NIA: కోయంబత్తూరు కారు పేలుడు కేసులో FIR నమోదు
ABN, First Publish Date - 2022-10-27T19:41:20+05:30
చెన్నై: తమిళనాడు (Tamil Nadu) కోయంబత్తూరు కారు పేలుడు (Coimbatore Car blast) ఘటనపై దర్యాప్తు జరిపేందుకు రంగంలోకి దిగిన కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ..
చెన్నై: తమిళనాడు (Tamil Nadu) కోయంబత్తూరు కారు పేలుడు (Coimbatore Car blast) ఘటనపై దర్యాప్తు జరిపేందుకు రంగంలోకి దిగిన కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఉక్కడం ప్రాంతంలోని కోట్టై ఈశ్వరన్ ఆలయ సమీపంలో కారులో 5 రోజుల క్రితం పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. ఈకేసు దర్యాప్తును ఎన్‌ఐఏకి అప్పగించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే నిర్ణయించారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఫణీందర్‌రెడ్డి, డీజీపీ శైలేంద్రబాబు (DGP Sylendra Babu), పోలీసు శాఖ అడిషనల్ డైరెక్టర్ డేవిడ్‌సన్ దేవాశీర్వాదం తదితరులతో భేటీ అయిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కోవైలో ప్రస్తుత పరిస్థితి సమీక్షించిన సీఎం.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కారు పేలుడు ఘటన నిందితులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలడంతో కేసు విచారణ ఎన్‌ఐఏకి అప్పగించడమే సమంజసంగా ఉంటుందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ఆ మేరకు కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏకి అప్పగించాలని ఆయన ఆదేశించారు. అదే విధంగా కోయంబత్తూరులో భద్రత మరింత పెంచేలా కరుంబుకడై, సుందరపురం, గౌండమ్‌పాళయం వద్ద కొత్త పోలీసుస్టేషన్లను తక్షణమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇలాంటి పేలుళ్లు సంభవించకుండా ఉండేందుకు పోలీసుశాఖలో ప్రత్యేక దళం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేగాక కోయంబత్తూరు సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో జనసమర్థమైన ప్రాంతాల్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శక్తివంతమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగంలో అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. బాంబు దాడులు తదితర హింసాత్మక సంఘటనలపై ముందస్తు సమాచారమిచ్చేవారికి తగు భద్రత కల్పించాలని కూడా సీఎం నేతృత్వంలోని సమావేశం నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
కోయంబత్తూరులో దీపావళి సందర్భంగా రైల్వేస్టేషన్, కలెక్టర్ కార్యాలయం వంటి ఐదు చోట్ల బాంబులు పేల్చాలని జమీషా ముబిన్ కుట్ర పన్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇటీవల అతడి ఇంటిలో లభించిన ఓ రహస్యడైరీలోని సమాచారం మేరకు జమీషా ముబిన్ కోయంబత్తూరు నగరంలో బాంబు దాడులు జరిపేందుకే 70 కేజీలకు పైగా పేలుడు పదార్థాలను సేకరించి తన ఇంటిలో దాచినట్లు తేలింది. యూట్యూబ్ ద్వారా బాంబులను తయారు చేసే పద్ధతులను కూడా తెలుసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కోయంబత్తూరు నగరంలో దీపావళి పండుగ వేడుకలను పూర్తిగా భగ్నం చేయడానికి గాను రైల్వేస్టేషన్, కలెక్టర్ కార్యాలయం, కార్పొరేషన్ విక్టోరియా హాలు, రేస్‌కోర్స్, పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద బాంబు పేలుళ్లు జరపాలని ముబిన్ కుట్రపన్నాడు. ఈ ఐదు ప్రాంతాలను డైరీలో రాసి వాటి పక్కనే ఆంగ్లంలో ‘హిట్ లిస్ట్’ అని కూడా రాసాడు. దానిని అమలు పరిచేందుకు మారుతీ కారులో పేలుడు పదార్థాలను నింపుకుని తమ లక్ష్యం దిశగానే ఈ నెల 23వ తేదీ అతను బయలుదేరి వుంటాడని, ఈ లోగా సిలిండర్ పేలివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీల ప్రకారం జమీషా ముబిన్ నడుపుతున్న కారును ఉక్కడం కూడలి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూడగానే భయంతో జమీషా ముబిన్ కారు వేగంగా నడుపుకుంటూ వెళ్ళాడు. తనను అరెస్టు చేస్తారనే భయంతో అతను గ్యాస్ సిలిండర్‌ను లీక్ చేసి ఆత్మహుతి చేసుకుని వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
కారు సిలిండర్ పేలుడు ఘటనపై విచారణ జరిపేందుకు చెన్నైకి చెందిన ఎన్‌ఐఏ అధికారులు కోయంబత్తూరు చేరుకున్నారు. ఎన్‌ఐఏ డీఐజీ వందన, సూపరింటెండెంట్ శ్రీజిత్ తదితరులు పేలుడు ప్రాంతం వద్ద విచారణ జరిపారు. ఆ తర్వాత జమీషా ముబిన్ ఇంటిలో పట్టుబడిన పేలుడు పదార్థాలను పరిశీలించారు.
కారులో పేలుడు ఘటనకు సంబంధించి మరో 20 మందిని పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే జమీషా ముబిన్ అనుచరులు మహమ్మద్ తల్కా (25), మహమ్మద్ అజారుద్దీన్ (23), మహమ్మద్ రియాజ్ (27), ఫెరోజ్ ఇస్మాయిల్ (27), మహమ్మద్ నవాజ్ ఇస్మాయిల్ (26)లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మహమ్మద్ తల్కా అల్ ఉమా సంస్థ అద్యక్షుడు బాషా సోదరుడు నవాబ్‌ఖాన్ కుమారుడిగా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ ఐదుగురిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి విచారించగా అందిన సమాచారం మేరకు 20 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
పోలీసుల విచారణలో జమీషా ముబిన్ నడిపిన కారులో వున్న రెండు సిలిండర్లలో 14 కేజీల వంటగ్యాస్ సిలిండర్ మాత్రమే పేలింది. ఆ పేలుడు ధాటికి కారు రెండు ముక్కలైంది. ముబిన్ మంటల్లో తీవ్రంగా గాయపడి ఆ స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ కారులోనే తీసుకెళుతున్న 35 కేజీల పెద్ద సిలిండర్ పేలి ఉంటే ఆ ప్రాంతంలోని దేవాలయం సహా పలు భవనాలు నేలమట్టమయ్యేవని పోలీసులు తెలిపారు.
Updated Date - 2022-10-27T19:41:23+05:30 IST