ఒంటరితనం అలవాటైపోయింది
ABN, First Publish Date - 2022-02-14T06:26:24+05:30
విలన్‌గా దక్షిణాదిని దున్నేస్తున్నారు. ఒంటరి తండ్రిగా కూతురికి అన్నీ తానే అయ్యారు. వృత్తిగతంలో ప్రతినాయకుడే అయినా... వ్యక్తిగతంలో నిజమైన హీరో ఆయన. ఆరడుగుల రూపం... కంగుమనే కంఠం...
విలన్‌గా దక్షిణాదిని దున్నేస్తున్నారు.
ఒంటరి తండ్రిగా కూతురికి అన్నీ తానే అయ్యారు.
వృత్తిగతంలో ప్రతినాయకుడే అయినా... వ్యక్తిగతంలో నిజమైన హీరో ఆయన.
ఆరడుగుల రూపం... కంగుమనే కంఠం... ప్రముఖ నటుడు సంపత్ రాజ్...
‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ
ఎదుట తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆ సంభాషణలు ఇవి...
ఆర్కే: ఎలా ఉన్నారు? చాలా బిజీగా ఉన్నారా?
సంపత్: చాలా బిజీ కాదు సర్... బిజీగా ఉన్నా!
ఆర్కే: దక్షిణాది భాషలన్నిట్లో దున్నేస్తున్నారుగా!
సంపత్: థ్యాంక్ గాడ్ (నవ్వు)!
ఆర్కే: హిందీలోకి వెళ్లడంలేదా?
సంపత్: తప్పకుండా వెళతా సర్. స్ర్కిప్ట్ వింటూనే ఉంటాను. వారానికి రెండు ఫోన్లు వస్తుంటాయి. కానీ ఒక బలమైన పాత్రతో వెళ్లాలనేది నా కోరిక.
ఆర్కే: ఈ రోజుల్లో హీరోల కంటే విలన్ పాత్రలు వేసేవాళ్లే చాలా గ్లామరస్‌గా ఉంటున్నారు!
సంపత్: థ్యాంక్యూ. అలాంటి కామెంట్స్ వచ్చాయి. కానీ అన్ని చోట్లా అలా లేదు.
ఆర్కే: తెలుగులో తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అయ్యారు. ఈ రంగంలోకి ఎలా వచ్చారు?
సంపత్: మా కుటుంబంలో సినిమాకు సంబంధించి ఎవరూ లేరు. నాకెందుకో చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి. నాకు 32 సంవత్సరాలప్పుడు ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. నేను ఎప్పుడు రావాలని కోరుకున్నానో అప్పుడు రాలేకపోయాను. నేను వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పుడు మా అమ్మ ‘నువ్వు సినిమాలు చేయాలనుకొంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపో’ అని చెప్పింది. దాంతో ప్రయత్నాలు మానుకున్నా. తరువాత నాకు సినిమా అవకాశం వచ్చినప్పుడు... అడ్వర్‌టైజింగ్ బిజినెస్ పెట్టుకుని విజయవంతంగా నడిపిస్తున్నా. అదే సమయంలో నా విడాకుల కేసు కోర్టులో ఉంది. నా కూతురు శ్రుతి కస్టడీ నేను తీసుకోవాలని నిర్ణయించుకున్నా. అనూహ్యంగా అప్పుడు నాకు సినిమా అవకాశం వచ్చింది. ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నా. మా బ్రదర్, సిస్టర్స్ కూడా ‘నువ్వు వెళ్లు... మీ అమ్మాయిని మేం చూసుకొంటాం’ అని ధైర్యం ఇచ్చారు. మా పార్ట్‌నర్‌కి చెప్పాను... ‘రెండేళ్లు ప్రయత్నిస్తాన’ని. ఆ తరువాత నాకు ఒక స్పష్టత వచ్చింది... ‘ఇక నేను పూర్తిగా సినిమాల వైపు వెళ్లవచ్చ’ని!
కానీ మరో సమస్య వచ్చిపడింది. మా సిస్టర్, బ్రదర్ లండన్ వెళ్లి స్థిరపడాలనుకొంటున్నారు. మా అమ్మాయి వల్ల వాళ్లు దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ‘శ్రుతిని నేను చూసుకొంటాను’ అని చెప్పడంతో వాళ్లు లండన్ వెళ్లిపోయారు. కానీ షూటింగ్‌ల వల్ల నాకు మా అమ్మాయిని చూసుకోవడం కుదరదు. అందుకని తనను బోర్డింగ్ స్కూల్‌లో పెట్టాలనుకున్నాను. అప్పుడు తను మూడో తరగతి చదువుతోంది. ఒక రోజు శ్రుతితో... ‘మీ నాన్నకు చిన్నప్పటి నుంచి నటుడు కావాలనే కోరిక. నువ్వు నాకు ఒక ఐదేళ్లు ఇస్తే నేను యాక్టర్‌ని అవుతా. అయితే ఆ ఐదేళ్లూ నిన్ను ఒక స్కూల్లో పెడతాను’ అని చెప్పాను. తనకు ఏం అర్థమైందో తెలియదు. వెంటనే ‘ఎక్కడుంది స్కూల్’ అని అడిగింది. చెన్నైలో అంటే... ‘నేను అక్కడికి రాను. బెంగళూరులోనే చదువుకొంటా’ అంది. అలా రెండు స్కూల్స్‌కు తీసుకువెళితే అందులో ఒకటి తనకు నచ్చింది. తరువాత నేను చెన్నైకి షిఫ్ట్ అయ్యాను.
ఆర్కే: ఆ ఐదేళ్ల తరువాత నుంచి మీరు కలిసే ఉన్నారా?
సంపత్: శ్రుతి పన్నెండో తరగతి అవ్వగానే మేం తిరిగి బెంగళూరులో మా ఇంటికి వెళ్లిపోయాం. ఎందుకంటే తను అక్కడి క్రైస్ట్ కాలేజీలో సైకాలజీ చదవాలనుకుంది. అనుకున్నట్టుగానే డిగ్రీ పూర్తి చేసింది. ఇప్పుడు తను ఆస్ట్రేలియాలో సోషల్ వర్క్‌లో పీజీ చదువుతోంది. వృద్ధులకు సేవ చేయాలనేది తన కోరిక. అందుకే ఆ సబ్జెక్ట్ ఎంచుకుంది.
ఆర్కే: మిమ్మల్ని, మీ పేరును చూసినవాళ్లు మన తెలుగువాడు కాదేమో అనుకొంటారు!
సంపత్: నా అసలు పేరు సంపత్ కుమార్. అయితే నా స్నేహితుడొకరు నా ఈమెయిల్ క్రియేట్ చేస్తుంటే ‘సంపత్ కుమార్’ పేరు మీద ఐడీ దొరకలేదు. దీంతో అతను ‘సంపత్ రాజ్’ అని వెతికితే... ఆ ఐడీ అందుబాటులో ఉంది. అలా నా పేరు సంపత్ రాజ్ అయింది. ఇక మా నాన్నది నెల్లూరు. ఆయన ముప్ఫై ఏళ్లు ఆర్మీలో చేశారు. మా అమ్మది తమిళనాడులోని తిరుచనాపల్లి. చివరకు మా కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. మేం మొత్తం ఏడుగురు సంతానం. నాన్న సరదాగా ఉంటే అమ్మ ఆర్మీలా స్ర్టిక్ట్.
ఆర్కే: మీ ఇంట్లో అన్ని మతాలూ ఉన్నట్టున్నాయి!
సంపత్: మా పెద్దన్న ముస్లింని పెళ్లాడి, ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. లండన్‌లో ఉన్న ఇంకో బ్రదర్ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నారు. ముంబయిలోని ఓ సిస్టర్ మరాఠీ అతన్ని పెళ్లి చేసుకుంది. మా అమ్మా నాన్న ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. వాళ్ల దృష్టిలో రెండే మతాలు... ఆడ- మగ... అంతే!
ఆర్కే: మీరు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నట్టున్నారు!
సంపత్: అవును సర్. 24 ఏళ్లప్పుడు చేసుకున్నా. నా మాజీ భార్య మా బ్రదర్ ఆఫీస్‌లో పనిచేసేది. ప్రపోజల్ అలా వచ్చింది. తనకు అప్పుడు 19 సంవత్సరాలు. చదువుకొనే వయసు. అధ్యయనాలు కూడా చెప్పాయి కదా... ప్రతి పదేళ్లకు మనిషి మైండ్‌సెట్ మారుతూ ఉంటుందని! సో... అలా నాకు 30 ఏళ్లు వచ్చేసరికి ప్రాధామ్యాలు, అవసరాలు అన్నీ మారిపోయాయి. విడిపోకూడదని అనుకున్నాం. అయితే ఒక స్థాయికి వెళ్లేసరికి విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాం. తను కెరీర్‌పై దృష్టి పెట్టింది కనుక మా అమ్మాయి బాధ్యత నేను తీసుకొంటానని చెప్పాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇప్పుడు కూడా నా కూతురు రోజూ వాళ్లమ్మతో మాట్లాడుతుంటుంది. వాళ్లింటికి వెళుతుంటుంది. మా అమ్మాయితో నేను మంచి స్నేహితుడిలా ఉంటాను. ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు తనకు చెబుతాను.
ఆర్కే: మీరు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకోలేదు?
సంపత్: వేరే ఆలోచన లేకుండా సమయం అలా పరిగెడుతోంది. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చేయాలనుకున్నాను. నా ఇరవైల్లో ఆ అవకాశం రాలేదు. కానీ విడాకులు తీసుకున్నప్పుడు వచ్చింది. అంటే నా జీవితంలో ఎప్పుడు ఎలా జరగాలనుంటే అదే జరుగుతోంది. ఎందుకలా జరుగుతోందని నేను ప్రశ్నించుకోలేదు. ఇప్పుడు తిరిగి చూసుకొంటే ఈ రంగంలోకి వచ్చి అప్పుడే ఇరవయ్యేళ్లయిపోయింది! నా ప్రైమ్ ఏజ్‌లో ఒంటరిగానే ఉన్నాను. ఆ ఒంటరితనం నాకు అలవాటైపోయింది. ఈ స్పేస్‌ను ఇంకొకరితో షేర్ చేసుకోవాలంటే... అది ఎలా ఉంటుందో తెలియదు నాకు. సో... మళ్లీ పెళ్లి చేసుకొంటే బాగుంటుందా? బాగుండదా? అని నాలో భయం (నవ్వు). ప్రస్తుతానికి హాయిగా ఉన్నాను కదా! అది చాలు! మా అమ్మాయి చెబుతుంటుంది... ‘నాన్నా... ట్రై చేయండి’ అని. ‘దానంతట అదే వస్తే చూద్దాం’ అంటాను.
ఆర్కే: మీ మాజీ భార్యను కలుస్తుంటారా?
సంపత్: మేం కలుస్తూనే ఉంటాం. మంచి స్నేహితుల్లా మాట్లాడుకొంటాం. తను వేరే పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. మా అమ్మాయి అక్కడికి వెళుతుంది. వాళ్లతో ఉంటుంది. నా కూతురికి నేను చెప్పిందేమంటే... ‘నేను పెళ్లి చేసుకోలేదు. అది నా నిర్ణయం. మీ అమ్మ పెళ్లి చేసుకుంది. తనకు ఆ హక్కు ఉంది. దాన్ని నువ్వు ప్రశ్నించకూడదు. తన కొడుకు, కూతురు నీకు తమ్ముడు, చెల్లి. అలానే వారితో ఉండు’ అని! శ్రుతి కూడా వాళ్లతో బాగా కలిసిపోతుంది.
ఆర్కే: మీరు సినీ పరిశ్రమలో ఉన్నారు. చూడ్డానికి బాగుంటారు. మరి ఎవరూ దగ్గరవ్వలేదా?
సంపత్: చాలామంది అడుగుతుంటారు... ‘మీరు డైవర్సీ అని తెలిసింది. మనం ఎక్కడైనా కలుద్దామా’ అని. కానీ నేను అలాంటివి ప్రోత్సహించలేదు. ఎందుకంటే నా దృష్టంతా నా కూతురుపైనే. ఒకవేళ నేను అలా వెళ్లిపోతే నా కూతుర్ని పెంచి పెద్దచేయాలని నేను తీసుకున్న నిర్ణయానికి అర్థం ఉండదు. ఇండస్ర్టీ బయట నుంచి కూడా ప్రపోజల్స్ వచ్చాయి. నేను పట్టించుకోలేదు. నాకు 45 ఏళ్లప్పుడు ఒక రిలేషన్‌షిప్ ట్రై చేశాం. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ విషయం నా కూతురుకు కూడా తెలుసు.
ఆర్కే: మీకు మొదటి అవకాశం ఇచ్చింది ఎవరు?
సంపత్: కన్నడలో చేశాను తొలి సినిమా. కవితా లంకేశ్ దర్శకత్వంలో. ఆమె తన తరువాతి చిత్రంలో ‘తండ్రి పాత్ర చేస్తావా’ అని అడిగారు. ఓకే అన్నాను. ‘ఏంటి ఒప్పేసుకొంటున్నావ్? ఈ వయసులో తండ్రి కేరెక్టర్లు చేస్తావా’ అన్నారు. ‘నేను నటుడిని కావాలని వచ్చాను. మంచి పాత్రయితే ఏదైనా చేస్తాను’ అన్నాను. నేను ఇప్పటికీ అదే పంథాలో వెళుతున్నాను. కథ వినేటప్పుడే నా రోల్‌ని తెరపై ఊహించుకొంటాను. నచ్చితేనే ఒప్పుకొంటాను. రెండో సినిమా తరువాత చెన్నై వెళ్లాను. విజయ్‌కాంత్ సినిమా. సముద్ర ఖని డైరెక్షన్. అలా ఒకదాని తరువాత ఒకటి అవకాశాలు వచ్చాయి.
ఆర్కే: మీ అమ్మకు సినీ పరిశ్రమ అంటే సదభిప్రాయం లేదు. మరి మిమ్మల్ని అటువైపు ఎలా వెళ్లనిచ్చారు?
సంపత్: అప్పటికే విడాకులు తీసుకున్నా. దాని తరువాత ఇంకేముంటుంది! మా అమ్మ కూడా షూటింగ్ స్పాట్‌కు వచ్చేవారు. అక్కడ అందరితో కలిసిపోయేవారు. ఆవిడకు ఎనిమిది భాషలు వచ్చు. 2011లో అమ్మ చనిపోయింది. దానికి ముందు అమ్మకు ఒంట్లో బాలేదు. మా అన్నయ్య వచ్చి తీసుకువెళ్లాడు. వెళ్లేటప్పుడు మా ఇంట్లో పనివాళ్లతో... ‘నేను వెళుతున్నాను. నాకు తెలిసి మళ్లీ రాను. నా టైమ్ అయిపోతోంది. వీడిని బాగా చూసుకోండి’ అని చెప్పిందట. నా దగ్గర నుంచి వెళ్లిన నెలకు అమ్మ ఈ లోకం వదిలి వెళ్లిపోయింది. అంతకముందు, 2003లో నా మొదటి సినిమా పూర్తయ్యే నాటికి మా నాన్నగారు చనిపోయారు.
ఆర్కే: మీరు తొలి రోజుల్లో ‘గే’ కేరెక్టర్ కూడా చేశారట కదా!
సంపత్: అవును. ‘గోవా’ అనే సినిమాలో చేశాను. నటుడిగా ఒక మంచి అవకాశంగా దాన్ని భావించి ఒప్పుకున్నాను. దానికి ముందు నాకు ‘సరోజ’ అనే చిత్రం పెద్ద హిట్ అయింది. అందులో విలన్‌కు ప్రేమ, పాట అన్నీ ఉంటాయి. ఆ పాట చాలా హిట్.
ఆర్కే: మీరు మంచి డ్యాన్సర్‌ట కదా!
సంపత్: బాత్‌రూమ్ సింగర్స్ ఉంటారు కదా... అలా నేను బాత్‌రూమ్ డ్యాన్సర్‌ని.
ఆర్కే: హీరో అవుదామనే ఆలోచన ఎప్పుడూ రాలేదా?
సంపత్: లేదు సర్. అటువైపు నా ఆలోచనే వెళ్లలేదు. నాకు చాలా స్పష్టత ఉంది. మంచి కేరెక్టర్ యాక్టర్ అవ్వాలి. ఎవరైనా వచ్చి ఒక తొంభై సంవత్సరాల వృద్ధుడి పాత్ర ఉందంటే నేను వెంటనే ఒప్పేసుకొంటా. ఎందుకంటే నేను తొంభై ఏళ్లు బతుకుతానో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఆ కేరెక్టర్‌లో నన్ను నేను చూసుకోవచ్చు కదా!
ఆర్కే: మీలో రైటర్ కూడా ఉన్నాడు కదా! ఆ రైటర్ ఎప్పుడు బయటకు వస్తాడు?
సంపత్: ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాకు స్ర్కిప్ట్ రాస్తున్నా. అలాగే ఒక వెబ్ సిరీస్‌కు రాశాను. ఇంకొకటి విభిన్నమైన స్ర్కిప్ట్.. ఈ మూడింటిలో ఎందులోనూ ఫైట్స్ ఉండవు.
ఆర్కే: భవిష్యత్తులో సంపత్‌ని దర్శకుడిగా కూడా చూడవచ్చా?
సంపత్: ఇప్పటికైతే లేదు. కానీ భవిష్యత్తులో తప్పకుండా చేస్తా.
ఆర్కే: మీరు ఇప్పటివరకు ఎవరితోనూ పంచుకోని విషయాలేవైనా ఉన్నాయా?
సంపత్: ఒంటరిగా ఉండిపోవద్దని నా కూతురు చెప్పింది. నా మదిలో ఆ ఆలోచన మెదులుతుంటుంది. మా నాన్న నుంచి నేను నేర్చుకున్నదేంటంటే... అప్పులు లేకుండా ఉన్నదాంట్లోనే సంతోషంగా జీవించడం. సంపాదనతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ఆ దారిలోనే నడుస్తున్నాను.
ఆర్కే: మీ బలం ఏమిటి?
సంపత్: సంకల్ప బలం. నా పనిమీద, నా వ్యక్తిగత జీవితం మీద ఉన్న అంకితభావం. మీరు చూస్తే... నా వృత్తిగత జీవితానికి... వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉండదు. దేని దారి దానిదే. నాకు ఆ స్పష్టత ఉంది. పరిశ్రమలో స్నేహితులు లేరు. నైట్ పార్టీలపై ఆసక్తి లేదు.
ఆర్కే: మీ బలహీనతలేంటి?
సంపత్: మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తా. లౌక్యంగా మాట్లాడడం రాదు. మా అమ్మాయి కూడా అంటుంటుంది... ‘నువ్వు నువ్వుగానే ఉండు’ అని.
తెలుగులో నేనంటే అందరికీ తెలిసింది ‘మిర్చి’ సినిమాతో. తరువాత ‘శ్రీమంతుడు, రన్ రాజా రన్’... ఇలా ఒకదాని తరువాత ఒకటి వచ్చాయి. తమిళ్‌లో ‘గోవా, సరోజ’ వంటి చిత్రాలు. మళయాలంలో మోహన్‌లాల్‌తో ‘సాగర్ అలియాస్ జాకీ’ చేశాను. 2008లో. నేను అక్కడ ఎక్కువ సినిమాల్లో నటిచంలేదు. ఎందుకంటే ఆ భాష నాకు రాదు. ఒక సినిమా డబ్బింగ్ కోసం మూడు రోజులు ప్రయత్నించి వదిలేశా.
నాకు బాగా నచ్చే నటుడు అమితాబ్ బచ్చన్. ఆయన ఏది చేసినా బాగుంటుంది. సత్యరాజ్ గారు చెబుతారు... ‘అమితాబ్ ఫైట్ చేస్తే నిజంగా కొడుతున్నట్టే ఉంటుంద’ని! అంతే అద్భుతంగా కామెడీ కూడా పండిస్తారు. కానీ ఆయనలా నటించాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. నా శైలి నాదే. అలాగే రఘువరన్ గారు... ఆయనకో ప్రత్యేకత ఉంటుంది. ‘విలన్ కూడా అందంగా, స్టయిలిష్‌గా ఉండచ్చు’ అని నిరూపించారు ఆయన. విలనిజమ్‌లో ఒక కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు.
Updated Date - 2022-02-14T06:26:24+05:30 IST