ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురువులకు గురువు

ABN, First Publish Date - 2022-06-17T08:02:50+05:30

జ్ఞానం కోసం తపించే శిష్యుల విషయంలో జెన్‌ గురువులు ప్రవర్తించే తీరు వింతగా, ఆశ్చర్యం కలిగించేలా మాత్రమే కాదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్ఞానం కోసం తపించే శిష్యుల విషయంలో జెన్‌ గురువులు ప్రవర్తించే తీరు వింతగా, ఆశ్చర్యం కలిగించేలా మాత్రమే కాదు... అద్భుతమైన ఫలితాలు ఇచ్చేదిగా కూడా ఉంటుంది. వింతైన మాటలతో, అసాధారణమైన చర్యలతో జ్ఞానాన్ని ప్రసాదించే గురువుగా బ్యాసో ఎంతో ప్రఖ్యాతి చెందాడు. ఆయనను జెన్‌ సంప్రదాయంలో ‘గురువులకు గురువు’గా పేర్కొంటారు. గౌతమ బుద్ధుడి కన్నా ఎక్కువమందిని జ్ఞానులుగా మార్చిన ఘనత బ్యాసోదని చెబుతారు. అయితే ఆయన మాటలు, చర్యలు ఆయన ప్రత్యక్ష శిష్యులకు సైతం సులువుగా అర్థమయ్యేవి కావు. ఆయన ప్రవర్తన వారికి చిక్కుముడిలా కనబడి.... మొదట దిగ్భ్రమకు గురి చేసినా... చివరకు ఆనందాన్ని అందించేది.


బ్యాసోకు శుశ్రూష చేస్తున్న వందలాది శిష్యులలో శ్యూరో ఒకడు. అతను ఒక రోజు బ్యాసోను ఏదో ప్రశ్న వేశాడు. వెంటనే శ్యూరో ఛాతీ మీద బ్యాసో గట్టిగా కొట్టాడు. కిందికి తోసి పడేశాడు. అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఈలోగా శ్యూరోలో ఏదో కాంతి మెరిసింది. ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. చప్పట్లు చరుస్తూ, గట్టిగా నవ్వుతూ ‘‘అద్భుతం! అద్భుతం! అసంఖ్యాకమైన రహస్యాలు నాకు తెలిసిపోయాయి. సమాధి స్థితులు నాకు అవగతం అయ్యాయి’’ అంటూ బ్యాసోకు నమస్కరించి వెళ్ళిపోయాడు. 


ఈ సంఘటనకు ఓషో (రజనీశ్‌) వివరణనిస్తూ ‘‘ప్రశ్నించిన తన శిష్యుణ్ణి నిర్దయగా గుండెలపై తన్ని, కిందికి తోసివేసిన బ్యాసో చాలా కఠినాత్ముడని మనకు అనిపిస్తుంది. కానీ ఇది కేవలం బయటకు కనిపించే దృశ్యం మాత్రమే. మిగిలిన శిష్యులలో ఎవరినీ బ్యాసో అలా ఎన్నడూ తన్నలేదు. కేవలం శ్యూరో పట్ల మాత్రమే అలా ప్రవర్తించాడు. ఎందుకంటే... సమాధి స్థితిని అనుభవించడానికి, జ్ఞాన సిద్ధిని పొందడానికి ఆ క్షణంలో అర్హుడు శ్యూరో మాత్రమే. అతనికి గురువు ఇవ్వవలసిందల్లా ఒక్క కుదుపు. అది మాటల ద్వారా కాదు... చేతల ద్వారా ఇవ్వగలిగేది. కరుణాహృదయుడైన బ్యాసో ఆ పనే చేశాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా... ఆలోచనలకూ, వాక్కులకూ అతీతమైన సత్యం శ్యూరోకు సుస్పష్టంగా, అనుభవపూర్వతంగా అవగతమయ్యేలా చేశాడు. ఒక్క కుదుపుతో, ఒక్క దెబ్బతో, ఒకసారి వెనక్కి తోసి... కోటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగే స్థాయిని శ్యూరోకు అందించాడు. అతని గుండెలోని అంధకారాన్ని అంతం చేశాడు. అందుకే శ్యూరో తన గురువుకు కృతజ్ఞతలు ప్రకటించాడు’’ అన్నారు.


బ్యాసోలాంటి గురువులు... తమ శిష్యులకు ఇచ్చేది ప్రాణం లేని మాటలు కాదు, జీవంలేని పాండిత్యం కాదు, ఫలితం లేని ప్రయోగాలు కాదు. అర్థవంతమైన, రసమయమైన, ఆనందదాయకమైన, జ్ఞానభరితమైన అనుభూతులు, అనుభవాలు. శతకోటి ఉపన్యాసాలు, సహస్ర కోటి ప్రవచనాలు ఇవ్వలేని శుభాన్ని... అందరికీ వింతగా, వికృతంగా కనిపించే ఒక చర్య ఇవ్వగలదు. అనవసరమైన ఆలోచనలను సమూలంగా నిర్మూలించి, అఖండమైన ఆనందాన్ని ఆకస్మికంగా అందివ్వగలదు. శ్రీ రామకృష్ణ పరమహంస తన కుడిపాదాన్ని వివేకానందునిపై ఉంచి... ఒక అద్భుతమైన అనుభవాన్ని కలిగించిన ఉదంతాన్ని వారి చరిత్ర చెబుతోంది. 

రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2022-06-17T08:02:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising