Nuclear War: అణుయుద్ధం అవకాశాలు పెరుగుతున్నాయి: ఎలాన్ మస్క్
ABN, First Publish Date - 2022-10-11T20:47:00+05:30
ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఎప్పుడు దీనికి ఎప్పుడు తెరపడుతుందో ..
ప్రెటోరియా: ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఎప్పుడు దీనికి ఎప్పుడు తెరపడుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పాశ్చాత్య దేశాల సాయంతో రష్యాను ఢీకొంటున్న ఉక్రెయిన్ ఈ యుద్ధంలో సత్ఫలితాలు సాధిస్తుండటంతో రష్యా ఇందుకు అణ్వస్త్రంతో (Nuclear weapon) దీటుగా సమాధానం చెప్పే అవకాశాలున్నాయనే భయాలు మళ్లీ పెరుగుతున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ సంక్షోభం విషయంలో ఇటీవల ట్విట్టర్ వేదికగా శాంతిప్రణాళిక ప్రతిపాదనలు చేసి విమర్శల పాలైన ప్రపంచ కుంబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి స్పందించారు. ''అణు యుద్ధం అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి'' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన శాంతి ప్రణాళికలో తూర్పు ఉక్రెయిన్, క్రిమియాలోని ఆక్రమిత ప్రాంతాల ప్రజలు ఉక్రెయిన్‌లో ఉండాలనుకుంటున్నారో, రష్యాలో జీవించాలనుకుంటున్నారో తేల్చుకోవాలని అన్నారు. రష్యా తాజాగా ఆక్రమించిన ప్రాంతాల్లో ఐరాస పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. ప్రజల ఇష్టమైతే ఆ ప్రాంతాలు రష్యాకు వెళ్లిపోతాయని సూచించారు. ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ అధికారులతో పాటు, ఉక్రెయిన్ అనుకూలవాదులు తోసిపుచ్చారు. బహిరంగంగానే ఎలాన్ మస్క్‌పై విమర్శలు గుప్పించారు.
కాగా, తాజాగా ఎంఐటీ (ఎంఐటీ) ప్రొఫెసర్, మెషీన్ లెర్కింగ్ రీసెర్చర్ మాక్స్ టెగ్మార్క్ నుంచి ఎలాన్ మస్క్ ప్రసంశలు అందుకున్నారు. గ్లోబల్ న్యూక్లియర్ వార్‌కు ఆరింట ఒక వంతు అవకాశం (వన్ ఇన్ సిక్స్ ఛాన్స్) ఉందని టెగ్మార్క్ అన్నారు. ఉద్రిక్తతలు తగ్గాలని కోరుతున్న మస్క్, తదితరులను ఆయన ప్రశంసించారు. ఇది అన్ని దేశాల జాతీయ భద్రతకు ముఖ్యమని అన్నారు. టెగ్మార్క్ ట్వీట్‌కు మస్క్ వెంటనే ప్రతిపాదించారు. ''అణుయుద్ధం అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి'' అని మస్క్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
చైనా-తైవాన్ వివాదం పరిష్కారంపై కూడా...
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారం కోసం గతంలో ప్రతిపాదన చేసి విమర్శల పాలైన్ ఎలాన్ మస్క్ ఇటీవల చైనా-తైవాన్ వివాద పరిష్కారంపై కూడా కీలక వ్యాఖ్యలుచేశారు. తైవాన్‌పై కొంత నియంత్రణను బీజింగ్‌కు అప్పగించడం ద్వారా ఇదుదేశాల మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించవచ్చని సూచించారు. ఆయన వాదనను తైవాన్ అధికారిక డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ ప్రతినిధి ఒకరు తిప్పికొట్టారు. 23 మిలియన్ల తైవాన్ వాసులు ప్రజాస్వామ్యయుత స్వేచ్ఛ, సార్వభౌమాధికారంపై అజాగ్రత్తగా మాట్లాడటం తగదని నిశిత వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2022-10-11T20:47:00+05:30 IST