ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖర్గేకే కుర్చీ?!

ABN, First Publish Date - 2022-10-17T08:38:01+05:30

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సోమవారం(నేడు) జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గాంధీల కుటుంబం, సీనియర్లు ఆయన వెంటే
  • అసమ్మతి నేతలూ ఆ బాటే.. సుస్పష్టమవుతున్న ఫలితం
  • మనసు మార్చుకున్న థరూర్‌.. కలిసి సాగుతానని వెల్లడి
  • నేడు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు.. 9 వేల మంది ఓటర్లు
  • సోనియా, ప్రియాంక ఢిల్లీలో.. రాహుల్‌ కర్ణాటకలో ఓటు
  • బుధవారం ఫలితం ప్రకటన
  • 24 ఏళ్ల తర్వాత గాంధీయేతరులకు అధ్యక్ష బాధ్యతలు

న్యూఢిల్లీ/బెంగళూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సోమవారం(నేడు) జరగనున్నాయి. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఈ పదవి కోసం బరిలో నిలిచారు. కర్ణాటకకు చెందిన సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌లు.. పోటీ పడుతున్నారు. గాంధీల కుటుంబం, పార్టీలో సీనియర్లు ఖర్గేకే  మద్దతుగా ఉండడంతో ఆయన గెలుపు లాంఛనమేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జరుగుతున్న పరిణామాలతో రేసులో ఉన్న థరూర్‌ మనసు మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఎలక్టోరల్‌ కాలేజీలోని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు సహా మొత్తం 9 వేల మంది ఈ ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎన్నికల ప్రక్రియ రహస్య బ్యాలట్‌ విధానంలో జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం సహా దేశవ్యాప్తంగా 65 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ఇది ఆరోసారి. పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోను, జోడో యాత్రలో ఉన్న రాహుల్‌గాంధీ కర్ణాటకలోని బళ్లారిలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరో 40 మంది ప్రతినిధులు ఇక్కడే ఓటు వేయనున్నారు. 

 

థరూర్‌పై యువకుల్లో క్రేజ్‌

అధ్యక్ష రేసులో ఉన్న 66 ఏళ్ల శశి థరూర్‌కు యువ నాయకులు కలిసివచ్చే అవకాశం ఉంది. ఆయన ఎక్కడ ప్రచారం నిర్వహించినా.. యువ నాయకత్వం ఆయనకు స్వాగతం పలకడం.. ఆయనతో కలిసి చర్చించడం వంటివి.. యువత తనకు మద్దతిస్తుందని థరూర్‌ భావించేలా చేశాయి. ఐక్యరాజ్యసమితిలో సుదీర్ఘకాలం పనిచేసిన థరూర్‌.. మంచి వాక్చాతుర్యం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. అదేవిధంగా మనసులో ఏమీ దాచుకోరనే అభిప్రాయం ఉంది. 2009లో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లండన్‌లో జన్మించిన థరూర్‌ ఉన్నత విద్యను అభ్యసించారు. 


ఖర్గేకు కలిసివచ్చేవి ఇవీ..

కర్ణాటకకు చెందిన 80 ఏళ్ల మల్లికార్జున ఖర్గే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈయనకు గాంధీ కుటుంబం సహా సీనియర్‌ నేతలు మద్దతిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఇతర పార్టీ నేతలతో స్నేహ సంబంధాలు ఆయనకు కలిసివస్తున్నాయి. బీదర్‌ జిల్లాలోని వరవట్టిలో ఓ పేద కుటుంబంలో జన్మించారు. న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 55 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఖర్గే.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదిలావుంటే.. ఇద్దరు నేతలూ గాంధీ కుటుంబానికి అత్యంత విధేయులు. ఈ విషయంపై ఖర్గే మాట్లాడుతూ.. గాంధీల కుటుంబానికి పార్టీలో ప్రత్యేక స్థానం ఉందని.. భవిష్యత్తులో వారి ‘దిశానిర్దేశం’, ‘సలహాలు’ తీసుకుంటానని తెలిపారు. ఈ విషయంలో సంకోచించనని అన్నారు.  కాగా, కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికను పక్కా రహస్యంగా నిర్వహిస్తున్నట్టు పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ తెలిపారు. బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం వెల్లడిస్తామన్నారు.


ఖర్గేతో కలిసి పనిచేస్తా!థరూర్‌ యూటర్న్‌

కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో ఆది నుంచి ఉత్సాహంగా ఉన్న శశిథరూర్‌ చివరి నిముషంలో యూటర్న్‌ తీసుకున్నారు. గాంధీ కుటుంబం, సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే వైపే మొగ్గుచూపుతున్నట్టు సంకేతాలు అందుతుండడంతో థరూర్‌ తన మనసు మార్చుకున్నారు. జీ-23లోని నాయకులు కూడా ఖర్గేకే అనుకూలంగా ఉన్నట్టు థరూర్‌ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ‘‘కాంగ్రెస్‌ సిద్ధాంతాలతో ఎలాంటి సమస్యా లేదు’’ అని మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఖర్గేతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమేనని, కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

Updated Date - 2022-10-17T08:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising