ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Udayanidhi: ఉదయనిధి అనే నేను...

ABN, First Publish Date - 2022-12-15T09:08:14+05:30

డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, చేపాక్‌-ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడు ఉదయనిధి(Udayanidhi) మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌

- తండ్రి ఆశీస్సులు అందుకున్న తనయుడు

- ఇక సినిమాలకు గుడ్‌ బై

- నా పనితీరుతోనే విమర్శలకు సమాధానం

చెన్నై, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, చేపాక్‌-ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడు ఉదయనిధి(Udayanidhi) మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌ దర్బార్‌హాలులో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రివర్గ సహచరులు, డీఎంకే(DMK) మిత్రపక్షాలకు చెందిన నాయకులు, శాసనసభ్యులు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఉదయనిధి చేత ప్రమాణం చేయించారు. ఉదయనిధి తమిళంలో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత గవర్నర్‌ కార్యదర్శి అందించిన పత్రాలపై సంతకం చేశారు. ఆ తర్వాత గవర్నర్‌ రవికి, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆయన పుష్పగుచ్ఛాలందించి ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత గవర్నర్‌, ముఖ్యమంత్రి వేర్వేరుగా ఉదయనిధికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయనిధి వేదికపై తండ్రికి పాదాభివందనం చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం మొత్తం 9 నిమిషాల్లో ముగిసింది. అనంతరం గవర్నర్‌తో సీఎం, 34 మంది మంత్రులు గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ వేడుకల్లో దర్బార్‌ ముందువైపు వరుసలో ఉదయనిధి తల్లి దుర్గా స్టాలిన్‌, సతీమణి కృత్తికా, సోదరి సెందామరై, ఆమె భర్త శబరీశన్‌, ఎంపీలు కనిమొళి, దయానిధి మారన్‌, ఎంకే అళగిరి కుమారుడు దురై దయానిధి తదితరులు ఆశీనులయ్యారు. ఇదే విధంగా పీఎంకే గౌరవాధ్యక్షుడు జీకే మణి, కాంగ్రెస్‌ ప్రచార ప్రతినిధి గోపన్నా, మణిదనేయ మక్కల్‌ కట్చి నాయకుడు జవాహిరుల్లా, సీసీఐ నేత ముత్తరసన్‌, సీపీఎం ఎమ్మెల్యే నాగై రవి, తమిళగవాళ్వురిమై కట్చి నాయకుడు వేల్‌మురుగన్‌, డీఎంకే ఎంపీలు తిరుచ్చి శివ, ఎ.రాజా, డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి, ప్రచార ప్రతినిధి టీకే ఎస్‌ ఇళంగోవన్‌, అడ్వకేట్‌ జనరల్‌ షణ్ముగసుందరం తదితరులు పాల్గొన్నారు. ఉదయనిధి స్నేహితుడైన పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ సతీసమేతంగా ప్రమాణస్వీకారానికి విచ్చేశారు.

సచివాలయంలో సందడి...

రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం ముగియగానే అందరి శుభాకాంక్షలు స్వీకరించిన అనంతరం మంత్రి ఉదయనిధి నేరుగా మెరీనాకు వెళ్లి తాత కరుణానిధి సమాధిపై పూలు చల్లి అంజలి ఘటించారు. అనంతరం ద్రావిడ సిద్ధాంత కర్త పెరియార్‌ సమాధి వద్ద అంజలి ఘటించారు. ఆ తరువాత సచివాలయానికి చేరుకున్న ఉదయనిధి తనకు కేటాయించిన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. సీనియర్‌ మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ తదితరుల సమక్షంలో తన శాఖకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. సీఎం ట్రోఫీ పోటీలకు సంబంధించి రూ.49కోట్లకు పైగా నిధులు కేటాయించే ఉత్తర్వులపై, పేదరికంతో ఇబ్బంది పడుతున్న కరూరు, తూత్తుకుడి, సేలం తదితర జిల్లాలకు చెందిన కబడ్డీ క్రీడాకారులకు మార్చి నుంచి ఆగస్టు వరకు నెలకు రూ.3 వేల చొప్పున పింఛన్‌ ఇచ్చే ఫైలుపై, అంతర్జాతీయ రైఫిల్‌ షూటింగ్‌లో రజత పతకం గెలుచుకున్న కోయంబత్తూరు జిల్లాకు చెందిన నివేదితకు రూ.4 లక్షల ప్రోత్సాహకం చెల్లించే ఫైలుపై ఉదయనిధి సంతకాలు చేశారు. నగరపాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ అందించిన కలంతో ఆయన ఈ మూడు ఫైళ్లపై సంతకాలు చేయడం విశేషం.

సినిమాలకు స్వస్తి: ఉదయనిధి

ఇకపై తాను సినిమాల్లో నటించే ప్రసక్తేలేదని మంత్రి ఉదయనిధి ప్రకటించారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ... కమల్‌హాసన్‌ నిర్మించనున్న చిత్రంలో నటించేందుకు గతంలో అంగీకరించానని, అయితే ఆ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించారు. మామన్నన్‌ చిత్రమే తన ఆఖరి చిత్రమవుతుందని స్పష్టం చేశారు. డీఎంకే యువజన విభాగం పదవిని పొందినప్పుడు, శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వారసత్వ రాజకీయాలంటూ ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేశారని, ప్రస్తుతం మంత్రి పదవిని చేపట్టడంపై కూడా అలాంటి విమర్శలే వస్తాయని తనకు తెలుసని వ్యాఖ్యానించారు. అలాంటి విమర్శలు చేసేవారికి సమర్థవంతమైన పనితీరుతోనే సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. దేశంలోనే రాష్ట్రాన్ని క్రీడల రాజధానిగా రూపొందించాలన్నదే తన ప్రధాన ఆశయమని మంత్రి ఉదయనిధి పేర్కొన్నారు.

Updated Date - 2022-12-15T09:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising