మాసానాం మార్గశీర్షోహం
ABN, First Publish Date - 2022-11-24T22:42:53+05:30
మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి కలిగిన మాసం... మార్గశిర మాసం. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో వచ్చే ఆరు ఋతువులలో... హేమంత ఋతువులో వచ్చే తొలిమాసం ఇది.
మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి కలిగిన మాసం... మార్గశిర మాసం. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో వచ్చే ఆరు ఋతువులలో... హేమంత ఋతువులో వచ్చే తొలిమాసం ఇది. ఈ మాసం విష్ణువుకు ప్రీతికరం. అందుకే ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు. ఆ మాసం సాక్షాత్తూ తన స్వరూపమని చెప్పుకొన్నాడు. వాస్తవానికి ఈ మాసం మహాలక్ష్మికి, శివునికి కూడా అత్యంత ప్రీతికరమైనది. మార్గశిర మాసంలో చేసే ఏ పవిత్ర కార్యమైనా... దాని ప్రతిఫలం అపారమని శాస్త్రవచనం.
పరమేశ్వరుని గురించిన జ్ఞానాన్ని పొందినవారే మోక్షానికి అర్హులవుతారు. ఆ జ్ఞాన మార్గాన్ని తెలిపేది మార్గశిర మాసం. చాంద్రమానం చైత్ర మాసంతో ప్రారంభమవుతుంది. కానీ వేదవేత్తలకు, యజ్ఞయాగాదులు చేసేవారికి మార్గశిరంతో మొదలవుతుంది. భగవంతుడు అహితాగ్నులను స్వీకరించేది ఈ మాసంలోనే. ఈ నెలలో ప్రతి తిథికీ ప్రాధాన్యం ఉంది.
సుబ్రహ్మణ్య షష్టి: మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగ పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఆ మరుసటి రోజు సుబ్రహ్మణ్య షష్టి. ఇది సుబ్రహ్మణ్యారాధనకు విశిష్టమైన రోజు. తెలుగు నాట సుబ్రహ్మణ్య ఆలయాలలోనే కాకుండా... తమిళనాడులో ఆరు ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆ మరుసటి రోజైన భానుసప్తమినాడు సూర్యుణ్ణి ఆరాధిస్తారు. భైరవుణ్ణి పూజించే తిథి అష్టమి. మృత్యుభయం తొలగించడానికి భైరవుణ్ణి కొలిచే ఆ దినాన్ని ‘కాలభైరవాష్టమి’ అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి... గీతా జయంతి. శ్రీకృష్ణుణ్ణీ, భగవద్గీతను పూజించి, గీతాపారాయణం చేస్తారు. శుద్ధ త్రయోదశి నాడు ఆచరించే హనుమద్వ్రతం సకల శుభాలనూ చేకూరుస్తుందని విశ్వాసం. మార్గశిర పౌర్ణమి దత్త జయంతి. ఇలా ఎన్నో ప్రత్యేకమైన దినాలున్న మాసం ఇది.
లక్ష్మీవార వ్రతం: మార్గశిర మాసంలో లక్ష్మీవార వ్రతాచరణ అనాదిగా వస్తోంది. శ్రీమహాలక్ష్మికి ప్రియమైన ఆ వారాల్లో... భక్తి ప్రపత్తులతో, షోడశోపచారాలతో ఆ తల్లిని మహిళలు పూజిస్తారు. ఈ వ్రతాన్ని ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఆచరింపజేశాడనే పురాణ కథ ఉంది. ఈ వ్రతం వల్ల సిరి సంపదలు, సౌభాగ్యం, సంతాన భాగ్యం చేకూరుతాయని పెద్దలు చెబుతాకు.
శ్రీ కనక మహాలక్ష్మి
ఉత్సవాలు: విశాఖపట్నంలో వెలసిన శ్రీ కనక మహాలక్ష్మి ఉత్తరాంధ్రుల ఇలవేలుపు. ఏటా నిర్వహించే మార్గశిర మాసోత్సవాల్లో.. భక్తులు తమ స్వహస్తాలతో ఆమెను అభిషేకించుకుంటారు. పాలతో, పసుపు కుంకుమలతో అర్చిస్తారు. ఈ మార్గశిర మాసంలోనే... సౌర మానం ప్రకారం ధనుర్మాసం కూడా ఆరంభమవుతోంది.
ఆయపిళ్ళ రాజపాప
Updated Date - 2022-11-24T22:42:55+05:30 IST