చేనేతను మెచ్చిన అమెరికా అమ్మాయి
ABN, First Publish Date - 2022-12-07T22:51:33+05:30
చేనేత వస్త్రాల పట్ల ఆసక్తితో తొమ్మిది నెలలుగా దేశవిదేశాలు పర్యటిస్తున్న కైరా జాప్ అనే అమెరికన్ రీసెర్చ్ స్కాలర్, తాజాగా తెలంగాణా చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేస్తూ హైదరాబాద్ సందర్శించింది.
చేనేత వస్త్రాల పట్ల ఆసక్తితో తొమ్మిది నెలలుగా దేశవిదేశాలు పర్యటిస్తున్న కైరా జాప్ అనే అమెరికన్ రీసెర్చ్ స్కాలర్, తాజాగా తెలంగాణా చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేస్తూ హైదరాబాద్ సందర్శించింది.
ఆవిడ నవ్యతో పంచుకున్న కబుర్లివి!
‘‘చేనేత పరిశోధనలో భాగంగా నేను ఏడాది పాటు దేశవిదేశాలను పర్యటిస్తూ ఉన్నాను. చారిత్రక అద్దకం రంగులు, చారిత్రక వస్త్రధారణల గురించి రెండు రీసెర్చ్ పత్రాలు కూడా రాశాను. దుస్తుల చరిత్ర, ఫ్యాబ్రిక్ చరిత్ర... ఈ రెండూ విడదీయలేనివి. వీటి నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని నాకనిపించింది. నేను 12 నుంచి 13 రకాల విభిన్న చేనేత రంగాలను పరిశీలించాను. బ్యాక్‌స్ట్రాప్ లూమ్ మొదలు జకార్డ్ లూమ్ వరకూ ఎన్నో రకాల మగ్గాలను కూడా చూశాను.
తెలంగాణ చేనేత భేష్
ఇప్పటివరకూ నేను భారతదేశంలో హైదరాబాద్‌తో పాటు, నేపాల్, కర్నాటక రాష్ట్రాల్లోని చేనేత రంగాలను పరిశీలించాను. బెంగుళూరులో చేనేత కళాకారుల కొరత ఉంది. అక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పని చేస్తున్న వ్యక్తులను కలిశాను. వాళ్ల ద్వారా కర్నాటక రాష్ట్రంలో హ్యాండ్‌లూమ్స్ పూర్తిగా అంతరించి, వాటి స్థానాన్ని పవర్‌లూమ్స్ ఆక్రమించిన విషయాన్ని అర్థం చేసుకున్నాను. కొవిడ్‌కు ముందు ఎన్నో చేనేత పరిశ్రమలున్నప్పటికీ, కొవిడ్ తదనంతరం అవన్నీ అంతరించిపోయాయి. కానీ తెలంగాణా రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడ చేనేతకు ప్రభుత్వ ఆదరణ, చేయూత ఉంది. మరీ ముఖ్యంగా సంప్రదాయ డిజైన్లకు ఇక్కడ ఆదరణ ఎక్కువ. అయితే ప్రపంచవ్యాప్త చేనేత కళాకారులకు తెలంగాణాలో దక్కినంత ఆదరణ మరెక్కడా దక్కడం లేదు. వివిధ దేశాల్లో చేనేతకు ఆదరణ తగ్గడంతో పాటు, క్రమేపీ ఆ కళ అంరించిపోయే దశకు చేరుకుంది.
ఆన్‌లైన్ సౌలభ్యం ఉంటే...
తెలంగాణా నేను పర్యటించిన మిగతా ప్రాంతాల్లో చేనేత పరిశ్రమలు మూతపడి ఉండడాన్ని నేను గమనించాను. ఇందుకు కొంతవరకూ కొవిడ్ కారణమైతే, పవర్‌లూమ్ కంపెనీల సంఖ్య పెరగడం మరొక ప్రధాన కారణం. పవర్‌లూమ్ కంపెనీలు ఆన్‌లైన్‌లో వాటి కార్యకలాపాలను చురుగ్గా కొనసాగించుకోగలుగుతున్నాయి. కానీ చేనేతకు ఆ సౌలభ్యం దక్కడం లేదు. పైగా చిన్న స్థాయి కళాకారులకూ, వారి వృత్తికీ ఆధరణ లభించక ఏకంగా అంతర్థానమైపోయిన పరిస్థితి. నేను వియత్నాంలోని వోయాన్‌కు వెళ్లాను. అది చేనేతకు పుట్టినిల్లు. అయినప్పటికీ అక్కడ మిగిలి ఉన్న ఒకే ఒక మగ్గం కూడా ఒక కాఫీ షాపులో వేలాడుతూ కనిపించింది. ఇది విచారకరమైన విషయం.
విరామాలు అవసరం
నేను సిరిసిల్లలో చేనేత పరిశ్రమను చూసి ఎంతో ఆనందానికి లోనయ్యాను. అయితే ప్లాస్కిక్, పాలియస్టర్‌లకు బదులుగా సహజసిద్ధ రంగులను ఉపయోగించగలిగితే, చేనేత రంగం మరింత స్వయంసమృద్ధిని సాధించగలుగుతుంది. ప్రస్తుతం సిరిసిల్లలోని చేనేత కళాకారులు రోజుకు 12 గంటల పాటు పని చేస్తున్నారు. విరామం లేకుండా ఏకధాటిగా అన్ని గంటల పాటు కష్టపడకుండా, మధ్యలో విరామాలు తీసుకునే సౌలభ్యం వారికి కల్పించాలి.’’
పట్టు చీరలంటే ఇష్టం
నాకు పట్టు చీరలంటే చాలా ఇష్టం. కలనేత పట్టు చీరలు నా మనసును దోచేశాయి. అలాగే చారిత్రక డిజైన్లతో కూడిన గొల్లభామ చీరలు కూడా నాకు బాగా నచ్చాయి. ప్రపంచీకరణ చేనేత రంగాన్ని ప్రభావితం చేస్తోంది. మరీ ముఖ్యంగా భారతీయ చేనేత రంగం ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మకమైన ప్రభావాన్ని చూపించగలిగే చేవను కలిగి ఉంది. అయితే అది సాధ్యపడాలంటే చేనేత కళకు ఆన్‌లైన్ సౌలభ్యాన్ని కల్పించాలి. చేనేత వస్త్రాల పట్ల అవగాహన పెంచగలిగితే కచ్చితంగా ఈ కళ, ప్రపంచవ్యాప్త ఆదరణ దక్కించుకోగలుగుతుంది.
గోగుమళ్ల కవిత
Updated Date - 2022-12-07T22:54:25+05:30 IST