ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీపై మన్మోహన్ సింగ్ ఆగ్రహం

ABN, First Publish Date - 2022-02-17T20:47:38+05:30

అత్యంత అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాన మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అత్యంత అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గురువారం ఓ వీడియో సందేశంలో నరేంద్ర మోదీపైనా, ఆయన ప్రభుత్వంపైనా తీవ్రంగా మండిపడ్డారు.  ప్రధాన మంత్రి పదవికి ప్రత్యేకమైన హుందాతనం ఉంటుందని చెప్పారు. ప్రతి సమస్యకు భారత దేశ తొలి పీఎం జవహర్లాల్ నెహ్రూను నిందించడమేమిటని నిలదీశారు. కాంగ్రెస్ ఎన్నడూ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజించలేదన్నారు. సత్యాన్ని మరుగుపరచలేదన్నారు. 


కాంగ్రెస్ విడుదల చేసిన వీడియో సందేశంలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, ఓవైపు ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్యలను ఎదుర్కొంటున్నారని, మరోవైపు ఏడున్నరేళ్ళ నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ తప్పులను అంగీకరించి, సరిదిద్దుకోవడానికి బదులుగా, ప్రజా సమస్యల విషయంలో తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూను నిందిస్తోందన్నారు. 


ప్రధాన మంత్రి పదవికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని తాను భావిస్తున్నానని చెప్పారు. తప్పులకు ప్రాధాన్యాన్ని తగ్గించడానికి చరిత్రను నిందించడం కన్నా పీఎం హుందాగా వ్యవహరించాలన్నారు. తాను ప్రధాన మంత్రిగా ఉన్న పదేళ్ళ కాలంలో తాను తన పని ద్వారా మాట్లాడానన్నారు. ప్రపంచం ముందు దేశం పరువు పోయేలా చేయలేదన్నారు. తాను ఎన్నడూ భారత దేశ ఔన్నత్యానికి విఘాతం కలిగించలేదని చెప్పారు. 


బలహీనుడు, మౌన ముని, అవినీతిపరుడు అంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేసిన తర్వాత, ఇప్పుడు బీజేపీ, దాని బీ, సీ జట్ల బండారం దేశం ముందు బయటపడుతోందనే సంతృప్తి తనకు ఉందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఆర్థిక విధానంపై అవగాహన లేదని దుయ్యబట్టారు. ఇది దేశానికే పరిమితమైన సమస్య కాదన్నారు. విదేశాంగ విధానంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందని, చైనా మన సరిహద్దుల్లో తిష్ఠవేసుకుని కూర్చుందని చెప్పారు. చైనా దాడులను మరుగుపరచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నేతలను బలవంతంగా కౌగిలించుకోవడం, ఊయల ఊగడం, బిర్యానీలు తినిపించడం ద్వారా విదేశాంగ విధానాన్ని నిర్వహించడం సాధ్యం కాదని పీఎం మోదీ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానిది బూటకపు జాతీయవాదమని, విభజన విధానమని దుయ్యబట్టారు. 


‘‘స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం మేం ఎన్నడూ దేశాన్ని విభజించలేదు. సత్యాన్ని దాచడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. దేశ ఔన్నత్యాన్ని లేదా ప్రధాన మంత్రి పదవి ప్రత్యేకతను మేం ఎన్నడూ తగ్గించలేదు. నేడు ప్రజలు విభజనకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వ బూటకపు జాతీయవాదం శూన్యం, ప్రమాదకరం. వీరి జాతీయవాదానికి ఆధారం ‘విభజించు, పాలించు’ అనే బ్రిటిష్ విధానం. రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడుతున్నాయి’’ అని మండిపడ్డారు. 


ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక విధానంలో స్వార్థం, దురాశ ఉన్నాయన్నారు. వారి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం దేశ ప్రజలను విడగొడుతున్నారని, పోట్లాడుకునేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-02-17T20:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising