Voting Ends: ప్రశాంతంగా ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. అందరిచూపు అక్టోబర్ 19 పైనే..
ABN, First Publish Date - 2022-10-17T23:55:11+05:30
''ఈ రోజు కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను'' అంటూ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓటు వేయడానికి వచ్చిన సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగానే..
న్యూఢిల్లీ: ''ఈ రోజు కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను'' అంటూ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓటు వేయడానికి వచ్చిన సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగానే 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కీలక ఘట్టమైన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (congress president polls) సుఖాంతమైంది (Ends). సోమవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నం 4 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 63 పోలింగ్ కేంద్రాల్లో 9,000 మందికి పైగా పీసీసీ డెలిగేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 25 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడి ఎన్నికలు జరగడం, మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య ద్విముఖ పోటీ ఉన్నప్పటికీ ఎలాంటి ఫిర్యాదులకు, వివాదాలకు తావులేకుండా, ప్రశాంతంగా, పారదర్శకంగా పోలింగ్ ముగియడంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఊపిరిపీల్చుకుంది. బ్యాలెట్ బాక్సులో ఫలితాలు నిక్షిప్తం కావడంతో కౌంటింగ్ జరిగే ఆగస్టు 19వ తేదీపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
అధ్యక్షుడి బరిలో ఉన్న కర్ణాటక సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులోనూ, శశిథరూర్ కేరళలోనూ ఓటు వేశారు. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం, జైరామ్ రమేష్ వంటి పలువురు ప్రముఖులు ఏఐసీసీ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కర్ణాటకలోని బళ్లారిలో జోడాయాత్ర క్యాంప్ సైట్‌లో ఓటు వేశారు. ఆయా రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులు, డెలిగేట్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రశాంతంగా...పారదర్శకంగా
కాంగ్రెస్ పార్టీ 6వ అధ్యక్షుడి కోసం జరిగిన ఎన్నికలు అంత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా జరిగినట్టు, ఎన్నికల ప్రక్రియ తమకు పూర్తి సంతృప్తి నిచ్చిందని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు.
ఖర్గే, థరూర్ మధ్య వెల్లివిరిసిన సయోధ్య
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువంటూ ఆ పార్టీ నేతలు తరచు చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే కీలకమైన అధ్యక్ష ఎన్నికల్లో ద్విముఖ పోటీ నెలకొనడం, అధిష్ఠానం సైతం ఏ ఒక్కరి వైపు మొగ్గుచూపకుండా నచ్చిన వారిని ఎన్నుకోవాలని, అభ్యర్థులకు ప్రచారం చేయాలంటే ముందు తమ పోస్టులకు రాజీనామా చేయాలని, ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులు ప్రచారానికి వచ్చినప్పుడు పీసీసీ చీఫ్‌లు వారికి అవసరమైన ఏర్పాటు చేయాలని, ప్రచారంలో మాత్రం పాల్గొనరాదని కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసింది. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే ఖర్గే, శశిథరూర్ ఆయా రాష్ట్రాల్లో ప్రచారం సాగించారు. తమ ప్రత్యర్థిపై ఎలాంటి విమర్శలకు తావీయకుండా హుందాగా వ్యవహిరిస్తూ వచ్చారు. పార్టీ టాప్-3 నేతల్లో ఖర్గే ఒకరని శశిథరూర్ ప్రశంసించగా, శశిథరూర్ తన సోదర సముడని, విద్యాధికుడని ఖర్గే కొనియాడారు. ముఖ్యనేతల సపోర్ట్‌ను తాను ఎప్పుడూ ఆశించలేది, కార్యకర్తలే తన బలమని శశిథరూర్ ప్రచారం సాగించగా, అందర్నీ కలుపుకొని వెళ్లడం ద్వారా పార్టీ పటిష్టతకు పాటుపడతానని ఖర్గే ప్రచారం చేశారు. ఓటింగ్‌కు ముందు కూడా ఖర్గే, థరూర్‌లు ఫోనులో ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకొన్నారు. గెలుపు ఓటములు సహజమని, ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా కలిసికట్టుగానే తాము పార్టీ కోసం పనిచేస్తామని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
బ్యాలెట్స్ బాక్సుల్లో ఫలితం నిక్షిప్తం...
వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో నిక్షిప్తం చేస్తున్నారు. సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులను ఈనెల19న పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ తీసి, ఓట్లన్నింటినీ క్లబ్బింగ్ చేసి లెక్కింపు ప్రారంభిస్తారు. దీంతో ఏ రాష్ట్రం నుంచి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనేది సీక్రెట్‌గానే ఉండిపోతుంది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఫలితాలను ప్రకటిస్తారు.
ఎవరి ఆశలు వారివి...
పార్టీ అధిష్ఠానం నేరుగా ఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించనప్పటికీ ఖర్గే వైపు అధిష్ఠానం మొగ్గు ఉందని విశ్లేషకుల అంచనా. దీంతో ఖర్గే విజయం నల్లేరుమీద నడకేనని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, కార్యకర్తల బలాన్నే తాను నమ్ముకున్నట్టు మొదట్నించీ చెబుతున్న శశిథరూర్ సైతం తన గెలుపుపై ఆశాభావంతోనే ఉన్నారు. ఏదిఏమైనా శతాధిక వత్సరాల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడే 19వ తేదీ 'బిగ్ డే' కాబోతోంది.
Updated Date - 2022-10-17T23:55:11+05:30 IST