డిజిటల్ బ్యాంకింగ్‌తోనే స్థిర వృద్ధి
ABN, First Publish Date - 2022-10-17T08:39:53+05:30
పేదలకు బ్యాంకు సేవలను అందించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (డీబీయూ)ను అందుబాటులోకి తెస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.
- పేదలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యం
- 2014కు ముందు ఫోన్ బ్యాంకింగ్ రాజకీయాలు నడిచేవి
- సుపరిపాలన, మెరుగైన సేవలకు మాధ్యమంగా బ్యాంకింగ్: మోదీ
- దేశవ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల ప్రారంభం
- ఏపీలో రెండు, తెలంగాణలో మూడు యూనిట్లకు శ్రీకారం
న్యూఢిల్లీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): పేదలకు బ్యాంకు సేవలను అందించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (డీబీయూ)ను అందుబాటులోకి తెస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆదివారం ఆయన 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. 2014కు ముందున్న ‘ఫోన్’ బ్యాంకింగ్‌కు బదులుగా గత ఎనిమిదేళ్లుగా డిజిటల్ బ్యాంకింగ్‌ను ఉపయోగించడం ద్వారా దేశం స్థిరమైన వృద్థిని సాధించిందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంత పురోగతి సాధిస్తుందన్న ప్రధాని తాము అధికారంలోకి వచ్చాక బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను తీసుకొచ్చామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారంతా డిజిటల్ లావాదేవీలకు మారిపోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. బ్యాం కులు కూడా వ్యాపారులకు డిజిటల్ బ్యాంకింగ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ నేతృత్వంలో అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
డీబీయూల ప్రయోజనాలివి..
దేశంలోని ప్రతి ప్రాంతానికీ డిజిటల్ బ్యాంకింగ్‌ను అందుబాటులోకి తీసుకురావలనే ఉద్దేశంతో కేంద్రం ఈ యూనిట్లను ప్రారంభించింది. వీటి ఏర్పాటులో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 12 ప్రైవేట్ రంగ బ్యాంకులతోపాటు.. ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంకును భాగం చేసింది. ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లలో ప్రజలు పొదుపు ఖాతాలు (సేవింగ్ అకౌంట్)ను తెరవచ్చు. వారి ఖాతాలో డబ్బు ఎంత ఉందనే సమాచారం తెలుసుకోవచ్చు. వివరాలను పాస్‌బుక్‌లో ప్రింట్ తీసుకోవచ్చు. ఇతరుల ఖాతాల్లోకి డబ్బు పంపవచ్చు. క్రెడిట్-డెబిట్ కార్డ్‌లతోపాటు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.
Updated Date - 2022-10-17T08:39:53+05:30 IST