Congress : కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే
ABN, First Publish Date - 2022-10-26T11:53:49+05:30
ఖర్గే బుధవారం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, జగ్జీవన్ రామ్‌లకు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) బుధవారం బాధ్యతలు చేపట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
ఖర్గే బుధవారం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, జగ్జీవన్ రామ్‌లకు నివాళులర్పించారు. ఆయన మంగళవారం మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిశారు.
ఇవి భావోద్వేగ క్షణాలు
కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో ఖర్గే మాట్లాడుతూ, ఇవి అత్యంత భావోద్వేగ క్షణాలని తెలిపారు. ఓ కూలీ కుమారునిగా, ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తగా, తాను పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడం అత్యంత భావోద్వేగంతో కూడిన సమయమని చెప్పారు. కాంగ్రెస్ ఔన్నత్యాన్ని కొనసాగించడం గర్వకారణమని పేర్కొన్నారు.
గొప్ప బాధ్యత : సోనియా
ఖర్గేను అభినందించిన సోనియా గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్ష పదవి అనేది అత్యంత గొప్ప బాధ్యత అని చెప్పారు. తాను తన విధులను అత్యంత నిజాయితీతో నిర్వహించేందుకు ప్రయత్నించానని చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికైనట్లు ఎలక్షన్ సర్టిఫికేట్‌ను ఖర్గేకు ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు.
థరూర్‌పై భారీ ఆధిక్యం
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో శశి థరూర్‌పై మల్లికార్జున ఖర్గే భారీ ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న జరిగిన ఈ ఎన్నికల్లో ఖర్గేకు 7,897 ఓట్లు, థరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి.
50 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన రెండో దళితునిగా ఖర్గే రికార్డు సృష్టించారు. 1970లో జగ్జీవన్ రామ్ ఈ పదవిని చేపట్టారు. గాంధీ కుటుంబీకులు కాని నేత ఈ పదవిని చేపట్టడం 24 ఏళ్ళలో ఇది రెండోసారి. ఖర్గేకు ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఆయన 1942 జూలై 21న కర్ణాటకలోని బీదర్ జిల్లాలో జన్మించారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో మరాఠీ మాధ్యమంలో చదువుకున్నారు. ఆయన బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నారు. తాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనుచరుడినని ఆయన ప్రకటించుకున్నారు.
1969లో ఇందిరా గాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. అదే సంవత్సరం ఖర్గే ఆ పార్టీలో చేరారు. అదే సంవత్సరం 27 ఏళ్ళ వయసులో కలబురగి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు.
ఖర్గే ముంగిట సవాళ్లు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన ఖర్గే ముందు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసన సభ ఎన్నికల సవాళ్ళు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు నవంబరు 12న జరగబోతున్నాయి. గుజరాత్ శాసన సభ ఎన్నికల షెడ్యూలు కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత ఆయనపై ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు వరుసగా రెండు ఎన్నికల్లో ఒకే పార్టీని గెలిపించరనే నానుడి ఉంది. ఈసారి కూడా అది నిజమై, బీజేపీని ఓడించి, కాంగ్రెస్‌ను గెలిపిస్తారనే భావన ఖర్గే అనుచరుల్లో ఉంది. మరోవైపు గుజరాత్‌లో బీజేపీని ఓడించే పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదని, ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ప్రచారం కూడా తక్కువ స్థాయిలోనే ఉందని స్థానిక మీడియా చెప్తోంది.
మరోవైపు 2024లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని అధికారానికి దూరం చేయడం ఖర్గేకు పెద్ద సవాలు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అక్టోబరు 24 నుంచి 26 వరకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Updated Date - 2022-10-26T11:53:54+05:30 IST