ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాయావతి ఆకర్షణ తగ్గడానికి కారణాలివే!

ABN, First Publish Date - 2022-03-10T19:12:07+05:30

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)కి ఘోర పరాభవం ఎదురైంది. 403 స్థానాల్లో కేవలం 5 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కనిపిస్తోంది. ఆ పార్టీ చీఫ్ మాయావతి ప్రభావం నామమాత్రమైపోయింది. ఆ పార్టీకి గట్టి మద్దతుదారులైన దళితులు ఈసారి సందిగ్ధంలో పడటంతో పరాజయానికి బాటలు పడ్డాయి. 


కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా బీఎస్‌పీని, మాయావతిని ప్రశంసించడం బీజేపీకి ప్రయోజనం చేకూర్చిందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, ఎస్‌పీ ప్రధాన పోటీదారులుగా ప్రచారం జరగడంతో దళితులు సందిగ్ధంలో పడ్డారని చెప్తున్నారు. మరోవైపు నాలుగుసార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన మాయావతి పనితీరును మార్చుకోకపోవడం, నిధుల కొరత వల్ల ఓటర్లకు దగ్గరవలేకపోయారని కూడా కొందరు చెప్తున్నారు. ఆమె ఈ ఎన్నికల ప్రచారంలో దాదాపు కనిపించలేదు. అతి తక్కువ ప్రచార సభల్లో మాత్రమే ఆమె ప్రచారం చేశారు. 


జాతవ్ కులాల ఓటర్లు బీఎస్‌పీని వదిలి, ఎస్‌పీ, బీజేపీలలో ఏదో ఒకదానిని ఎంచుకోవడం వల్ల బీఎస్‌పీ దెబ్బతిన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి ఓ కారణం ఏమిటంటే, గడచిన పదిహేనేళ్ళలో బీఎస్‌పీ కేడర్ బేస్డ్ పార్టీ నుంచి వ్యక్తి ప్రాధాన్యంగల పార్టీగా మారడమేనని చెప్తున్నారు. స్థానిక నేతలు పార్టీ యంత్రాంగంతో సంబంధాన్ని కోల్పోయారని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ బహిరంగ సభలకు తగిన ఏర్పాట్లను చేయడానికి స్థానిక నేతలు ముందుకు రాలేదని చెప్తున్నారు. 


గత పదేళ్ళలో స్థానిక నేతలు బీఎస్‌పీని వీడి, ఇతర పార్టీలకు వెళ్ళిపోవడంతో మాయావతికి, ఓటర్లకు మధ్య అనుసంధానం కుదరలేదు. మరోవైపు కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడంతో ఓటర్లను ఆకర్షించడానికి మాయావతికి మిగిలిన ముఖ్యమైన మార్గం మూసుకుపోయింది. ఫలితంగా ఆ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారింది. 


ఎన్నికల్లో వరుస పరాజయాలు కూడా బీఎస్‌పీపై ఓటర్లు నమ్మకం కోల్పోవడానికి మరో కారణమైంది. ఈ ఒక్కసారి మాత్రమే మాయవతికి ఓటు వేస్తామని, తర్వాత మరొక పార్టీకి ఓటు వేస్తామని చాలా మంది ఓటర్లు 2017లో చెప్పినట్లు మీడియాలో వచ్చింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో బీఎస్‌పీ పొత్తు పెట్టుకుంది. దీంతో బీఎస్‌పీ కేడర్‌లో కాస్త ఉత్తేజం వచ్చింది. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. 


మాయావతికి నిరంతరం మద్దతివ్వడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయనే భావన కూడా అధికారులు, ఓటర్లలో వచ్చినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. మాయావతికి మద్దతిచ్చిన అధికారులను 2012-17 మధ్య కాలంలో అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఇబ్బందులే ఎదురయ్యాయని తెలుస్తోంది. 


బీజేపీ వ్యూహం కూడా బీఎస్‌పీ దెబ్బతినడానికి మరొక కారణమని చెప్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌‌లో యాదవులు, జాతవ్‌లు, ముస్లింలు మినహా, అగ్ర వర్ణాలు, బీసీలు, ఎస్సీలతో ఓ కూటమిని ఏర్పాటు చేయడంలో బీజేపీ విజయం సాధించినట్లు తెలుస్తోంది. 


అఖిలేశ్ యాదవ్ అనుసరించిన వ్యూహం కూడా బీఎస్‌పీని దెబ్బతీసిందని పరిశీలకులు చెప్తున్నారు. తన నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన తప్పులను పునరావృతం కానివ్వబోనని ఎస్సీలకు ఆయన గట్టి హామీ ఇచ్చారు. బీఎస్‌పీలోని దళిత నేతలకు ఎర్ర తివాచీ స్వాగతం పలికారు. రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పోటీ చేయిస్తానని హామీ ఇచ్చారు. బీఎస్‌పీ నుంచి వచ్చిన శక్తిమంతులైన ఎస్సీ నేతలను రిజర్వుడు నియోజకవర్గాల్లో నిలిపారు. తాను మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఎస్సీ అధికారులకు పెద్ద పీట వేస్తానని హామీ ఇచ్చారు. ఈ కారణాలన్నీ మాయావతి ఆకర్షణ తగ్గడానికి దోహదపడ్డాయని పరిశీలకులు చెప్తున్నారు. 


Updated Date - 2022-03-10T19:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising