నేటినుంచి పార్లమెంట్
ABN, First Publish Date - 2022-12-07T04:34:50+05:30
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేలా అన్ని రాజకీయ పార్టీల సహకారం కోరేందుకు కేంద్రం మంగళవారం అఖిలపక్ష
న్యూఢిల్లీ, డిసెంబరు 6: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేలా అన్ని రాజకీయ పార్టీల సహకారం కోరేందుకు కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 30కి పైగా పార్టీల నాయకులు హాజరయ్యారు. సమావేశాల అజెండాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వివరించారు. బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. పార్టీలు లేవనెత్తిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటామని, పార్లమెంటు నియమావళి, విధివిధానాల ప్రకారం చర్చలు జరుగుతాయన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఈడబ్ల్యూఎస్ కోటా తదితర ఆంశాలపై పార్లమెంట్‌లో చర్చించాలని అఖిలపక్ష భేటీలో విపక్షాలు డిమాండ్ చేశాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్న అంశాన్ని కాంగ్రెస్, టీఎంసీ లేవనెత్తగా ఆప్, ఎన్సీపీ, పలు ఇతర పార్టీలు మద్దతు పలికాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బీజేడీ, జనాభా నియంత్రణ బిల్లును ఆమోదించాలని షిండే వర్గానికి చెందిన శివసేన డిమాండ్ చేశాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, భారత్-చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభనపై సభలో చర్చ జరగాలని కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ప్రతిపాదించారు. కశ్మీరీ పండిట్ల హత్యలపై చర్చకు సభలో డిమాండ్ చేస్తామన్నారు. కాగా, ఈ నెల 29న ముగియనున్న పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 17 రోజుల పాటు సభా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ వ్యవధిలో 16 కొత్త బిల్లులకు ఆమోదం పొందాలని కేంద్రం యోచిస్తోంది.
Updated Date - 2022-12-07T04:34:51+05:30 IST