Fighter jet : భారతీయ రఫేల్ వచ్చె!
ABN, First Publish Date - 2022-12-16T01:25:40+05:30
భారత్ కోరుకున్న విధంగా, మరిన్ని హంగులతో రఫేల్ వచ్చేసింది. భారత అధికారుల సూచన మేరకు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేసిన 36వ రఫేల్ భారత్‌లోకి
మనం కోరుకున్న హంగులతో ఫైటర్ జెట్
భారత్‌కు చేరుకున్న ఆఖరి యుద్ధ విమానం
ఫ్రాన్స్‌తో రఫేల్ డీల్ ముగిసింది: వాయుసేన
న్యూఢిల్లీ, డిసెంబరు 15: భారత్ కోరుకున్న విధంగా, మరిన్ని హంగులతో రఫేల్ వచ్చేసింది. భారత అధికారుల సూచన మేరకు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేసిన 36వ రఫేల్ భారత్‌లోకి అడుగుపెట్టింది. ఫ్రాన్స్‌కు చెందిన దసో కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా రఫేల్ యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా భారత్‌కు చేరింది. దీంతో ఫ్రాన్స్‌తో రఫేల్ డీల్ ముగిసినట్టయింది. ఈ మేరకు 36వ రఫేల్ యుద్ధ విమానం కూడా భారత్‌కు చేరిందని భారత వాయుసేన గురువారం ట్వీట్ చేసింది. ‘ప్యాక్ పూర్తయింది’ అని వ్యాఖ్యానించింది. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో రూ.59వేల కోట్ల వ్యయంతో 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్, ఫ్రాన్స్ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది. విడతలవారీగా ఇప్పటివరకు 35 ఎయిర్‌క్రా్‌ఫ్టలు భారత్‌కు చేరుకున్నాయి. అయితే 36వ యుద్ధ విమానానికి సంబంధించిన సాంకేతికతను మెరుగుపర్చాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలో భారత్ సూచించిన నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారీ కంపెనీ భారత్‌కు అప్పగించింది. కాగా.. ఒప్పందం ప్రకారం రాఫెల్ పూర్తి స్థాయిలో భారత గడ్డపై అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉందని భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ లెనైన్ అన్నారు.
కొత్తగా.. మరింత శక్తిమంతంగా..
కొత్తగా మెరుగులద్దుకుని భారత్‌లో అడుగుపెట్టిన రాఫెల్ గత 35 ఎయిర్‌క్రా్‌ఫ్టల కంటే మరింత శక్తిమంతమైన ప్రదర్శన చేయగలదు. భారత సూచన మేరకు దీనిలో అత్యంత శక్తిమంతమైన రేడియో ఆల్టీమీటర్, రాడార్ వార్నింగ్ రిసీవర్, లో-బ్యాండ్ జామర్, ఫ్లైట్ డేటా రికార్డర్, హై-ఆల్టిట్యూడ్ ఇంజన్ స్టార్ట్-అప్, సింథటిక్ అపాచర్ రాడార్, గ్రౌండ్ మూవింగ్ టార్గెట్ ఇండికేటర్లు ఏర్పాటు చేశారు. ట్రాకింగ్, ఇన్ఫ్రా రెడ్ సెర్చ్, ట్రాక్, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, మిసైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్తోపాటు హై ఫ్రీక్వెన్సీ రేంజ్ డికాయ్‌లు దీనిలో ఉన్నాయి. కాగా, చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో రాఫెల్ యుద్ధ విమానాల చేరికతో భారత రక్షణ రంగం మరింత బలం పుంజుకుంది. కాగా, నేవీలో ఆపరేషనల్ అవసరాలు తీర్చడానికి సూపర్ హార్నెట్ యుద్ధ విమానాల కంటే రాఫెల్ మరింత అనుకూలంగా ఉంటుందని నావికాదళం కూడా తెలిపింది.
రాఫెల్ ఫైటర్ జెట్ పొడవు 15 మీటర్లు. వెడల్పు 11 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు.
ఇది గంటకు గరిష్టంగా 1389కి.మీ వేగంతో దూసుకెళ్లగలదు. ఏకబిగిన 3700కి.మీ. ప్రయాణించగలదు.
50వేల అడుగుల ఎత్తులో సైతం ఎగరగల రాఫెల్ లో గాలిలోనే ఇంధనాన్ని నింపుకోగల వ్యవస్థ ఉంది.
గాలిలో నుంచి భూమిపైన 300కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలు, గాలిలో నుంచి గాలిలోనే 150కి.మీ. దూరంలోని లక్ష్యాలపైకి క్షిపణిని ప్రయోగించగలదు. అణు క్షిపణిని సైతం ప్రయోగించగలదు.
ఇది ఒకేసారి 9,500 కిలోల బరువున్న ఆయుధాలను మోసుకెళ్లగలదు.
రాఫెల్‌కు అన్నివైపులా నిఘాపెట్టే సామర్థ్యం ఉంది.
Updated Date - 2022-12-16T01:25:43+05:30 IST