Skyroot Aerospace: భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేటు సంస్థ.. ఈ హైదరాబాదీ ‘స్కైరూట్’ గురించి మీకు తెలుసా?
ABN, First Publish Date - 2022-11-18T20:55:06+05:30
భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో నేటితో (శుక్రవారం) సరికొత్త చరిత్ర మొదలైంది. దేశంలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.
హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో నేటితో (శుక్రవారం) సరికొత్త చరిత్ర మొదలైంది. దేశంలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 11:30 గంటలకు జరిగిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఓ మైలురాయి అని ఇండియన్ స్పేస్ చైర్మన్ పవన్ కుమార్ గోయెంకా పేర్కొన్నారు.
నింగిలోకి దూసుకెళ్లిన ఆ రాకెట్ పేరు విక్రమ్-ఎస్. దీనిని హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’(Skyroot Aerospace) అభివృద్ధి చేసింది. పవన్ కుమార్ చందన, నాగ భరత్ దాక ఈ కంపెనీని ప్రారంభించారు. నిండా నాలుగు పదుల వయసులేని వీరు ఈ అత్యంత కష్టమైన, తీవ్ర పోటీ ఉన్న, అత్యంత ఖర్చుతో కూడిన ఈ రంగంలోకి ప్రవేశించడం సవాలుతో కూడుకున్న పనే. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నుంచి ఇంజినీరింగ్ (IITians), అంతరిక్ష సాంకేతికతలను అందిపుచ్చుకున్న వీరు 2018లో ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు.
వీరి స్టార్టప్ మింత్రా ఫౌండర్ ముకేశ్ బన్సాల్‌ను ఆకర్షించడంతో ఆయన రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత సోలార్ ఇండస్ట్రీస్, వేదాన్షు ఇన్వెస్ట్‌మెంట్స్ సహా మరికొందరు ఏంజెల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. తాము రూ. 31.5 కోట్లు సమీకరించగలమని పవన్ కుమార్ తెలిపారు. అలాగే, సింగపూర్‌కు చెందిన పెట్టుబడి సంస్థ జీఐసీ (GIC) ఈ ఏడాది ఏకంగా 51 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడులు కంపెనీ విశ్వాసాన్ని మరింత పెంచాయి.
గత ఐదేళ్లుగా దేశీయ స్పేస్ స్టార్టప్‌లు.. అగ్నికుల్, పిక్సెల్, వెస్టాస్పేస్, ఎక్స్‌సీడ్ స్పేస్, బెల్లాట్రిక్స్ వంటివి కూడా నిధులు సేకరించాయి. చెన్నైకి చెందిన అగ్నికుల్ 3డి ప్రింటెడ్ రాకెట్ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. అలాగే లో ఎర్త్ ఆర్బిట్‌లోకి చిన్నచిన్న ఉపగ్రహాలను పంపేందుకు ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో వాణిజ్య పరమైన ప్రయోగాలు ప్రారంభించనున్నట్టు దాని సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీనాథ్ రవిచంద్రన్ తెలిపారు. ఇస్రో వద్ద ఇప్పటికే 100 స్పేస్ స్టార్టప్‌లు రిజిస్టర్ చేసుకున్నట్టు చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ ఇటీవల తెలిపారు.
ఇక, స్కైరూట్ విషయానికొస్తే దాని ప్రధాన లక్ష్యం లాంచ్ వెహికల్స్‌ను డిజైన్ చేసి అభివృద్ధి చేయడం, చిన్న ఉపగ్రహాలను లో ఎర్ట్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడం. ప్రస్తుతం లాంచ్ వెహికల్ మార్కెట్ మల్టీ బిలియన్ డాలర్లుగా ఉంది. నాసా, ఏరియన్ స్పేస్, రష్యా, చైనా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ సెంటర్ వంటివి ఇందులో ప్రధానంగా ఉన్నాయి. అలాగే, ప్రైవేటు సంస్థలైన స్పేస్ ఎక్స్, జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఒరిజిన్’, రిచర్డ్ బ్రాన్స్‌కు చెందిన వర్జిన్ గెలాక్టిక్ వంటివి ఉన్నాయి. ఇవి పెద్ద ఉపగ్రహాలను లాంచ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కాగా, ఐస్రోతో ఎంవోయూ కుదుర్చుకున్న తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థగా స్కైరూట్ రికార్డులకెక్కింది.
Updated Date - 2022-11-18T20:56:45+05:30 IST