కర్ణాటక మదర్సాలో పూజలు
ABN, First Publish Date - 2022-10-07T10:13:10+05:30
కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న ఓ పురాతన మదర్సాలో దసరా రోజున కొందరు పూజలు నిర్వహించారు.
‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు
దసరా రోజున ఘటన, 9మందిపై కేసు
బెంగళూరు, అక్టోబరు 6: కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న ఓ పురాతన మదర్సాలో దసరా రోజున కొందరు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జై శ్రీరామ్, హిందూ ధర్మం జై’ అంటూ నినాదాలు చేశారు. దసరా ర్యాలీలో పాల్గొన్నవారే ఈ చర్యకు పాల్పడి ఉంటారని ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం కొందరు మదర్సా తాళం పగలగొట్టినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో బయటికొచ్చాయి. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ 9మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని స్థానిక పోలీసులు తెలిపారు. పలు ముస్లిం సంఘాలు ఈ సంఘటనను ఖండించాయి. శుక్రవారంలోగా బాధ్యులను అరెస్టు చేయాలని, లేనిపక్షంలో ప్రార్థనల అనంతరం భారీ ర్యాలీ చేపడతామని హెచ్చరించాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ఘటనపై స్పందించారు. ముస్లింలను అవమానించడానికి బీజేపీ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. 1460 ప్రాంతంలో ఈ మదర్సాను నిర్మించారు. ప్రస్తుతం ఇది భారత పురాతత్వ శాఖ పరిధిలో ఉంది. జాతీయ ప్రాముఖ్యం ఉన్న కట్టడాల జాబితాలో కూడా దీనికి చోటు లభించింది.
Updated Date - 2022-10-07T10:13:10+05:30 IST