Drone Protection Force: చెన్నైకి ‘డ్రోన్ ప్రొటెక్షన్ ఫోర్స్’
ABN, First Publish Date - 2022-12-16T07:17:16+05:30
చెన్నై మహానగరంలో ‘డ్రోన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ (డ్రోన్ రక్షక దళం) అందుబాటులోకి రానుంది. దీన్ని రూ.3.50 కోట్లతో ఏర్పాటు చేశారు.
- రూ.3.50 కోట్లతో ఏర్పాటు
- త్వరలో ప్రారంభించనున్న సీఎం
చెన్నై, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): చెన్నై మహానగరంలో ‘డ్రోన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ (డ్రోన్ రక్షక దళం) అందుబాటులోకి రానుంది. దీన్ని రూ.3.50 కోట్లతో ఏర్పాటు చేశారు. చెన్నై నగర పోలీస్ పరిధిలో ఏర్పాటు చేసే ఈ డ్రోన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) త్వరలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ ఫోర్స్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం రూ.3.50 కోట్లతో 9 డ్రోన్లు కొనుగోలు చేశారు. వీటిని త్వరలోనే నగర పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్ అప్పగించి, లాంఛనంగా ఈ రక్షణ దళాన్ని ప్రారంభించనున్నారు. డ్రోన్ కంట్రోల్ రూంను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఇక్కడి నుంచే ఈ డ్రోన్ల పనితీరును పర్యవేక్షిస్తారు. ఈ డ్రోన్లు 2 గంటల పాటు 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. మెరీనా తీరం నుంచి నీలాంగరై వరకు సముద్రతీరం గస్తీ కోసం కోసం వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతాల మధ్య ఈ డ్రోన్లకు రెండు గంటల సమయం పడుతుంది. వీటిలో అమర్చిన అత్యాధునిక కెమెరాలతో ఆయా ప్రాంతాల్లో ఉండే పరిస్థితిని కంట్రోల్ రూం నుంచి స్పష్టంగా చూడొచ్చు. ఒక్కో డ్రోన్ 5 కేజీల బరువుంది. వీటిని పోలీసులే ఆపరేట్ చేస్తారు. ఇవి ప్రయాణించే మార్గాన్ని జీపీఎస్ ద్వారా దిశానిర్దేశం చేస్తారు. మార్గమధ్యంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దిశ మార్చే సౌలభ్యం కూడా ఉంది. చెన్నై నగరంలో నేరాలు, దోపిడీలు, చోరీలతో పాటు అసాంఘిక, సంఘ విద్రోహ కార్యకలాపాల అడ్డుకట్టకు ఇవి బాగా ఉపయోగపడతాయని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు సైతం వెళ్ళలేని కొన్ని ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా నిఘా వేయనున్నారు. నగరంలో అడయార్ నది 35 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ నదికి ఇరువైపులా పది అడుగుల దూరం వరకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా కొడుంగయూరు, పెరుంగుడి చెత్త డంపింగ్ యార్డుల్లో పోలీసులు లేదా పారిశుధ్య కార్మికులు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో పలు రకాలైన అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా వేయనున్నారు. ముఖ్యంగా డ్రోన్లలో అమర్చిన అత్యాధునిక కెమెరాలు ఫొటోలను తీసి కంట్రోల్ రూంకు చేరవేస్తాయి. ఈ డ్రోన్లను అన్నా విశ్వవిద్యాలయంలోని ప్రయోగశాలలో నిశితంగా పరిక్షిస్తున్నారు. ఈ డ్రోన్లు అందుబాటులోకి వస్తే, నగరంలోని రహస్య ప్రాంతాల్లో సైతం నిఘా సారించేందుకు వీలవుతుంది.
Updated Date - 2022-12-16T07:17:18+05:30 IST