ప్రధాని మోదీకి మాతృవియోగం హీరాబెన్ అస్తమయం
ABN, First Publish Date - 2022-12-31T04:38:31+05:30
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. హీరాబెన్ వయసు 99 ఏళ్లు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస
అంత్యక్రియలు పూర్తి.. పాడె మోసిన మోదీ
అంతిమ యాత్ర వాహనంలో శ్మశానానికి
దేశ, విదేశీ నేతలు, ప్రముఖుల సంతాపం
దుఃఖంలోనూ విధులకు మోదీ.. బెంగాల్ కార్యక్రమాలు వర్చువల్‌గా ప్రారంభం
నిస్వార్థ జీవి.. కష్టాల కోర్చిన ధీర వనిత
అమ్మను తలుచుకుంటూ మోదీ భావోద్వేగం
అహ్మదాబాద్, డిసెంబరు 30: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. హీరాబెన్ వయసు 99 ఏళ్లు. బుధవారం ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల పాటు వైద్యులు చికిత్స అందించారు. ‘‘హీరాబెన్ తెల్లవారుజామున 3.30కు చనిపోయారు’’ అని ఆస్పత్రి వర్గాలు శుక్రవారం ఉదయం ప్రకటించాయి. తల్లి మృతి విషయం తెలిసి మోదీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. అప్పటికే హీరాబెన్ మృతదేహాన్ని గాంధీనగర్ శివారు రేసన్ గ్రామంలో ఉన్న కుమారుడు పంకజ్ మోదీ ఇంటికి తరలించారు. అహ్మదాబాద్‌లో విమానం దిగిన తర్వాత నేరుగా తమ్ముడి ఇంటికి చేరుకున్న మోదీ.. తల్లి మృతదేహం వద్ద పుష్పాంజలి ఘటించారు. పాదాభివందనం చేశారు. హీరాబెన్ మృతదేహాన్ని అంతిమ యాత్ర వాహనంలోకి ఎక్కించడానికి ముందు.. ప్రధాని, ఆయన సోదరులు తల్లి పాడెను కొంతదూరం మోశారు. అంతిమ యాత్ర వాహనంలో ప్రధాని మోదీ.. గాంధీనగర్ సెక్టార్ 30లోని శ్మశానవాటికకు చేరుకున్నారు. కుమారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఉదయం 9.30 సమయంలో హీరాబెన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మాజీ సీఎంలు విజయ్ రూపానీ, శంకర్‌సింగ్ వాఘేలా, వ్యాపార దిగ్గజం గౌతమ్ ఆదానీ తదితరులు హాజరయ్యారు. మరోవైపు గత బుధవారం హీరాబెన్ అస్వస్థత పాలైన సంగతి తెలిసి మోదీ ఆస్పత్రిని సందర్శించారు. గంట పాటు అక్కడే ఉండి, వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అతి సామాన్య జీవనం..
కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, దేశానికి ప్రధాని అయినా హీరాబెన్ మాత్రం అతి సాధారణ జీవనాన్నే గడిపారు. దీపావళి, ఇతర పండుగల సందర్భంగా ఆశీస్సుల కోసం ఇంటికి వచ్చేవారిని ఎంతో సాదరంగా ఆహ్వానించేవారు. ఆమెను చూసి పరిసర ప్రాంతాల వారు ఎంతో గొప్పగా భావించేవారు. రేసన్‌లోని బృందావన్ బంగ్లా-2 సొసైటీలో పంకజ్ మోదీ నివాసంలో ఉండే హీరా బెన్‌ను ‘‘హీరాబా’’ అంటూ స్థానికులు గౌరవప్రదంగా పిలిచేవారు. ‘‘హీరాబా అందరితో కలిసిపోయేవారు. పండుగలన్నిట్లో పాల్గొనేవారు. ఏడేళ్లుగా ఇక్కడ ఉంటున్న ఆమెను మేం రోజూ కలిసేవారం’’ అని స్థానికురాలు కృతి పటేల్ తెలిపారు. పత్రి ఒక్కరితోనూ హీరాబెన్ సహృదయతతో మెలిగేవారని దారాబెన్ పటేల్ అనే వ్యక్తి పేర్కొన్నారు. కాగా, హీరాబెన్‌కు ఐదుగురు కుమారులు నరేంద్ర మోదీ, సోమా, అమృతా, ప్రహ్లాద్, పంకజ్, ఒక కుమార్తె వాసంతి బెన్ ఉన్నారు.
దుఃఖాన్ని దిగమింగి.. విధులకు మోదీ
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ శుక్రవారం కోల్‌కతా మెట్రోలో ఓ భాగం, హౌరా-న్యూ జల్పాయ్‌గురి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం సహా పశ్చిమబెంగాల్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో పాల్గొనాల్సి ఉంది. కానీ, తల్లి మృతితో వెళ్లలేకపోయారు. అయితే, గుజరాత్ రాజ్‌భవన్ నుంచి వర్చువల్‌గా ఆ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇంతటి బాధలోనూ కర్తవ్యాన్ని వీడని మోదీని ‘‘కర్మయోగి’’ అంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కొనియాడారు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సంతాపం
హీరాబెన్ మృతికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎల్‌కే ఆడ్వాణీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక తదితరులు సంతాపం తెలిపారు. పాకిస్థాన్, జపాన్, ఇజ్రాయిల్, నేపాల్, భూటాన్ ప్రధానులు షాబాజ్ షరీఫ్, కిషిదా, బెంజామిన్ నెతన్యాహు, ప్రచండ, లొటే షేరింగ్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె సహా పలువురు విదేశీ నేతలు హీరా బెన్ మృతికి సంతాపం ప్రకటించారు. ‘‘హీరాబెన్ వందేళ్ల సంఘర్షణాత్మక నిండు జీవితం భారతీయ ఆదర్శాలకు ప్రతిరూపం. మాతృదేవోభవ స్ఫూర్తితో తల్లి నుంచి ఆ గొప్ప లక్షణాలను ప్రధాని పుణికిపుచ్చుకున్నారు. హీరా బెన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. కాగా, ‘‘కుటుంబాన్ని పోషించేందుకు హీరా బా పడిన కష్టం అందరికీ ఆదర్శం. ఈ సమయంలో దేశం మొత్తం ప్రధాని మోదీ, ఆయన కుటుంబానికి అండగా నిలుస్తుంది’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
Updated Date - 2022-12-31T04:38:32+05:30 IST