Christmas : ఆ వెలుగు ఆరాధనే క్రిస్మస్
ABN, First Publish Date - 2022-12-23T01:18:36+05:30
మరియా, యోసేపులు... పుణ్యదంపతులు. మహా భక్తురాలైన ఆ కన్య మరియ.. దైవ వరాల వల్ల గర్భం దాల్చింది. జనాభా లెక్కల్లో తమ పేర్లు నమోదు చేసుకోడానికి...
మరియా, యోసేపులు... పుణ్యదంపతులు. మహా భక్తురాలైన ఆ కన్య మరియ.. దైవ వరాల వల్ల గర్భం దాల్చింది. జనాభా లెక్కల్లో తమ పేర్లు నమోదు చేసుకోడానికి... ఆ నిండు చూలాలిని వెంటబెట్టుకొని యోసేపు బెత్లెహేము చేరాడు. అది వారికి అపరిచితమైన పట్టణం. తమ ఇంటికి రమ్మని ఆహ్వానించి, ఆదరించే సంస్కారవంతులైన పౌరులెవ్వరూ వారికి కనిపించలేదు. ఆ రాత్రి వారు తల దాచుకోవడానికి ఒక్క సత్రమైనా దొరకలేదు. నిండు గర్భిణి అయిన మరియకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఎక్కడకు పోవాలో తెలియక... దగ్గరలో కనిపించిన ఒక పశువుల పాకలోకి అడుగుపెట్టారు. ఆ పశువుల మధ్యే ఒక శిశువుకు జన్మనిచ్చింది మరియ. ఆ బిడ్డే యేసు. క్రిస్మస్ అంటే క్రీస్తు జననం. ఆయన పూర్తి పేరు యేసు క్రీస్తు. ‘యేసు’ అంటే రక్షకుడు. ‘క్రీస్తు’ అంటే ఆ రక్షణ కోసం నియమితుడైనవాడు. ఆ మహత్కార్యానికి దేవుని ద్వారా అభిషిక్తుడైన వాడు. క్రిస్మస్... ఆ రక్షకుని పుట్టిన రోజు. లోకానికి దారి చూపే వెలుగు పుట్టిన రోజు. ఆ వెలుగును ఆహ్వానిద్దాం. ఆ వెలుగును ఆస్వాదిద్దాం. ఆ వెలుగును సామూహికంగా ఆరాధిద్దాం.
‘ఏసు’ అనే పదం వింటే పశాంతత, ఓదార్పు కలుగుతాయి. క్రీస్తు ఒక వెలుగు. వెలుగును ప్రేమించని వారెవరైనా ఉంటారా? ఆ వెలుగు తమతమ జీవితాల్లోకి ప్రవేశించాలనుకుంటారు. ఆ వెలుగును అభిమానిస్తారు. పశువుల కాపరులకు... తోక చుక్క రూపంలో కనిపించి, కొండంత ధైర్యం ఇచ్చినది ఆ వెలుగే. వారూ, వారు కాచే మూగజీవులూ, బెత్లెహేము పురజనులూ, చుట్టుపక్కల పల్లీయులూ వింతగా చూడవచ్చిందీ, మెచ్చిందీ ఆ వెలుగునే. జోస్యం చెప్పే మహాజ్ఞానులూ, మహాపండితులూ, రాజులూ వచ్చి ఆరాధించినది ఆ వెలుగునే. ఆ వెలుగును విశ్వాసులందరూ గుమికూడి, ఆరాధించి, ఆత్మీయంగా ఆనందించడమే... క్రిస్మస్ .
మానవలోకంలోని చీకటి బ్రతుకులకు మార్గం చూపాలని, వెలుతురు కిరణాలు పంచాలని, కలుషితుడైన మనిషిని సమున్నత స్థితిలోకి మార్చి, తనలా తీర్చిదిద్దాలని... భూగోళంపై అడుగు మోపిన మహనీయుడు యేసు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడేవారికి కాంతిరేఖలా ఆయన వచ్చాడు. ఆయన దైవ పుత్రుడు అయినప్పటికీ... సాదా సీదా మానవ మాత్రునిగా పుట్టడంలోనే ఒక మహత్తర సందేశం దాగి ఉంది. ‘‘నేనే వెలుగు’’ అని కచ్చితంగా ఆయన ప్రకటించాడు. మానవులెవరూ చీకటిలో బతకాలని కోరుకోరు కదా! యేసును ఆశ్రయిస్తే... ఆయన వెలుగు వారి చేయిపట్టి వెలుగు బాటలోకి నడిపిస్తుంది. జీవితపు ఒత్తిళ్ళలో నలిగిపోతున్న వారికి, బతుకు ఆటుపోట్లలో దహించుకుపోతున్నవారికి అవసరమైన ధైర్యాన్నీ, ఓదార్పునూ ఇస్తుంది. ఆయన ‘‘మీకోసం నేనున్నాను. మిమ్మల్ని ఉద్ధరించడానికే నా ప్రాణం ఉంది’’ అనగలిగిన ప్రేమపూరితమైన సుస్వరాల వెలుగు. మూఢాచారాలు, అనాచారాలు, దురాచారాలతో... కరడుగట్టిన రాక్షసత్వాన్ని నింపుతున్న అమానుష భావాలను ఖండించిన చైతన్యపూరితమైన వెలుగు. మనసుల్లో అలముకున్న పెను చీకట్లను తరిమేసి, హృదయాలను జ్యోతిర్మయం చేయడం కోసం... మనల్ని వెతుక్కుంటూ వచ్చిన వెలుగు. ఆయన చల్లటి ఆశ్రమం. దయ నిండిన మందిరం.
మరి... ఆ ప్రభువు అందించిన ప్రేమ సూత్రాన్ని మనం గ్రహించామా? క్రీస్తు ప్రేమను పదిమందికీ పంచగలిగామా? ఈ ప్రశ్నలు మనని మనం వేసుకున్నప్పుడే... క్రిస్మస్ పండుగకు ఒక అర్థం, పరమార్థం ఉంటాయి. లేకపోతే ఇది మరో దండగ రోజుగానే ముగిసిపోతుంది. ఎంతగానో మనం ఎదురుచూస్తున్న క్రిస్మస్ కాంతులు కళ్ళెదుటే కరిగిపోతాయి.
డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు, 9866755024
Updated Date - 2022-12-23T01:18:37+05:30 IST