చరిత్ర.

మరో మహా కావ్యం

‘‘శ్రీరంగనాథుణ్ణి గోదాదేవి ప్రేమించిందనడానికి ప్రమాణం ఏమిటి? ఇది రసరమ్యమైన కాల్పనిక సాహిత్యం, ఆనాటి నవల’’ అనే వారూ ఉన్నారు. ‘‘కాదు కాదు... ఇది ఆమె ప్రేమ కథ.. భక్తి ప్రేమగా పరిణమించి, పరిమళించి... శ్రీరంగనితో పరిణయానికి దారితీసిన గాథ’’ అనడానికి ప్రమాణం... గోదాదేవి పదిహేనేళ్లప్రాయంలో రచించిన మరో కావ్యం ‘నాచ్చియార్‌ తిరుమొళి’ (అంటే ‘నాయకి రచించిన పవిత్రగీతాలు’ అని అర్థం). శ్రీరంగనాధుణ్ణి వలచిన గోదాదేవి... తన వలపు రంగరించి ఆయనకు పంపిన ప్రేమలేఖలు, ఆమె భావావేశ అనురాగ సందేశాలు, పెంచుకున్న ఆశలు, సడలని ఆశయాలు, అప్పుడప్పుడు అలకలు, చిన్న చిన్న కోపాలు ఇందులోని 143 పాశురాలలో వ్యక్తమవుతాయి. ‘నాచ్చియార్‌ తిరుమొళి’... గోదాత్మను పరమాత్మతో అనుసంధించే అద్భుత ప్రేమకావ్యమైతే, ‘తిరుప్పావై’... ఆమెను సశరీరంగా రంగనాథునిలో విలీనం చేసిన మహాద్భుత మోక్షమార్గం. రెండు కావ్యాలూ భక్తినీ, పరమాత్మ పట్ల సమర్పణ భావాన్నీ, శ్రీరంగనాథుని వెతుక్కొనే తాపత్రయాన్ని వివరిస్తాయి. మోక్షగాములందరికీ అనుసరణీయ మార్గాలను చూపుతాయి.

దేవులపల్లి కృష్ణశాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దాశరథి రంగాచార్యులు తదితర గొప్ప కవులు, తత్త్వవేత్తలు ఈ పాశురాలను తెలుగులోకి అనువదించారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ (చిన్న) జీయర్‌ స్వామి, శ్రీభాష్యం అప్పలాచార్యులు, దాశరథి రంగాచార్యులు, కందాడై రామానుజాచార్యులు... ఇలా మరెందరో ప్రముఖులు తమ వ్యాఖ్యానాలతో తిరుప్పావై సారాంశాన్ని వివరించారు.

-మాడభూషి శ్రీధర్‌

Updated Date - 2022-12-15T22:24:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising