Gali Janardhan Reddy: 25న రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తా
ABN, First Publish Date - 2022-12-22T11:54:03+05:30
తన భవిష్యత్ రాజకీయ నిర్ణయాన్ని ఈనెల 25న ప్రకటిస్తానని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి
- మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి
రాయచూరు(బెంగళూరు), డిసెంబరు 21 : తన భవిష్యత్ రాజకీయ నిర్ణయాన్ని ఈనెల 25న ప్రకటిస్తానని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) పేర్కొన్నారు. బుధవారం మస్కికి వెళ్లే ముందు సింధనూరులోని పారిశ్రామిక వేత్త రమేశ్ నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీలో కొనసాగాలా..? లేకా కొత్త పార్టీని ఏర్పాటు చేయాలా..? అన్నదానిపై శ్రేయోభిలాషులు, సన్నిహితులు, మిత్రులు, సహచరులతో సుధీర్ఘ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తనకు అత్యంత ముఖ్యమైన, తన రాజకీయ జీవితానికి ప్రోత్సాహాన్నిచ్చిన గంగావతి, సింధనూరు(Gangavati, Sindhanur) పరిసరాల్లో తన శ్రేయోభిలాషులను కలిసేందుకే జిల్లా పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. సింధనూరు ప్రాంతం పట్ల తనకున్న సాన్నిహిత్యం, మక్కువ మాటల్లో చెప్పలేనని ఉద్వేగంగా పేర్కొన్నారు. వ్యాపారపరంగా తొలినాళ్లలో ఇక్కడ సాధారణ వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించిన నాడు ఈ ప్రాంతవాసులు తనకు అందించిన సహకారం మరువలేదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించి పెట్టేందుకు ఇక్కడి వారే తనకు సహకరించారని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉన్న కొన్నినాళ్లు ప్రజల మధ్య గడపాలన్నది తన అభిలాష అని, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే రాజకీయాల్లో తిరిగి క్రియాశీలం అయ్యేందుకు నిర్ణయించినట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే అందరి సలహా సూచనల మేరకు ఈ నెల 25న భవుష్యత్ ప్రణాళికకు సంబంధించి తుది నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
Updated Date - 2022-12-22T11:54:07+05:30 IST