Mangaluru blast case : కోలుకున్న నిందితుడు... పోలీసు దర్యాప్తు ప్రారంభం...
ABN, First Publish Date - 2022-12-01T20:26:06+05:30
కర్ణాటకలోని మంగళూరులో జరిగిన పేలుడు కేసులో నిందితుడు మహమ్మద్ షరీఖ్ తీవ్ర గాయాల నుంచి కోలుకున్నాడు.
బెంగళూరు : కర్ణాటకలోని మంగళూరులో జరిగిన పేలుడు కేసులో నిందితుడు మహమ్మద్ షరీఖ్ తీవ్ర గాయాల నుంచి కోలుకున్నాడు. దీంతో అతనిని పోలీసులు ప్రశ్నించడం ప్రారంభించారు. అతని స్టేట్‌మెంట్‌ను బుధవారం నమోదు చేసినట్లు మంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఎన్ శశి కుమార్ గురువారం తెలిపారు.
మంగళూరులోని కంకనాడి పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబరు 19న ప్రెషర్ కుక్కర్‌లో అమర్చిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లొజివ్ డివైస్ (IED) పేలిన సంగతి తెలిసిందే. షరీఖ్ ఓ ఆటో రిక్షాలో వెళ్తుండగా జరిగిన ఈ పేలుడులో షరీఖ్ గాయపడ్డాడు. 40 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అతనికి ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
శశి కుమార్ మాట్లాడుతూ, షరీఖ్ కోలుకున్నట్లు వైద్యులు తెలిపారని, అనంతరం బుధవారం షరీఖ్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేశామని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) ప్రకారం దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించాలని డీజీపీ ఆదేశించారని, దీంతో ఆ బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించే ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎన్ఐఏ సూచనల మేరకు దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
ఈ పేలుడులో గాయపడిన ఆటో డ్రైవర్ పురుషోత్తమ్ పూజారిని ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించినట్లు చెప్పారు. చికిత్స కొనసాగుతోందని, త్వరలోనే ఆయనను ఇంటికి పంపిస్తారని చెప్పారు.
షరీఖ్ వురపు ప్రేమ్ రాజ్‌పై మంగళూరులో రెండు కేసులు, శివమొగ్గలో ఒక కేసు దర్యాప్తులో ఉన్నాయన్నారు. అతను ఇంకా ఎంత కాలం ఆసుపత్రిలో ఉండాలో వైద్యులు చెప్పవలసి ఉందని తెలిపారు.
షరీఖ్ ఓ అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్ ప్రేరణతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అదనపు డీజీపీ (శాంతి భద్రతల విభాగం) అలోక్ కుమార్ చెప్పారు. కేరళలోని దీని మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోందన్నారు.
Updated Date - 2022-12-01T20:26:10+05:30 IST